తెలంగాణ వైతాళిక కవినేత దాశరథి

Date:

తెలంగాణలో జన్మించిన గొప్ప వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్ర శ్రేణికి చెందిన వారు. హైదరాబాద్ సంస్థాన విముక్తి మహెూద్యమంలో దూకి, నిజాం నవాబు అలీఖాన్ ను ఎదిరించి, తెలంగాణ విముక్తికై కారాగార శిక్ష అనుభవించి, లక్ష్యాన్ని సాధించిన స్వాతంత్రోద్యమ కవి సింహం దాశరథి.

దాశరథిగా సుపరిచితులు అయిన – దాశరథి కృష్ణమాచారి 1925 జూలై 22 నాడు, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా, చినగూడూరు గ్రామంలో శ్రీమతి వేంకటమ్మ, శ్రీమాన్ వేంకటాచార్యులకు జన్మించారు. దాశరథి రంగాచారి దాశరథి ఆయన తమ్ముడు.

చినగూడూరులో నాల్గవ తరగతినీ, ఖమ్మం ఉస్మానియా హైస్కూల్ లో మెట్రిక్యులేషన్ నూ పూర్తి చేశారు. ఖమ్మంలో చదువు కుంటున్నప్పుడే మీర్జాగాలిబ్ శృంగారాత్మక సాహిత్యాన్ని, ఇక్బాల్ విప్లవ గీతాలను అధ్యయనం చేశారు. మరోవైపు ఉపనిషత్తుల సారాన్ని ఎదనిండా నింపు కున్నారు దాశరథి .
“నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనొ అందాక ఈ భూగోళమ్మున అగ్గి పెట్టెదను” – అంటూ విప్లవ చైతన్య మూర్తియై ప్రజ్వరిల్లినారు. ప్రజల బాధలకు,కారణ భూతులైన భూస్వాముల ఆటకట్టించాలనీ, రైతుల హక్కుల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులతో కలిసిపోయారు. కార్యకర్తగా, కావ్యకర్తగా ఉద్యమించారు. కోయగూడేలలో తిరిగి వాళ్లను సమైక్య పరచారు. లంబాడీలను, హరిజనులను, రైతులను, కూలీలను, వర్తకులను మేల్కొలిపి, వాళ్లను స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములుగా చేశారు. పుంఖానుపుంఖంగా కవితలు రచించి, పీడిత ప్రజల, భావాలకు ప్రతినిధిగా తన కలాన్ని ఝళిపించారు.

తెలుగు భాషా సంస్కృతుల పునరుద్ధరణ కోసం ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలలో పాల్గొని, కావ్యగానం చేసేవారు దాశరథి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవ సభ 1944 లో ఓరుగల్లు కోటలో ఏర్పాటైంది. రజాకార్లు సభపై – వేసిన పచ్చని పందిళ్లను తగులబెట్టారు. అప్పుడు దాశరథి నిర్భయంగా- “ జ్వాలలో ఆహుతి అయిపోతాం గాని, కవి సమ్మేళనం జరిపి తీరుతాం ” అంటూ గళం విప్పి –

