Thursday, August 18, 2022
HomeLifestylespecial Editionజీవ పరిణామ సిద్ధాంత కర్త డార్విన్

జీవ పరిణామ సిద్ధాంత కర్త డార్విన్

డార్విన్ పేరును తలుచుకుంటే ఎవరికైనా వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం. భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయముపై పరిశోధనలు చేసి, జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అయన. ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి – అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్ట మొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్ మాత్రమే. వానరుని నుంచి నరవానరుడు, నరవానరుని నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. చార్లెస్ రాబర్ట్ డార్విన్ (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 19, 1882) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది.

డార్విన్‌ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో జన్మించాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. ఆయనను మంద బుద్ధిగా ఉపాధ్యాయులు భావించేవారు. ఆయన చిన్ననాటి నుండి కీటకాలను, ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. 16 యేండ్ల వయస్సులో వైద్య విద్యను చదవటం కోసం ఆయనను ఎడిన్ బర్గ్ విశ్వ విద్యాలయంలో చేర్పించారు. కాని మత్తు మందులు లేకుండా చేస్తున్న ఆపరేషన్లను చూచి, ఆ చిత్రహింసకు ఆయన కలత చెంది వైద్య విద్యపై మనసు పెట్టి చదవలేక పోయాడు. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్‌లో తత్త్వశాస్త్ర అధ్య అధ్యయనంలో చేరినా అక్కడా అదే పరిస్థితి. అక్కడి ప్రొఫెసర్‌ ఓసారి అతడికి ‘బీగల్‌’ అనే ఓ నౌక కెప్టెన్‌ కు పరిచయం చేశాడు. వివిధ దేశాల్లో, దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్‌ తన తండ్రి వద్దంటున్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు. ఆ నౌకాయానంలో డార్విన్‌ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు. ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు. 150 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించ.లేదని, అవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక ద్వారా పరిణామం చెందాయని డార్విన్‌ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఇప్పటి మైక్రో బయాలజీ, జెనిటిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీలను సంఘటిత పరచడంలోనూ, డీఎన్ఏ పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది.

చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో “డార్వినిజం” చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి ఒక రకమైన కోతి జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది. ఇప్పుడు కూడా సృష్ఠివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ సిధ్ధాంతం మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద రచనలకి కూడా ఊపిరి పోసింది. మలేషియా నుంచి రసెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్ 1844లో తన రచనను, వాలేస్ పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు. 1858 జూలై 15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలు పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలు పెట్టగా, వాలేస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.

ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటి నుంచీ లేవనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైన వాదన. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరత పులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివే. గతంలో వీటికి తలొక “పూర్వీకుడూ” ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ “ఆదిమ” శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగా, మరికొన్ని మాంసాహారులుగా రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు “వాటంతట అవే” ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది. ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవ జాతి క్రమంగా ఉత్తర దిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలి మానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవ సమూహం తెల్లగా మారి పోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా. తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా, ఒక్క మనిషి జాతినే తీసుకుంటే, చర్మం రంగూ, ముఖ కవళికలూ అన్నీ మెల్ల మెల్లగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది. సరిగ్గా ఆ సమయంలోనే ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ అనే మరో శాస్త్రవేత్త కూడా డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్నే వెలువరించాడు. డార్విన్ కు ఉత్తరం కూడా రాసాడు. 1858 లో వీరిద్దరూ సంయుక్తంగా ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. కూడా! 1859 లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన “ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ ఆఫ్ నేచురల్ సెలక్షన్” పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ వెలువరించాడు. ఈ పుస్తకం విడుదలైన రోజునె ఆన్ని ప్రతులూ అమ్ముడు పోయి సరికొత్త రికార్డును సృష్టించింది.

పరిణామ సిద్ధాంతం జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతిలో సంఘర్షణ. ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థకమ జీవులు. ఇవే మనుగడను సాగిస్తాయి. ఈ జీవులలోని వైవిద్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి మూలాధారాలు అవుతాయి. ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం. అయితే సృష్టి సిద్ధాంత వాదులు ఈయన వాదనను సమర్థించరు. అయితే బైబిల్ లో చెప్పినట్లు ఏడు రోజుల లోనే సమస్త సృష్టి, సకల జీవ జలాలు రూపొందించ బడినాయని చెబితే మాత్రం నమ్మడం కష్టం.

చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.

అయితే కొన్ని క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పద మయ్యింది. సృష్ఠి వాదాన్ని వ్యతిరేకించడం దైవ ద్రోహం అని మతవాదుల వాదన. కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఈ సిధ్ధాంతాన్ని నిషేదించారు. ఈ సిద్ధాంతం తప్పని, జీవ పరిణామక్రమం జరగలేదని వాదించే వారు కూడా ఉన్నారు.
ఈయన 74 యేండ్ల వయస్సులో మృతి చెందాడు. సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఆయన కూడా సమాధి చేయ బడింది. డార్విన్ లేకపోయినా ఆయన ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్దాంతం ఎప్పటికీ నిలిచే ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments