దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, అలాగే తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రరాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో అనేకసార్లు ఆయన మంత్రి పదవులు నిర్వహించగా, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన ప్రత్యేకత ఆయనది. అలాగే కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షులు కూడా. 38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది. వివిధ శాఖల్లో మంత్రిగా పని చేసిన గొప్ప రాజకీయవేత్త, అపార అనుభవశీలి, స్నేహశీలి, సౌమ్యుడు, సాహితీవేత్త, ఆదర్శప్రాయుడు, చిరస్మరణీయుడు దామోదరం సంజీవయ్య.
దామోదరం సంజీవయ్య, పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వంలో తెలుగు భాష వాడుక అధికం చేయడం, భూసంస్కరణల అమలు ఇలా ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టారు.
దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 – మే 8,1972) 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలంలో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో చదువుకోవటానికి అవకాశాలు లేని
ఒక దళిత నిరుపేద కుటుంబంలో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించారు. పేద కుటుంబంలో పుట్టినా పట్టుదలే పెట్టుబడిగా ‘లా’ డిగ్రీ సాధించిన అనన్యుడు.
పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరారు. 1935లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938లో ఎస్.ఎస్.ఎల్.సీ జిల్లాలోనే ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యారు.
తరువాత చిన్నయ్య ఆర్థిక సహాయముతో అనంతపురం దత్తమండల కళాశాలలో గణితము, ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశారు.
1942లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశారు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధము వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉంది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరారు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజా పనుల శాఖ తనిఖీ అధికారిగా బళ్లారిలో పని చేశారు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబరు 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటూ పని చేశారు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పని చేసారు.
సంజీవయ్య 1946లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో ‘ఎఫ్.ఎల్’ లో చేరారు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ ఉన్నత పాఠశాలలో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశారు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు.
లా చదువుతున్నపుడు సంజీవయ్యకు రోమన్ న్యాయానికి సంబంధించిన లాటిన్ పదాలు గుర్తు పెట్టుకోవడము కష్టమయ్యేది. లాలో ఆయనకు సహాధ్యాయి అయిన ప్రముఖ రచయిత రావిశాస్త్రి వాటిని తెలుగు పాటగా మలిచి పాడుకుంటే బాగా గుర్తుంటాయని సలహా ఇచ్చారు. లా చదివే రోజుల్లో సంజీవయ్య చంద్రగుప్త అనే నాటకములో పాత్ర ధరించాడు. శివాజీ అనే ఇంకొక నాటకాన్ని తామే రచించి రంగస్థలము మీద ప్రదర్శించారు. ఈయన గయోపాఖ్యానము గద్యముగా రచించారు. అయితే ఇందులో ఏ ఒక్కటి ప్రస్తుతము లభ్యము అవుటలేదు.
లా పట్ట చేతపుచ్చుకొని సంజీవయ్య 1950 అక్టోబర్ లో మద్రాసు బార్ లో న్యాయవాదిగా నమోదు చేసుకొన్నాడు. ఆయన గణపతి వద్ద ఆ తరువాత జాస్తి సీతామహా లక్ష్మమ్మ వద్ద సహాయకునిగా పనిచేశారు.
సంజీవయ్యకు విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయ నాయకుల పరిచయము, సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది. సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు.
1950 జనవరి 26న రాజ్యాంగము అమలు లోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించింది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదో ఒక సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చింది. షెడ్యూల్డ్ కులమునకు చెందిన ఎస్.నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వము అట్టిపెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానమును పూరించడానికి బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున సంజీవ…