“ఓ పరాధీన మానవా! ఓపరాని
దాస్యము విదల్చ లేని శాంతమ్ము మాని, తలుపులను ముష్టి బంధాన కలచివైచి, చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర్య సురపురమ్ము” – అంటూ ప్రబోధించారు. సభాధ్యక్షులైన సురవరం ప్రతాపరెడ్డి వెంటనే లేచి ‘సింహగర్జన చేశావు నాయనా’ అంటూ దాశరథిని మెచ్చుకొన్నారు. దేవులపల్లి రామానుజరావు దాశరథి మెడలో పుష్పహారం వేసి కౌగలించు కొన్నారు. తరువాత ‘మంచిర్యాల’లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభా కవి సమ్మేళనానికి, దాశరథి అధ్యక్షత వహించి ప్రజలను ప్రబోధించారు.
1945-46 ప్రాంతంలో దాశరథికి కమ్యూనిస్ట్ లతో అభిప్రాయ భేదాలేర్పడ్డాయి. అప్పుడు దాశరథి హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడానికీ, మహెూద్యమాన్ని సాగిస్తున్న ‘ స్టేట్ కాంగ్రెసు’ లో చేరినారు. స్వామీ రామానందతీర్థ నాయకత్వంలో, జమాలాపురం కేశవరావు, కొండా వెంకటరంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలగు వారితో కలసి, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.
“ఇదేమాట ఇదేమాట పదేపదే అనేస్తాను” అంటూ, “నిజాం రాజు జన్మజన్మల బూజు” అంటూ, ఉద్యమ కవితావేశ మూర్తియై, దాశరథి సత్యాగ్రహానికి తలపడ్డారు. అప్పటి దాకా పొంచి ఉన్న పోలీసులు ‘గార్ల ‘ గ్రామంలో, దాశరథిని అరెస్టు చేసి, నిజాం ప్రభుత్వం దాశరథికి 16 నెలల కఠిన కారాగార శిక్షను విధించింది. కొన్ని నెలలు వరంగల్ జైల్లో ఉంచి, తరువాత దాశరథిని నిజామాబాద్ సెంట్రల్ జైలుకు పంపింది. నిజామాబాద్ జైల్లో దాశరథి ముఖం కడుక్కునే బొగ్గుతో జైలు గోడ మీద –
“ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజుకు మాకెన్నడేని తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు నాతెలంగాణ కోటి రత్నాల వీణ ” అని రాస్తే జైలు అధికారులు తుడిచి వేయించారు. అపుడు అదే జైల్లో ఉన్న వట్టికోట ఆళ్వారు స్వామి, మళ్లీ మళ్లీ గోడ మీద రాసేవారు. జైల్లో దాశరథి స్వామి రామానంద తీర్థను దర్శించు కొన్నారు. స్వామీజీ దాశరథి సాహసాన్ని ప్రశంసించినారు .

“నా తెలంగాణ తల్లి కంజాతవల్లి” – “నా తెలంగాణ కోటి అందాల జాణ” – “నా తెలంగాణ సీమ సౌందర్య సీమ”- “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ తెలంగాణ తల్లిని వేనోళ్లా ప్రశంసించిన తెలంగాణ ముద్దు బిడ్డ దాశరథి. “తెలంగాణలోని కోటి ధీరుల గళధ్వనినె గాక ఇలా గోళ మందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి” అని చాట గలగిన ప్రపంచ ప్రజాకవి దాశరథి.

“అగ్నిధార” మొదలు ‘ నేత్రపర్వం ‘ దాకా ముప్పైకి పైగా, గ్రంథాలు రచించారు దాశరథి. 200 కు పైగా చలన చిత్రగీతాలు రాశారు. దాశరథిని గూర్చి అనేక విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఆయన రచనలు అనేక భాషలలోనికి అనువాదిత మైనాయి. తెలుగులో గజల్ రుబాయీ ప్రక్రియలను, ప్రప్రథమంగా ప్రవేశ.పెట్టిన ప్రయోక్త దాశరథి మహాకవే.
‘జాతీయోద్యమ రథసారథిగా’ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్రపత్ర సన్మానాన్నీ, అప్పటి ఉప రాష్ట్రపతి శ్రీ ఆర్. వెంకట్రామన్ చేతుల మీదుగా సన్మానాన్ని అందు కొన్నారు దాశరధి. ‘కళాప్రపూర్ణ’, ‘డి.లిట్’ వంటి గౌరవ పట్టాలతో వివిధ విశ్వ విద్యాలయాలు దాశరథిని సన్మానించాయి. అమెరికా తెలుగు వాళ్లు ‘ ఆంధ్ర కవితా సారథి’ గా సన్మానించారు.
ఒంగోలు ‘ గండపెండేరం ‘ తొడిగి సన్మానించింది. వరంగల్లు దాశరథికి స్వర్ణోత్సవం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977 లో ఆస్థానకవిగా నియమించి సన్మానించింది. అనేక దేశాలలో పర్యటించి , దాశరథి తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను గూర్చి ప్రసంగించారు. దాశరథి అనారోగ్యానికి గురై 1987 నవంబరు 5 వ తేదీ ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...