గెస్ట్‌ లెక్చరర్లకు నిరాశ!

Date:


– పాత వారిని కొనసాగించని ఇంటర్‌ విద్యాశాఖ
– కొత్తగా నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ
– అర్హులందరూ దరఖాస్తు చేసేందుకు అవకాశం
– నేడు డీఐఈవో ఖాళీల జాబితా వెల్లడి
– ఈ నెల 24న దరఖాస్తులకు చివరి తేది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో గత విద్యాసంవత్సరంలో పనిచేసిన గెస్ట్‌ లెక్చరర్లకు ఇంటర్‌ విద్యాశాఖ షాక్‌ ఇచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం (2023-24)లో వారిని కొనసాగించేందుకు నిరాకరించింది. కొత్తగా గెస్ట్‌ లెక్చరర్ల నియామకం కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో గతేడాది పనిచేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ గతంలో పనిచేసిన వారినే కొనసాగించాలని ఇంటర్‌ విద్యాశాఖను కోరుతున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం పాత వారిని నేరుగా కొనసాగించే అవకాశం లేదు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 2,255 మంది కాంట్రాక్టు, గెస్ట్‌ లెక్చరర్ల పునరుద్ధరకు సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ ఈనెల ఏడో తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారిలో 449 మంది కాంట్రాక్టు, ముగ్గురు మినిమం టైంస్కేల్‌, 97 మంది పార్ట్‌టైం, 1,654 మంది అతిథి అధ్యాపకులు, 52 మంది ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన లెక్చరర్లను తీసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వారి సేవలను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
కలెక్టర్‌ చైర్మెన్‌గా కమిటీ ఏర్పాటు
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్ల నియామకాలకు సంబంధించి ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మంగళవారం నోటిఫికేషన్‌ ను జారీ చేశారు. బుధవారం జిల్లాలు, సబ్జెక్టుల వారీగా డీఐఈవోలు ఖాళీల సంబంధించిన జాబితా ను పత్రికా ప్రకటనలు విడుదల చేస్తారని వివరిం చారు. గెస్ట్‌ లెక్చరర్ల కోసం అర్హులైన వారు ఈనెల 24 వరకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు ఉందని తెలిపారు. 26న వాటిని పరిశీలిస్తారని పేర్కొన్నారు. 27న జిల్లా, సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను సెలెక్షన్‌ కమిటీ ప్రకటిస్తుందని వివరించారు. 28న జిల్లా కలెక్టర్లు గెస్ట్‌ లెక్చరర్ల కేటాయింపునకు సంబంధించి ఎంపిక చేస్తారని తెలిపారు. వచ్చేనెల ఒకటో తేదీలోగా ఎంపికైన వారు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ప్రిన్సిపాళ్లకు రిపోర్టు చేయాలని సూచించారు. ఇతర సమాచారం కోసం జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. ఎంపిక చేసిన గెస్ట్‌ లెక్చరర్లను చేర్చు కోవాలని కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. అయితే గెస్ట్‌ లెక్చరర్ల నియమాకం కోసం ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్‌ చైర్మెన్‌గా కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇందులో జాయిం ట్‌ కలెక్టర్‌, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సభ్యులుగా ఉంటారని తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరైన సబ్జెక్టుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను డీఐఈవోలకు ప్రిన్సిపాళ్లుఅందించాలని కోరారు. అర్హులైన వారే డీఐఈవో కార్యాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు. సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తి ప్రకారం మెరిట్‌ జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. స్థానికంగా ఉండే వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపికైన వారు మూడు సెట్ల విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఒరిజినల్‌తో కలిపి ప్రిన్సిపాళ్ల వద్ద పరిశీలన చేసుకోవాలని కోరారు. గత విద్యాసంవత్సరంలో చివరి పనిదినం వరకు పని చేసిన వారు మంజూరైన పోస్టులో వర్క్‌లోడ్‌ ఉంటే పునరుద్ధరిస్తామని వివరించారు. ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు విధానం ఉంటుందని స్పష్టం చేశారు. ఇద్దరు పార్ట్‌ టైం జూనియర్‌ లెక్చరర్లు (ఎంటీఎస్‌), ఒక సీనియర్‌ లెక్చరర్‌ (ఎంటీఎస్‌), 53 మంది పార్ట్‌టైం లెక్చరర్లు (అవర్లీ బేస్‌డ్‌), 44 మంది పార్ట్‌ టైం ల్యాబ్‌ అటెండెంట్ల సర్వీసులను జూన్‌ ఒకటి నుంచి వచ్చేఏడాది మే 31 వరకు పది నెలల వరకు కొనసాగిస్తామని తెలిపారు. 52 మంది ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఆఫీసు సబార్డినేట్లు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో స్వయం సహాయక బృందాల ద్వారా ఎంపికైన వారిని జూన్‌ ఒకటి నుంచి పది నెలలపాటు తీసుకుంటా మని పేర్కొన్నారు.
గెస్ట్‌ లెక్చరర్లను కొనసాగించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పదేండ్లుగా పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లను కొనసాగించాలని గెస్ట్‌ లెక్చరర్ల సంఘం-2152 అధ్యక్షులు దామెర ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. పాత వారి స్థానంలో కొత్త వారి నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేయడం సరైంది కాదని విమర్శించారు. ప్రభుత్వం పాతవారిని కొనసాగించాలని అనుమతిస్తే ఇంటర్‌ విద్యా కమిషనర్‌ కొత్త వారిని ఎంపిక చేయడమేంటనీ ప్రశ్నించారు. వెంటనే కమిషనర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గతేడాది వేతనాలను పెండింగ్‌లో ఉంచి కొత్త వారిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌ చొరవ తీసుకుని గెస్ట్‌ లెక్చరర్లకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
గెస్ట్‌ లెక్చరర్లను విధుల్లోకి తీసుకోవాలి : ఏఐవైఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్లను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గెస్ట్‌ లెక్చరర్ల తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పదేండ్ల నుంచి పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారి నియామకం కోసం నోటిఫికేషన్‌ ఇవ్వడం సరైంది కాదని తెలిపారు. వారంతా రేపోమాపో శాశ్వత ఉద్యోగులుగా మారిపోతారనే కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. 2015లో రూ.పది వేల వేతనం తీసుకుంటూ ఉద్యోగం ప్రారంభించి ఇప్పుడు రూ.21 వేలు పొందుతున్నారని వివరించారు. తప్పుడు నివేదికలను ఓ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే నిరుద్యోగులకు అన్యాయం చేయడం సరైంది కాదని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలనీ, లేదంటే అధ్యాపకుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.

The post గెస్ట్‌ లెక్చరర్లకు నిరాశ! appeared first on .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...