Wednesday, November 30, 2022
HomeLifestyleLife styleరాజ్యాంగ శిల్పి రాజేంద్ర ప్రసాద్

రాజ్యాంగ శిల్పి రాజేంద్ర ప్రసాద్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భారతదేశానికి అధ్యక్షునిగా రాజ్యాంగం ప్రకారం భాద్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిగా ఏ రాజకీయ పార్టీకి చెందకుండా స్వతంత్రుడిగా వ్యవహరించిన ప్రత్యేక వ్యక్తిత్వం భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ది.
ఒక రాష్ట్రపతిగా పక్షపాత ధోరణి లేకుండా, స్వతంత్రంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుండి వైదొలగి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పిన ఆదర్శ నేత ఆయన.1957లో రాష్ట్రపతిగా ఎన్నికై, రెండు సార్లు భారత రాష్ట్రపతిని చేపట్టిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా స్వతంత్రంగా మెలిగి, ప్రధానిని గానీ పార్టీని గానీ రాజ్యాంగ నిర్మాణంలో జోక్యం చేసుకోనీక, తరువాత రాష్ట్రపతులకు ఉదాహరణగా నిలిచారు.

ప్రజలు ప్రేమగా, గౌరవంగా ‘బాబూ’ అని పిలుచుకునే డా. రాజేంద్ర ప్రసాద్ (1884 డిసెంబర్ 3 – 1963 ఫిబ్రవరి 28) భారత దేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. 1950 నుండి 1962 వరకు రెండు సార్లు రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వహించారు. బీహార్ లో ప్రముఖ నాయకునిగా ఎదిగి, భారత జాతీయ కాంగ్రెస్ లో భారత స్వాంతంత్ర్యోద్యమ కాలంలో చేరారు. మహాత్మాగాంధీ మద్దతు దారునిగా 1931 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లోజరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1946 ఎన్నికల తరువాత నెహ్రూ మంత్రి వర్గంలో ఆహారం, వ్యవసాయం శాఖకు భారత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షులు. 1951 సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటి భారత పార్లమెంటు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడిన నేత.

రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని జెర్దాయ్ గ్రామంలో 1884లో డిసెంబరు 3 న జన్మించాడు. అతని తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం, పర్శియను భాషలలో పండితులు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయణం నుండి కథలు వివరించేది. ఐదవ ఏటనే పర్షియన్ భాష, హిందీ భాష , అంకగణితం ను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ (ముస్లిం పండితుడు) దగ్గరకు పంపించ బడ్డారు. తరువాత ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసారు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్‌వంశీ దేవిని వివాహం చేసుకున్నారు. అటు తరువాత విద్యకై పాట్నాలో కె.ఘోష్ పాఠశాలలో చదువుకున్నారు. ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై నెలకు రూ.30 ఉపకారవేతనం పొందారు.

1902లో అతడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. మొదట్లో సైన్సు విద్యార్థి. 1904లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎఫ్.ఎ ఉత్తీర్ణుడయ్యారు. అక్కడే 1905లో మొదటి స్థానంలో గ్రాడ్యుయేషన్ చేసారు. అతని అధ్యాపకులలో జగదీష్ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదలగువారు ఉన్నారు. ఆయన మేథాశక్తికి ఒక ఎక్జామినర్ (పరీక్షకుడు) ప్రభావితుడై అతడి పరీక్షా జవాబు పత్రంపై “పరీక్షకుని కంటే పరీక్షితుడు గొప్పవాడు” అనే వ్యాఖ్య రాశారు.

1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందారు. అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపారు. అతడు “ద్వాన్ సమాజం” లో క్రియాశీల సభ్యునిగా సేవలందించారు. అతడు పాట్నా కళాశాలలో1906లో జరిగిన బీహారీ స్టూడెట్స్‌ కాన్ఫరెన్సు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

ఉపాద్యాయునిగా అనేక విద్యాసంస్థలలో పనిచేసారు. ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ పూర్తి చేసిన తరువాత అతడు బీహార్ లోని ముజఫర్‌పూర్ లాంగట్ సింగ్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా చేరారు. తరువాత ఆ సంస్థకు ప్రధానాచార్యునిగా తన సేవలనందించారు. తరువాత 1909లో కలకత్తాలోని రిప్పన్ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించడానికి గాను ఉద్యోగాన్ని వదిలి వెళ్ళారు. అతడు ఆ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించే సమయంలో కలకత్తా సిటీ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసారు. 1915 లో “మాస్టర్ ఆఫ్ లా” పరీక్షలకు హాజరై ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని పొందారు. 1937లో అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీని పొందారు.

1916 లో, బీహార్, ఒడిషా రాష్ట్రాల హైకోర్టులలో చేరాడు. తరువాత 1917లో అతడు పాట్నా విశ్వ విద్యాలయంలోని సెనేట్, సిండికేట్ లో మొదటి సభ్యునిగా నియమింప బడ్డారు.

న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలో స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్షితు డై, 1906లో మొదటి సారి కలకత్తాలో నిర్వహించబడిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల ద్వారా సంబంధాన్ని పెంచుకున్నారు. 2011లో రెండవసారి వార్షిక సమావేశాల సమయంలో జాతీయ కాంగ్రెస్ లో చేరారు. 1916 లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో మహాత్మా గాంధీని కలిసారు. చంపారన్ లో జరగనున్న నిజ నిర్ధారన కమిటీలోనికి తనతో పాటు స్వచ్ఛంద కార్యకర్తగా రావాలని మహాత్మా గాంధీ అతనిని కోరారు.

1918 లో’సర్చ్ లైట్’అనే ఆంగ్ల పత్రికను, ఆ తర్వాత ‘దేశ్’ అనే హిందీ పత్రికను నడిపారు. 1920లో భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా నిర్వహించబడిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. అతడు తన లాభదాయకమైన న్యాయవాద వృత్తిని, అలాగే విశ్వవిద్యాలయంలోని అధ్యాపక వృత్తి విధులను తప్పుకున్నాడు. భారతీయ సాంప్రదాయ విధానాలలొ విద్యాభ్యాసం అందిస్తున్న బీహార్ విద్యాపీఠాన్ని 1921లో తన మిత్రబృందంతో కలిసి స్థాపించి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నడిపారు. 1921లో మహాత్మా గాంధీతో ఒకమారు సమావేశం తరువాత, విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశారు.

రాజేంద్రప్రసాద్ 1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అలాగే 1939లో, నేతాజీ రాజీనామా చేసిన తరువాత, 1947లో ఇంకోసారి, మొత్తం మూడుసార్లు ఆ పదవిని చేపట్టారు. 1942 ఆగస్టు 8 న క్విట్ ఇండియా సంధర్భంగా అరెస్టు చేసి, బాంకిపూర్ కేంద్ర కారాగానికి తరలించారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష తర్వాత, 1945, జూన్ 15 న విడిచిపెట్టారు.

1946 సెప్టెంబరు 2 న ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం జవాహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో 12 మంది మంత్రులను ఎంపిక చేయగా, రాజేంద్ర ప్రసాద్ ఆహారం, వ్యవసాయ శాఖకు మంత్రిగా పనిచేసారు. 1946 డిసెంబరు 11 న రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కృపాలానీ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజీనామా చేసిన తరువాత 1947 నవంబరు 17 న కాంగ్రెస్ అధ్యక్షునిగా భాద్యతలు స్వీకరించారు.

భారత స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నర సంవత్సరాల తరువాత 1950 జనవరి 26 న స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించ బడింది. రాజేంద్ర ప్రసాద్ ను తొట్టతొలి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు.

భారతదేశంలో విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నెహ్రూ కు వివిధ సందర్భాలలో సలహాల నిచ్చేవారు. “హిందూ కోడ్ బిల్” చట్టం పై వివాదాల తరువాత అతను రాష్ట్ర వ్యవహారాల్లో మరింత చురుకైన పాత్రను పోషించారు. 12 సంవత్సరాల పాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి 1962 న పదవీ విరమణ చేశారు.1963 ఫిబ్రవరి 28 న ఆయన రాం రాం అంటూ కన్ను మూశాడు. దేశ్ రత్న అని పిలువ బడిన ఆయనకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments