5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleLife styleబ్రిటీష్ పాలకులకు సింహ స్వప్నం చంద్రశేఖర ఆజాద్

బ్రిటీష్ పాలకులకు సింహ స్వప్నం చంద్రశేఖర ఆజాద్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భారత స్వాతంత్ర ఉద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆజాద్ గర్వించదగ్గ అసహాయ శూరుడు, అసమాన వీరుడు.

భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఆయన “పండిత్‌జీ”గా కూడా పిలువ బడ్డాడు. 1857 తరువాత సాయుధ పోరాటం చేసిన వీరుల్లో మొట్టమొదటి వాడు, దేశ ప్రజల రక్షణ కోసం ధర్మ యుద్ధమే సరైనది గట్టిగా నమ్మినవాడు ఆజాద్.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించాడు. ప్రాథమిక విద్యను సొంత గ్రామం లోనే పూర్తి చేసి, తర్వాత వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించాడు. ఆయన చిన్నప్పటి నుంచి హనుమాన్ భక్తుడిగా ఉండేవాడు.

1919 లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మా గాంధీ నడిపిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికి తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యాడు.

విచారణ సందర్భంగా కోర్టులో ఆయనను విచారిస్తున్న బ్రిటిష్ న్యాయాధికారి ఖరేఘాట్‌కు ఆ బాలుడిచ్చిన సమాధానంతో మతి పోయింది.

వాస్తవానికి తన పేరు ‘ఆజాద్’ అని, తన తండ్రి పేరును ‘స్వతంత్రం’, తన నివాసం ‘జైలు’ అని చెప్పాడు.
‘‘మతిపోయిన ఆ న్యాయాధికారి చిదిమితే పాలుగారే ముఖారవిందు డైన ఆ బాలుడిని చూస్తూ కూడా అధికార దర్పంతో ‘15 కొరడాల దెబ్బల’ శిక్ష ప్రకటించాడు. నరరూప రాక్షసులు కొరడా ఝళిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే.. ఆ బాలుని శరీరమంతా రక్తసిక్తమై పోయింది. అయినా ఆ బాలుడు దెబ్బ పడినపుడు వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటున్నాడు. ఈ ధైర్యం చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ రోజు నుండి ఆయన పేరు ‘చంద్ర శేఖర్ ఆజాద్’ గా మారింది.

“సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవ వాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారత దేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందే నని ఆయన బలంగా నిశ్చయించు కున్నాడు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించాడు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గ నిర్దేశకుడిగా మారి పోయాడు. ఆజాద్… 1926లో కకోరీ ట్రైన్ దోపిడీ, అదే సంవత్సరంలో వైశ్రాయి రైలును కాల్చి వేయడం, లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చు కోవడానికి 1928వ సంవత్సరంలో లాహోర్‌లో జె.పి. సాండర్స్‌ను కాల్చి వేయడం తదితర హింసాత్మక కార్యక్రమాల్లో పాలు పంచు కున్నాడు.

ఒకానొక దశలో ఆజాద్ బ్రిటీష్ పోలీసులకు సింహస్వప్నంలా నిలిచారు. పోలీసుల హిట్‌లిస్ట్‌ను తయారు చేసుకున్న ఆయన వారిని చంపేదాకా వదిలి పెట్టలేదు. పదిహేనేళ్ల ప్రాయంలో అరెస్టయిన తరువాత బయటికి వచ్చి పోరాటంలో పాలు పంచుకున్న ఆజాద్… ఆ తరువాత తన మరణం దాకా కూడా ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదు.

1931, ఫిబ్రవరి 27వ తేదీన తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాదు లోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టు ముట్టారు. ఆజాద్‌ను లొంగి పోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు ఎదురు తిరిగాడు. వెంబడిస్తున్న పోలీసుల్లో ముగ్గురిని కాల్చి చంపాడు. ఐనా తరుముతూ వస్తున్న పోలీసులకు చిక్కే పరిస్థితి వచ్చింది. ఇక తుపాకీలో ఒకే ఒక్క బుల్లెట్ వుంది. దానితో వాళ్లను మట్టుబెట్ట లేనని తెలుసుకుని, బ్రిటిష్ వారి చేతిలో చనిపోవడం కంటే తనకు తానే ఆత్మత్యాగం చేసుకోవాలను కున్నాడు. వెంటనే తుపాకీని తన తలకు గురిపెట్టి కాల్చుకుని అమరడయ్యాడు.

”నీలో ఉన్నది ఉప్పునీరా? అయితే నీకోసమే బతుకు. కాదూ ఉడుకు రక్తమంటావా? అయితే దేశం కోసం మరణించు. నీ దేహం నిప్పుకణాల కొలిమి అయితే అనుక్షణం నీ ప్రాణాన్ని సంఘానికి సమర్పించు. నీ గుండెకాయ పత్తికాయ అయితే భరత మాతను మరిచిపోయి నీ సుఖమే చూసుకో” – ఇలా రోమాలు నిక్కబొడుచు కునేలా పలికిన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్.
బతికుండగా బ్రిటీష్ వారు నన్ను పట్టుకోలేరు. వాళ్ళకు అంత దమ్ము లేదు. అని పదే పదే ఆజాద్ అంటుండే వాడు. “నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’’ అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజంచేస్తూ, పోలీసులకు చిక్కక, పిస్తోలుతో పేల్చుకుని స్వతంత్ర జీవిగా అస్తమించాడు. అజాద్ పోరాడిన తీరు భారతదేశ స్వాతంత్ర చరిత్రకే వన్నె తెచ్చిన ఘటన. భారతీయ యువతకు ఒక మహోజ్వల ప్రేరణ, అసమాన ఉదాహరణ.

చివరిదాకా ఆజాద్‌ను ప్రాణాలతో పట్టుకోవాలని భావించిన బ్రిటీష్ పోలీసులు సాధ్యంకాక… ఆయన మృత దేహాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఆజాద్ ఆత్మత్యాగం ప్రజల్లో మరింత పట్టుదలను పెంచి, దేశభక్తిని రగిల్చింది. పోరాట పథం పట్టేలా ప్రోత్సహించింది.

ఆజాద్ మరణించిన అలహాబాదు లోని ప్రయాగ్‌రాజ్ పార్కుకు చంద్రశేఖర్ ఆజాద్ పార్కుగా నామకరణం చేయ బడింది. మరణించే సమయంలో ‘ఆజాద్’ వద్ద ఉన్న పిస్టల్ అలహాబాద్ మ్యూజియంలో ప్రదర్శించ బడింది. 1988లో భారత ప్రభుత్వం చంద్రశేఖర్ ఆజాద్ ముఖచిత్రంతో తపాలా బిళ్ళను విడుదల చేసింది.
1965లో షహీద్ సినిమాతో ప్రారంభించి పలు భాషలలో ఎన్నో సినిమాలు నిర్మించ బడ్డాయి.
2018లో టెలివిజన్ సీరీస్ తీయబడింది. చంద్రశేఖర్ ఆజాద్ జన్మించిన మధ్య ప్రదేశ్‌లోని భభ్రా (భవ్రా) గ్రామం చంద్రశేఖర్ ఆజాద్ నగర్‌గా పిలవడం జరుగుతోంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments