నా బిడ్డ ఆపదలో ఉందని పోలీసులను వేడుకున్నాం… తన చెల్లికి కాల్ చేసి భయమేస్తుందని చెప్పింది, తర్వాత ఫోన్ ఆఫ్‌లో ఉంది సర్ అంటూ బ్రతిమాలారు. మా పరిధి కాదు పలనా చోటుకు వెళ్లండి ఒకరు, లవర్‌తో పోయిందేమోలే అంటూ మరో అధికారి నీచంగా మాట్లాడారు… కానీ వెంటనే స్పందన లేదు. తీరిగ్గా పాత సినిమాల్లో చూపించిన విధంగా సీన్ అంతా అయ్యాక వచ్చారు. ఇవేవో ఆరోపణలు కాదు.. స్వయంగా ప్రియాంక రెడ్డి తల్లితండ్రులు కూతురు మరణంతో ఏడుస్తూ… కడుపుకోతతో చెప్పిన మాటలు. వారికి అబద్ధమాడాల్సిన పని కానీ అవసరం కానీ లేవు.
పోలీసు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పరామర్శలతో సరిపెట్టారు తప్పా… పోలీసులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఒక్క అధికారిపై కూడా శాఖాపరమైన చర్యలు కానీ, సస్పెన్షన్‌లు ఏమీ లేవు. అసలు మా అధికారులు ఎలాంటి తప్పు చేయలేదు… పోలీసులు సకాలంలోనే స్పందించారు, అప్పటికే ఆమె చనిపోయింది అంటూ పోలీస్ బాస్ సజ్జనార్ తెలిపారు. కానీ కనీసం చనిపోయాక అయినా పట్టుకున్నారా అంటే అదీ లేదు. ఉదయం వరకు తూతూ మంత్రంగా స్పందించారు అని ప్రియాంక బంధువులు ఆరోపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ… మరో నిర్భయ కేసుగా పరిగణిస్తుంటే పోలీసులపై చర్యలేవీ అని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా పోలీసులను వెనకేసుకొచ్చి… మీరు ఏం చెప్పదల్చుకున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.కేపి