సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక రెడ్డి (22)ని లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి కేసులో నిందితులను గుర్తించారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

స్కూటీ టైర్‌లో కావాలనే గాలి తీసేసి నిందితులు డ్రామాలు ఆడినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. 24 గంటల్లోనే ఛేదించారు. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన మహమ్మద్ పాషా, మహబూబ్ ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించారు.

శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి జంక్షన్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసినట్లు భావిస్తున్నారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి 28 కి.మీ. దూరంలోని షాద్‌నగర్ వరకు తీసుకెళ్లారు.

గురువారం (నవంబర్ 28) తెల్లవారుజామున 3, 4 గంటల మధ్య చటాన్‌పల్లి వంతెన కింద మృతదేహాన్ని దహనం చేసినట్లు భావిస్తున్నారు. 4.30 గంటల సమయంలో స్థానిక పాల వ్యాపారి మృతదేహం తగలబడుతున్నట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు

ప్రియాంక కదలికలపై కన్నేసిన నిందితులు పక్కా ప్రణాళికతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. స్కూటీ టైర్‌లో ఉద్దేశ పూర్వకంగానే గాలి తీసేసి పంక్చర్ అయినట్లు నమ్మించారు. పంక్చర్ చేయిస్తామంటూ మాయమాటలు చెప్పి నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.
దారుణంగా చంపి, మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి..లారీని అడ్డంపెట్టి ఆ నిస్సహాయురాలిపై కిరాతకంగా అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని డీసీఎం ఎక్కించి.. షాద్‌నగర్ అండర్‌పాస్ వరకు తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు. ప్రియాంక మృతదేహాన్ని నిందితులు దుప్పట్లో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆమె మృతదేహం 70 శాతం కాలిపోయింది.
పోస్టుమార్టం రిపోర్టులో కీలక వివరాలు..
ప్రియాంక మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే.. ఇద్దరు అనుమానితులు ఓ పెట్రోల్ బంక్‌లో బాటిల్‌లో పెట్రోల్ నింపుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
ప్రియాంక మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు భావిస్తున్నారు. ప్రియాంక తలపైనా గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం (నవంబర్ 29) మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ప్రియాంక రెడ్డి హత్యోదంతం వివరాలను వెల్లడించనున్నారు.