Thursday, August 18, 2022
HomeLifestylespecial Editionఏకాత్మతా మానవవాద సిద్ధాంత కర్త దీన్ దయాళ్

ఏకాత్మతా మానవవాద సిద్ధాంత కర్త దీన్ దయాళ్

కొందరు మరణించేవరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన వారు పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ. అతి సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య వ్యక్తిగా ఎదిగారు.
రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్‌ లోని మధుర దగ్గర ‘నగ్ల చంద్రభాన్’ అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి, తండ్రి మరణించిన దీనదయాళ్‌ జీ మేనమామ ఇంటిలో పెరిగారు. 1925 ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టిన దయాళ్‌ కాన్పూర్‌లో బి.ఎ, చదువు తున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం ఏర్పడింది.1937లో మొదటి కొద్దిమంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగారు. అప్పటి నుండి ఆయన జీవిత విధానం, గమ్యం మారిపోయింది. సంఘ్‌లో పనిచేస్తూనే బి.ఎ, డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ ఎంఎ, ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. సంఘ్‌ విస్తరణకు పూర్తి సమయం ఇచ్చేందుకు చదువుకు స్వస్తి పలికారు. ఉత్తర ప్రదేశ్‌లోని లభంపూర్‌ ప్రాంతానికి ప్రచారకులుగా నియుక్తులైన కొద్ది సంవత్సరాల లోనే ఆ ప్రాంతంలో సంఘ్‌ కార్యక్రమాలను వికసింప జేశారు. అది గమనించిన సంఘ్‌ పెద్దలు వారిని ఉత్తరప్రదేశ్‌ ప్రాంత సహ ప్రచారకులుగా నియమించారు. ఆయన అసామాన్యమైన ప్రతిభా పాటవాలు అందరినీ ఆకట్టు కున్నాయి. సంఘ్‌ కార్యక్రమాలు చూస్తూనే పత్రికారంగంపై దృష్టి సారించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్‌ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఆ ప్రకాశన్‌ ద్వారా “రాష్ట్ర ధర్మ”, అనే ఒక మాస పత్రిక, “పాంచజన్య” అనే వారపత్రిక, “స్వదేశ్‌” అనే దిన పత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలు దీనదయాళ్‌ జీ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి. 1952లో భారతీయ జన సంఘ్ లో చేరి ఉపాధ్యక్షులుగా నియమితుడైనారు. 1967లో జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ పదవిలో కొన సాగారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మరణించాక, పార్టీ బాధ్యతలు భుజాన వేసుకొని విజయ పధంలో నడిపించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య, లక్నో దినపత్రిక ‘స్వదేశ్’లకు సంపాదకులుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతా వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు, హిందీలో ‘చంద్రగుప్త మౌర్య’ నాటకం, మరాఠీ నుండి ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు. భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు ఉన్నాయని వివరించే క్రమంలో “ఏకాత్మతా మానవతా వాదం” అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించారు. గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని హిందూ మహాసభతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ పై కూడా మోపిన నేపథ్యంలో, ఆనాటి ప్రధాని నెహ్రూజీ సంఘ్‌ను నిషేధించారు. ఆ నిషేధాన్ని తొలగించాలంటూ జరిగిన ఉద్యమానికి ఉత్తర ప్రదేశ్‌లో దీనదయాళ్‌ జీ నిర్వహించిన పాత్ర గణనీయమైంది. ఈ హత్యానేరంలో సంఘ్‌ పాత్ర లేదని దీనదయాళ్‌ జీ పాంచజన్యలో స్పష్టం చేస్తూ ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా రాసిన రాతలకు ఆనాటి ప్రభుత్వం పాంచజన్యను నిషేధించింది. దానికి బదులుగా “హిమాలయ” అనే మరో వార పత్రికను ప్రారంభించి తన కలంతో నాటి ప్రభుత్వానికి కలవరం పుట్టించారు. ఈలోగా గాంధీజీ హత్యా నేరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేదని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. జాతి, జాతీయత, భారతీయ సంస్కృతి, ధర్మం మొదలైన విషయాలపై ఆయనలోని అభిప్రాయాలు, మౌలిక సిద్ధాంతాలు తదితరాలపై ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది. నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలు, భారతీయ తత్వజ్ఞాన సారాన్ని దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి సామ్రాట్‌, చంద్రగుప్త, జగద్గురు శంకరాచార్య అనే చారిత్రక నవలలను కూడా దయాళ్‌జీ రాశారు. 1951లో డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ప్రధాని నెహ్రూ విధానాలకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చారు. ఆనాడు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ అనుసరిస్తున్న, ముస్లిం సంతుష్టీ కరణ, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను ఎదుర్కొనడానికి, భారతీయ సంస్కృతి సభ్యులతో, జాతీయ భావాలతో కూడుకున్న రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌ గురూజీ సహాయాన్ని అర్థించారు. ఆయన కోరిక ప్రకారంగా పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ జీ, జగన్నాధరావు జీ, సుందర్‌ సింగ్‌ భాండారి లాంటి మరి కొందరు యువకులను అప్పగించారు. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ 1951 అక్టోబరు 21న ఏర్పాటు చేసిన జనసంఘ్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా దీనదయాళ్‌ జీ ఎన్నికైనారు. పార్టీ స్థాపించిన మూడు మాసాలకే 1952లో జరిగిన జనరల్‌ ఎన్నికలలో పోటీ చేసిన నాలుగు జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటిగా జనసంఘ్‌ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు పొందింది. తన ఉనికిని సాధారణ ఎన్నికలలో రుజువు చేసుకో గలిగింది. దీనికి శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ నాయకత్వంతో పాటు దీనదయాళ్‌ జీ సమన్వయ కౌశలం కూడా తోడైంది. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మరణం తర్వాత జనసంఘ్‌ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ పార్టీని దేశ వ్యాప్తంగా పటిష్ఠ పరచిన ఘనత దీనదయాళ్‌జీకి ఆయన సహచరులకు దక్కుతుంది. భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారికి సవాలు విసురుతూ, ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించాడు. భారతీయ జనసంఘ్‌ అఖిల భారత కార్యదర్శిగా ఎక్కువ కాలం పనిచేసిన దీనదయాళ్‌జీ కార్యకర్తల హృదయాలను మలిచి వారి మనస్సులలో అతి స్థిర స్థానాన్ని చూరగొన్నారు. సుఖమంటే ఏమిటో తెలియక కష్టాలనే చవిచూస్తూ దేశ సేవ నిమగ్నమై దానినే జీవన కార్యంగా స్వీకరించాడు. జనసంఘ్‌లో చేరినప్పటి నుంచి మహారథియై పార్టీకి సారథ్యం వహించి, దేశ రాజకీయాలలో జనసంఘ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో కృతకృత్యులై 1967లో పార్టీ అఖిల భారత అధ్యక్షుడు కాగలిగారు. కాలికట్‌లో జరిగిన అఖిల భారత జనసంఘ్‌ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపచేసి విశేష కీర్తి నార్జించారు. ఆ కీర్తియే జనసంఘ్‌ సిద్ధాంత వ్యతిరేకుల కినుకకు కారణమైంది. రాజకీయాలకు చిత్త శుద్ధి గల నేత బలి అయినారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొగల్‌ సరాయి రైల్వే స్టేషన్‌లో 1968 ఫిబ్రవరి 11న రైలు పట్టాల వద్ద శవమై కనిపించారు. డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మరణం మాదిరిగానే దీనదయాళ్‌జీ మరణం కూడా పలు అనుమానాలకు దారితీసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments