గోదావరీ తీరస్థ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో సనాతన సంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలలో చివరి రోజైన శనివారం జరిగిన శ్రీ ఉగ్రనార సింహుని ఏకాంతోత్సవ వేడుకలకు భక్తులు అశేష భక్తులు విచ్చేశారు. ఉదయాత్పూర్వం ఉగ్ర లక్ష్మీ నార సింహ ఆలయాన్ని తెరవగా, సంప్రో క్షణం చేసిన అనంతరం దేవస్థానం వంశపారంపర్య యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండి తులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్య, నరసింహ మూర్తి, అరుణ్, వంశీ కృష్ణ, దేవస్థానం ఎసి,ఇఓ శ్రీనివాస్, అభివృద్ది కమిటీ సభ్యుల పర్యవేక్షణలో, భక్తుల గోత్రనామ యుక్త పూజలు, నిత్య అర్చనలు, నిత్య కల్యాణంతో పాటు ఉత్సవ ముగింపు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొక్కులు తీర్చుకున్న భక్తజనావళి
పరమ పవిత్ర గోదావరి నదిలో
మంగళ స్నానాలు ఆచరించిన భక్తులు, సుప్రభాత దర్శనానికి వివిధ ఆలయాల ముందు బారులుతీరి నిలుచున్నారు. కోరిన కోర్కెలు తీర్చే వరదుడుగా వినతికెక్కిన ఉగ్రనారసింహునికి ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ఒక కనుములో కొబ్బరికాయ, ఖర్జూరపు పండ్లు, పోకలు, మొక్కులు కలిపి కట్టి లక్ష్మీ సమేత నార సింహుని సన్నిధిలో ఉంచడం ద్వారా కోర్కెలన్నీ నెరవేరగలవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయంలో ముడుపులు కట్టి, వల్లు బండ, గండాదీపాది మొక్కులు తీర్చుకున్నారు.
వైభవంగా ఉగ్రనారసింహుని ఏకాంతోత్సవం
పదమూడు రోజులపాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమమైన కోరిన కోర్కెలు తీర్చే శ్రీలక్ష్మీసమేత ఉగ్రనార సింహుని ఏకాంతోత్సవ వేడుకలు శనివారం రాత్రి నేత్రపర్వంగా జరిగాయి. రాత్రి 9.30 గంటలకు ప్రారంభమై అర్ధ రాత్రి దాటే వరకూ లోక కల్యాణార్ధం నిర్వహించిన వరదుడైన ఉగ్ర నారసింహుని ఏకాంతోత్సవంలో ముందుగా ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం వంశపారంపర్య పౌరోహితులు కందాళై పురుషోత్త చార్య, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మల ఆధ్వర్యంలో దేవస్థానం అభివృద్ది కమిటీ అధ్యక్షుడు, సభ్యులు, ఎసి,ఇఓ శ్రీనివాస్, ప్రత్యక్ష పర్యవేక్షణలో సప్తావరణ ప్రత్యేక పూజలు చేశారు. ఉగ్రనారసింహాలయ ప్రాంగణంలోని ధ్వజ స్థంభం వద్ద అలంకృత ఉత్సవ మూర్తులను వేంచేపుచేసి కలశ, విశ్వక్సేన, కర్మణ: పుణ్యాహ వాచనాది కార్యక్రమాలను ఆచరించి, ఉగ్రనారసింహుని స్తోత్రం చేశారు. దశాబ్దాల క్రితం ఆలయ నిర్మాతలైన పణతుల నారాయణ దీక్షితుల వంశజుల సమక్షంలో, వేదవిదులు రుగ్వేద, యజుర్వేద, సామాధర్వణ చతుర్వేద మంత్రా లను పఠించారు. సంగీతజ్ఞులు సంగీత గానం చేశారు.
ప్రముఖ నృత్య కళాకారులు శాస్త్రీయ పద్ధతిలో సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. దేవస్థాన ఆస్థాన వాద్యకారులు వాద్యగోష్ఠి నిర్వహించారు. చివరగా మౌన ప్రదక్షిణను ఆచరించారు. ఏడు ప్రదక్షిణలు అనంతరం ఉగ్ర నారసింహుని ఉత్సవ మూర్తులను కుంభ హారతులతో గర్భాలయానికి తీసుకువెళ్లి షోడశోపచార పూజలు జరిపి ఆలయ తూర్పు భాగాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక మనోజ్ఞమైన ఏకాంత మందిరంలో ఊయలలో దేవేరి సహిత స్వామిని పవళింపుచేసి వేద మంత్రాలతో స్వామిని కొలిచారు. రమేశశర్మ లక్ష్మీ, నారసింహులకు జోలపాట పాడారు. అన్నదాన సత్ర వంశపారం పర్య నిర్వాహక బాధ్యులైన పణతుల వంశజులు వేద మూర్తులను, అర్చకు లను సత్కరించారు. అశేష భక్తులు, స్థానికులు కార్యక్రమంలో భక్తి శ్రద్ధ లతో భాగస్వాములై ప్రసాదాలు, దైవా శీస్సులను అందుకున్నారు.