Thursday, August 18, 2022
HomeLifestylespecial Editionబుర్రకథా పితామహుడు నాజర్

బుర్రకథా పితామహుడు నాజర్

ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, నటుడు, ప్రజారచయిత, గాయకుడు. ” ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు” అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.
అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన గొప్ప ప్రతిభాశాలి షేక్‌ నాజర్.

నాజర్ ప్రతిభకు ముగ్ధుడైన సినీ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా కొనసాగిన ప్రజా గాయకుడు నాజర్.

బుర్రకథా పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ (ఫిబ్రవరి 5, 1920 – ఫిబ్రవరి 22, 1997) బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత, గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకులముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5 వ తేదీన షేక్‌ మస్తాన్‌, బీబాబీలకు దంపతులకు జన్మించారు. నాజరు పూర్తి పేరు “షేక్ నాజరు వలి”. మహ్మదీయ సభ పేరిట నాటకా లాడి మంచిపేరు గడించారు. ఆయన కృష్ణలీలలో దేవకి, శ్రీ కృష్ణ తులాభారంలో రుక్మిణి, భక్త రామదాసులో ఛాందిని వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి పాత్రలు పోషించారు. పాఠశాల స్థాయిలో “ద్రోణ” పాత్రకు జీవం పోశారు. ఆర్యమత సిద్ధాంతం నచ్చి మాంసాహారం మానేశారు. నాస్తికుడయ్యారు.

తెనాలిలోని “బాలరత్న నాటక సమాజం”లో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్య మండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశారు. వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతం మీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించు కున్నది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించారు. పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి… పింజారీ అనే పుస్తకంగా ప్రచురించాడు. కొంతకాలం విరసం సభ్యులుగా ఉన్నారు.

అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, పుట్టిల్లు, మనుషులంతా ఒక్కటే – సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి. పూల రంగడు సినిమాలో “అక్కినేని”కి నేర్పించారు. చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పారు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, “ఆసామీ” నాటకాన్ని రచించారు. ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఆసామీ నాటకం ప్రథమ బహుమతి పొందింది. నాజర్‌ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు.

ఆంధ్రనాటక అకాడమీ 1981లో “ఉత్తమ కళాకారుడు” అవార్డుతో సత్కరించింది. 1986 లో భారత ప్రభుత్వం “పద్మశ్రీ” బిరుదుతో నాజరును సత్కరించింది. రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవా చార్యులు, నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించు కోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె. అబ్బాస్ నాజరును “ఆంధ్ర అమరషేక్” అని అభివర్ణించడం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజా భాషకు ముగ్ధుడై ”నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో” అని ఆలింగనం చేసుకోవడం, నాజరు లోని కళా ప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు.

“నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్‌ దగ్గర శిక్షణ తీసుకోవటం నా నట జీవితానికి పట్టం కట్టింది” అని ప్రముఖ నటి జమున వ్యాఖ్యానించారు. గుంటూరుకు ఎన్‌టిఆర్ వచ్చినప్పుడు “నేను మీ అభిమానిని” అని నాజర్ చెపితే… ‘’నేను మీ ఫాన్‌ను’’ అని ఎన్‌టిఆర్ చెప్పి అందరినీ ఆనంద పరిచారు.
“హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటివాడు” అని ముదిగొండ శివప్రసాద్ తదితర
ప్రముఖుల అభిప్రాయాలు ఉంటే నాజర్ గొప్పతనం స్పష్టం అవుతున్నది. కటిక పేదరికాన్ని మరణించే వరకు అనుభవించిన నాజర్ 1997, ఫిబ్రవరి 22 న అంగలూరులో మరణించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments