దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి భారత దేశములో తెలియని వారు ఉండరేమో. . భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే ఫాల్కే జన్మదిన సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. అయితే ఫాల్కే గురించి మాత్రం చాలా మందికి తెలియ డంటే ఆశ్చర్యం కలుగ మానదు.భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరు గాంచింది దాదాసాహెబ్ ఫాల్కే. అతను అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. 1896లో అతను బొంబాయి లోని వాట్సన్ హోటల్‌లో ఏసుక్రీస్తు చరితం పై ప్రదర్శించ బడిన సినిమాను చూడటం జరిగింది. ఆ ప్రభావంతో అతను హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియ్యాలన్న సంకల్పానికి వచ్చారు. 1913లో అతను తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన అతను సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా ఈ కాలంలో అతను 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించారు.1870లో నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో 1870 ఏప్రిల్ 30 న జన్మించారు. బొంబాయిలోని జెజె కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో, బరోడాలోని కళాభవన్ విద్యార్థి. మంచి చిత్రకారుడు, నాటకాల్లో మేకప్ వేశారు. మంచి మెజీషియన్ కూడా… ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే ప్రింటింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం జర్మనీ వెళ్లాలనుకున్నారు. సినిమాకు సంబంధించిన వార్త ఒకటి పత్రికలో వచ్చింది. తనను ఆ వార్త బాగా ఆలోచింపజేసింది. మన దేశంలో కూడా సినిమాను ఎందుకు తీయకూడదు అనే ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. తన వద్ద ఉన్న డబ్బు, మిత్రుల నుంచి తీసుకున్న అప్పు, జీవిత బీమా డబ్బు మొత్తం తీసుకొని సినిమా నిర్మాణానికి సంబంధించిన పరికరాలు కొనడానికి 1912లో ఇంగ్లాండ్ వెళ్లారు. అయితే ఫాల్కేకు తాను చరిత్ర సృష్టించ బోతున్నానని తెలియదు, అదే తన జీవితాన్ని పేదరికం లోకి నెట్టివేస్తుందనీ ఊహించలేదు.ఫాల్కే 1913లో రాజా హరిశ్చంద్ర, ఆదే సంవత్సరం మోహినీ భస్మాసుర, సత్యవాన్ సావిత్రి (1914) శ్రీకృష్ణ జననం (1918) కాళీయ మర్దన్ (1919) నిర్మించారు. ఆ తరువాత సినిమా రంగంలో క్రమంగా వ్యాపార ధోరణి మొదలైంది. దాంతో పాల్కే పక్కకు తప్పుకున్నారు. సినిమా ప్రేమ ఆయన్ని నిలువనివ్వలేదు. తన పలుకుబడి, పరిచయాలు ఉపయోగించి నిధులు సమీకరించి 1937లో గంగావతరణ సినిమా తీశారు. నిండా మునిగి పోయారు. సినిమాను వ్యాపారంగా చూసి ఉంటే ఆయన పరిస్థితి బాగానే ఉండేది. సినిమాను విపరీతంగా ప్రేమించి దెబ్బతిన్నారు. తన వారసులను పేదరికంలోకి నెట్టేశారు. ఆయన దేశానికి తీసుకు వచ్చిన సినిమాతో సినీ వ్యాపారులు కోట్లు సంపాదించారు. పాపులారిటీని, రాజకీయాల్లో పదవులు సంపాదించారు కానీ ఫాల్కే మాత్రం కఠిక దరిద్రంలో మరణించారు. ఆయన కుమారుడు ముంభై వీధుల్లో చిల్లర వ్యాపారిగా జీవితం గడిపారు. బాగున్న రోజుల్లో ఫాల్కే ఫోర్డ్ కారును ఉపయోగించే వారు. 1920 ప్రాంతంలో ఆ కారులోనే షూటింగ్‌కు వెళ్లేవారు. తిరిగి సినిమా తీయాలని నిర్ణయించుకున్న కాలంలో దాన్ని అమ్మేశారు. ఆ కారు పెళ్ళిళ్ల ఊరేగింపునకు ఉపయోగించారు. ఐదేళ్ల క్రితం ఈ కారు నాసిక్ డంప్ యార్డ్‌లో లభించింది. తొలి భారతీయ సినిమా కెమెరాను ఫాల్కే జర్మనీ నుంచి తెప్పించారు. అదేమైందో ఇప్పుడు ఎవరికీ తెలియదు. సినిమా నిర్మాణానికి ఎలాంటి ఏర్పాట్లు లేని కాలంలో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఫాల్కే తొలి సినిమా తీశారు. ఫాల్కే భార్య సరస్వతి భారతీయ తొలి సినిమా రాజా హరిశ్చంద్ర నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆమెనే తొలి భారతీయ సినిమా టెక్నీషియన్. సరస్వతి షూటింగ్ సమయంలో వెలుతురు కెమెరాపై పడకుండా బెడ్ షీట్‌ను అడ్డుగా పట్టుకుని ఉండేవారట. షూటింగ్‌కు కావలసినవన్నీ సమకూర్చేవారు. రాత్రి పూట క్యాండిల్ వెలుగులోనే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు నిర్వహించే వారు. సినిమా బృందం 60-70 మందికి ఆమెనే వంట చేసి పెట్టేవారు. రాజా హరిశ్చంద్రలో హరిశ్చంద్రుని కుమారునిగా ఫాల్కే కుమారుడు బాలచంద్ర నటించారు. తొలి భారతీయ బాలనటుడు అతనే. శ్రీకృష్ణ జననం, కాళీయ మర్దన్‌లో బాల శ్రీకృష్ణునిగా మందాకిని నటించారు. ఆమె ఫాల్కే పెద్ద కూతురు. ఆమెనే తొలి భారతీయ బాలనటి.భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల్లో దాదాసాహెబ్ ఫాల్కే ఒక అనామకుడిగా కూర్చోవడం చూసిన శాంతారాం ఆయన్ని గుర్తించి వేదికపైకి తీసుకు పోయి 1938లో అప్పటికప్పుడు వేదికపై ఐదువేల రూపాయల పర్స్ అంద జేశారు. ఆ డబ్బుతో ఫాల్కే తిరిగి సినిమా తీస్తాడేమోనని చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే సినిమా అంటే ఆ మహనీయునికి అంత పిచ్చి. అందరూ ఒత్తిడి తెచ్చి ఆ డబ్బుతో నాసిక్‌లో ఒక ఇంటిని కొనిపించారు. అప్పటి వరకు ఫాల్కేకు సొంత ఇల్లు కూడా లేదు. ఆ ఇంటిలోనే తుది శ్వాస విడిచారు..1971 లో ఆయన గౌరవార్థం ఇండియా పోస్ట్ ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఫిబ్రవరి 16, 1944 న మరణించారు. 90 సినిమాలను నిర్మించిన భారతీయ సినిమా పితామహుడు దరిద్రంతోనే కన్నుమూసినా, ఈ నాటికీ అతని జీవన మూల్యాలు ఆదర్శంగా, స్ఫూర్తినిచ్చేవిగానే ఉన్నాయి. అతని పేరు మీద జాతీయ అవార్డుల సంరంభం ప్రతి యేటా జరుగుతున్నా, ఆయన జీవిత చరమాంకం ఎంతటి దైన్యావస్థలో గడిచిందో ఎవరూ తలచక పోవటం శోచనీయం.
భారతీయ సినిమా పితామహులు ఫాల్కే
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES