ధర్మ ప్రతిష్టాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే శివాజీ ‘స్వరూపాన్నే ధ్యానించండి, ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి మహనీ యులు మన జాతికి ప్రబోధించారు. హిందూ ధ్వజాన్ని మళ్ళీ ఉత్తుంగ శిఖరాలపై ఎగురవేసి, హిందూత్వంలో అమృతాన్ని నింపి ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడు శివాజీ. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మధ్య యుగంలో హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన మహోన్నత వీరుడు శివాజీ. మహారాష్ట్ర ప్రాంతంలో యాదవులు స్థాపించిన హిందూ సామ్రాజ్యం 1307 మార్చి 24తో ఢిల్లీ సుల్తాను ఖిల్జీ ద్వారా నాశనం కాగా, ఆ తర్వాత 350 ఏళ్ల వరకూ మరో హిందూ సామ్రాజ్యమే లేకుండా పోయింది.
1630, ఫిబ్రవరి 19వ తేదీన భావి హైందవ సామ్రాజ్య నిర్మాతయైన శివాజీ జన్మించాడు. దేశభక్తిని ఉగ్గుపాలతోనే రంగరించుకున్న శివాజీ తన తల్లి జిజియాబాయి పెంపకంలో అనేక విషయాలు నేర్చుకున్నాడు. ‘రామ రామరాజ్యం వంటి హైందవ సామ్రాజ్యం నిర్మాణం చేయాలనే కోరిక’ శివాజీలో బాల్యంలోనే స్థిర పడింది. తల్లి సంరక్షణ, దాదాజీ ఖాండ్‌దేవ్ శిక్షణతో శివాజీ వీరుడిగా అవతరించారు. భారత రామాయణాల విశిష్టత, హిందూ మతం గొప్పదనం తల్లిద్వారా నేర్చుకున్నాడు. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం కూడా ఆమె ద్వారా పెంపొందించుకున్నాడు. తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రంలో నిష్ణాతు డయ్యాడు. సకల విద్యా పారంగతుడైన శివాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహారచన చేశాడు.
శివాజీ జాగీరులో రాంఝా గ్రామ పటేలు ఒక స్త్రీని బలత్కారం చేయగా, శివాజీ 1645 జనవరి 28న పటేలును బంధించి, కాళ్ళు చేతులు నరికించి శిక్షించాడు. అలా క్రమంగా ప్రజల అభిమాన పాత్రుడైనాడు. అప్పట్లో కాశ్మీరం నుండి కావేరీ వరకు మధ్యనున్న చాందా, గోండువనం వదిలి మిగిలిన దేశమంతా తురుష్కుల అధీనంలో ఉండేది.
దేవగిరి, విజయనగరం రాజ్యాలు అస్తమించాక, శివాజీ తన మిత్రులందరితో భవిష్యత్ సామ్రాజ్య నిర్మాణం కోసం దేవాలయం, కొండగుహ, కీకారణ్యం ఇసుకతిన్నెలు వంటి అనేక ప్రాంతాల్లో చర్చోపచర్చలు జరిపేవాడు. మొదట బీజాపూర్ సుల్తాన్ చే నిర్లక్ష్యం కాబడిన ‘కాన’ లోయలోని ‘తోరణ’ దుర్గాన్ని జయించి, హిందూ సామ్రాజ్య నిర్మాణానికి తోరణం కట్టాడు. తోరణ దుర్గానికి ఎదురుగా ఉన్న ‘మురుంబదేవ’ గిరిపై కొత్త కోటను నిర్మించి, “రాజ్ గఢ్” అని పేరు పెట్టాడు. తర్వాత ‘కువారి’ కోటను వశం చేసుకున్నాడు. ఇవన్నీ పదహారేళ్ళ ముక్కుపచ్చలారని ప్రాయంలో శివాజీ చేసిన గొప్ప పనులు. తర్వాత కొండణా కోటను తన స్వరాజ్యంలో కలుపు కున్నాడు. శివరళ, సుభాను మంగళి దుర్గాలను వశపరు కున్నాడు. 1648 జూలై 25న వజీరు ముస్తాపా, బాజీ ఘోర్పడేలు సైన్యంతో శివాజీ తండ్రి అయిన శహాజీని బంధించారు. శత్రువును శరణు వేడడమా? తండ్రి ప్రాణమా? స్వరాజ్యమా? అనే శివాజీ ప్రశ్నలకు… తల్లి జిజియా బాయి- తన మాంగల్యం కన్నా దేశభక్తి గొప్పదని చెప్పింది.
పురంధర కోటలో ఉన్న శివాజీ సైన్యానికి, ఫతేఖాన్ సైన్యానికి భీకర యుద్ధం జరగగా శివాజీకే విజయం దక్కింది. 1648 ఆగస్టు 8న ఫతేఖాన్ ఓటమి పాలయ్యాడు. పురంధర దుర్గంలో ఫతేఖాన్, బెంగుళూరులో ఫరాదఖాన్ ఓటముల పాలు కాగా, బీజాపూర్ లో శివాజీ తండ్రి శహాజీ 1649 మే 16న బంధ విముక్తు డైనాడు. 1654 మే 23న బీజాపూర్ సుల్తాన్ మహరాజ్ పంత్ మరణించగా, ఆయన నలుగురు కుమారుల తగవుల కారణంగా శివాజీ వారిని బంధించి, ఉచిత పదవులు కట్టబెట్టి నేతాజీ పాల్కర్ అనే సర్దార్ ను అధికారిగా నియమించాడు. కృష్ణానదీ సమీపంలో టావళి అధిపతి దౌలత్ రావు మృతి చెందగా, ఆయనకు సంతానం లేకపోగా దత్తపుత్రుడైన యశ్వంతరావుకు పదవినిచ్చాడు. తన అధికారానికి ఇష్టపడని కారణాన 1656లో యుద్ధంలో యశ్వంతరావును ఓడించి శివాజీ స్వరాజ్యంలో కలుపుకున్నాడు. దీనిలో అంతర్భాగ కొండ ప్రాంతమైన ‘రాయరి’ కోటనే కొన్నే ళ్ళకు శివాజీ రాజధానిగా రాయగఢ్ దుర్గం ఏర్పడింది. 1956 నవంబర్ 2న బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షా చనిపోగా, మొగలు సామ్రాజ్య దక్షిణ సుబేదారైన ఔరంగజేబు అనుమతిని పొంది, 1957 ఏప్రిల్ 23న స్వరాజ్యంలో కలుపు కున్నాడు.
శివాజీ బీజాపూర్ ప్రాంతం నుండి కోండ్వానా కొంకణ, దండరాజపురి, భీవండి కళ్యాణి, మాహు తదితర కోటలను పోర్చుగీసు వారి నుండి చోళ ప్రాంతాన్ని జయించాడు. కటావ్, మయణి, అష్టి, ఖరాహడ్, సుపే, కొల్హాపూర్, పనాళీ గడ్, యెగావ్ తదితర కోటలను జయించాడు. ఔరంగజేబు సలహాదారులైన కారతలబ్ ఖాన్, నామదర్ ఖాన్, ఇనాయత్ ఖాన్, షహిస్త ఖాన్, భావసింహ, జస్వంత సింహ తదితరులను ఓడించాడు. అహ్మద్ నగర్ , సూరత్, జున్నర్ నగ రాలను లూటీ చేశాడు. అలా సాగిన శివాజీ తన జైత్రయాత్ర ఫలితంగా 1674 జూన్ 6న సింహాసనాన్ని అధిష్టించాడు. ఆంగ్లేయుల రాయబారి హెన్రీ ఆక్సెం డర్ శివాజీ మహారాజుకు ప్రణమిల్లి భారీగా కానుకలు సమర్పించాడు. తన రాజ్యానికి అష్టప్రధానుల పారశీక నామాలను మార్చి సంస్కృత పేర్లను శివాజీ పెట్టాడు. ప్రభుత్వ పాలన సంస్కృతంలోనే సాగాలని రాజ్య వ్యవహార కోశం తయారు చేయించాడు. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు కాకుండా ప్రజాక్షేమం కోసమే పాటుపడ్డాడు. సుదీర్ఘంగా యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. ఓడిపోయిన శత్రురాజ్యంలో నిస్సహాయులు, మహిళలు, పసివారికి సహాయం చేశాడు. తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా గౌరవించాడు. కేవలం ఆలయాలే కాదు, మసీదులను సైతం కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడు వంతులు ముస్లిములే. వారిని కూడా ఉన్నత పదవుల్లో నియమించాడు. ముప్పై సంవత్సరాలు శివాజీ, ఆయన అనుచరులు చూపిన పరాక్రమాలు, కర్తృత్వ శక్తి, త్యాగశీలత, ధ్యేయ నిష్ఠ హిందువులలో నూతనోత్తేజం నింపాయి. యాభై ఏళ్ళ సామ్రాజ్య నిర్మాణ కృషి ఫలితంగా దేహం పూర్తిగా అలసిపోగా ఆరోగ్యం క్షీణించడంతో, 1680 ఏప్రిల్ 3న శివాజీ తుది శ్వాస విడిచాడు. భారతీయుల ఆదర్శ పురుషునిగా నిలిచాడు.
