బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శుక్రవారం రాత్రి కోరిన కోర్కెలు తీర్చే దైవ మైన ఉగ్రనారసింహుని పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం, భక్తజన కోరికల సాఫల్యార్ధం నిర్వహించిన పుష్పయాగం దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమాచార్య, వేదవిదులు రమేశశర్మల ఆచార్వత్యంలో అర్చకులు నరసింహమూర్తి తదితరులు జరిపించారు. ఆలయ మంటపంలో పంచాబ్జమును చిత్రించి, పుష్పపీఠాసీనుల జేసి, నలువైపులా ద్వార కుంభాలనుంచి వాసుదేవ పుణ్యాహవాచనం, షోడశాక్షరీ మంత్ర పఠనం గావించి, చరుర్వేదాలతో, సంగీతాది కళలతో ఉగ్రనా రసింహుని సేవించగా భక్తిశ్రద్ధలతో కొలిచారు.
వేంకటేశ్వర ఏకాంతోత్సవ వేడుకలు
శుక్రవారం రాత్రి దేవస్థానంలో నిర్వహించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఏకాంతోత్సవ వేడుకలు వైభ వోపేతంగా జరిగాయి. వేంకటేశ్వర బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా దేవస్థానంలోని ప్రధానాల యమైన వేంకటేశ్వరుని దేవాలయంలో, సనాతన సాంప్రదాయ ఆచారం క్రమంలో రాత్రి 9.30 గంట లకు ప్రారంభమై అర్ధరాత్రి దాటే వరకు కొనసాగిన ఏకాంతోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ముందుగా ఏడు కొండల పెన్నిధి మూల విరాట్టును సర్వాంగ సుందరంగా, బిలోలికి చెందిన భక్తులు శంకర్ అరుగులవార్ సహకారంతో, దాతృత్వంతో, అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య, శ్రీధరాచార్య, మోహనాచార్య, కిరణ్ లు ప్రత్యేకంగా మున్నెన్నడూ లేని విధంగా, పుష్పాలంకృ తుల గావించి, విశేష ఉత్సవాలంకారాలతో తీర్చి దిద్దారు. అలంకృత ఉత్సవ మూర్తులను దేవాలయం నుండి మంగళ వాద్యాలతో కొనితెచ్చి, ధ్వజ స్థంభం వద్ద ప్రత్యేక పూజాదికాలొనర్చారు. వేద, శాస్త్ర, పురాణ, సంగీత, నృత్య, వాద్య, మౌనాది ప్రద క్షిణలు చేశారు. భక్తిశ్రద్ధాసక్తులతో ధార్మిక కార్యాను రక్తులు, సదాచారాభిలాషులైన భక్తులు తోడురాగా, ఆలయం చుట్టూ బోయీలు, భక్తులు స్వామిని ఏడు ప్రదక్షిణలు గావించారు. దేవస్థాన వంశపారం పర్య యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశశర్మ, ఆలయ అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య, శ్రీధరాచార్య, విజయ్, మోహన్, కిరణ్, దేవస్థానం ఈఓ శ్రీనివాస్, అభివృద్ధ కమిటీ చైర్మన్ రామయ్య, సభ్యుల మార్గదర్శకత్వంలో, విధివిధాన వైష్ణవ వేదోక్త సాంప్రదాయ కార్యక్రమాలు జరిపారు. ఆరు ప్రదక్షి ణలు పూర్తయిన అనంతరం ఎవరు మాట్లాడినా కాశీలో గోహత్య చేసిన పాపఫలితం అనుభవించ గలరనే పురుషోత్తమా చార్య ప్రకటన తర్వాత చివరి మౌన ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం వేంకటేశ్వర మందిరమందు ఏర్పాటు చేసిన ఏకాంత స్థలంలో ఊయలలో అలమేలు మంగా పద్మావతీదేవి సహిత స్వామిని పవళింపు జేసి, సంగీతజ్ఞుల జోలపాట మధ్య, భక్తజన సమ క్షంలో ఏకాంత వేడుకలను నిర్వహించారు. కైమోడ్పులిడిన అశేష భక్తులు కన్నులారా అపురూప సన్నివేశాన్ని గాంచి అలౌకికానంద భరితులై తరించారు. వేడుకలలో భాగస్వాములైన భక్తులకు, బిలోలికి చెందిన లక్ష్మీ నరసింహ దంపతులు పాలను వితరణ గావించగా, భగవదాశీస్సులను అందజే శారు. దేవస్థానం పక్షాన వేదపండిత సత్కారం చేశారు.
