గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన, రాబోవు 3 రోజుల్లో వచ్చే తుఫాను దృష్టిలో పెట్టుకొని జగిత్యాల జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తం ఉండే విధంగా ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంత ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించడం, గుర్తించిన పునరావస కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు చేరిన ప్రాంతాల్లో, బ్రిడ్జిలు, చాప్టలు, చెక్ డ్యాములు, వాగులు, వంకలు మొదలైన వాటిపై నీటి ఓవర్ ఫ్లో ప్రాంతాలలో, రవాణా సౌకర్యాలు నిలిపివేయాలని, రాకపోకలు నియంత్రణకు పటిష్టమైన బారికేడింగ్, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా చేయాలని, పశువులను ఆరుబయట మేతకు వదలకుండా ఇంటి వద్దనే ఉంచాలని, ప్రజలందరూ ఇంటి నుండి బయటకు రావద్దని, కాచి వడబోసిన నీరు తాగాలని, దీనిపై జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల లో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా, టామ్ టామ్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ముఖ్యంగా ఈ వర్షాల దృష్ట్యా ఎటువంటి పారిశుద్ధ్య లోపాలు లేకుండా బ్లీచింగ్ చల్లించడం, ఎప్పటికప్పుడు చెత్తను ట్రాక్టర్ ద్వారా తరలించడం, లోతట్టు ప్రాంతాల్లో మట్టితో నింపడం, ఎక్కడ కూడా నీరు నిలవకుండా చేయాలని ఆదేశించారు. మండల పంచాయతీ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, డివిజన్ పంచాయతీ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తమ తమ హెడ్ క్వార్టర్స్. లోనే తప్పని సరిగా ఉండాలని, మండల తాసిల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ లతో సమన్వయం చేసుకోవాలని, మండల స్థాయిలో ఒక ఒక కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసుకోవాలని, మండలాల వారీగా ఎప్పటికప్పుడు తగిన సమాచారం జిల్లా యంత్రంగానికి జిల్లా కలెక్టరేట్ జగిత్యాల టోల్ ఫ్రీ నెంబర్ 08724-222557 కి విధిగా అందించాలని, ప్రజలకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ గురించి తమతమ వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేయాలని ఆదేశించారు.
