5.1 C
New York
Saturday, March 25, 2023
Homespecial Editionఅలుపెరుగని కమ్యునిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు

అలుపెరుగని కమ్యునిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

Chandra Rajeshwara Rao
నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, ఏళ్ళతరబడి ఉద్యమాల్లో, అజ్ఞాత వాసంలో గడిపిన అలుపెరుగని కమ్యునిస్టు నిస్వార్థ పోరాట యోధుడు చండ్ర రాజేశ్వరరావు. కమ్యూనిస్టు పార్టీకి ఆరున్నర దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన నిబద్దత కలిగిన మహా నేత రాజేశ్వరరావు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి 28 సంవత్సరాల సుదీర్ఘ కాలం నేతృత్వం వహించిన రాజేశ్వరరావు జీవితం సైద్ధాంతిక నిబద్ధతకు, నిజాయితీకీ నిలువుటద్దం. చండ్ర రాజేశ్వరరావు భారత కమ్యూనిస్టు పార్టీ తొలితరం అగ్రనాయకుల్లో ఒకరు. పేరుకు తగినట్టుగానే ప్రత్యర్ధులపై చండ్ర ప్రచండత్వం ప్రదర్శించేవారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధులతో మమేకమైన కమ్యూనిస్టు ఆయన. ఎంతటి వారితో నైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించేవారు. నెహ్రూ, ఇందిరాగాంధీలు తీసుకున్న నిర్ణయాల్లో ప్రజోపయోకరాలను సమర్ధించినా, నిరంకుశ చర్యలను వ్యతిరేకించిన నిష్పక్షపాతి ఆయన.

పీడిత, తాడిత జనోద్ధరణ కోసం ఎంతో ఉజ్వలమైన భవిష్యత్‌ను వదులు కుని కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన ఆయన పేదల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచారు. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి, తదితర పార్టీ అగ్రనాయకులతో కలిసి, దశాబ్దాల పాటు రాష్ట్రంలోనే కాక, దేశంలోని పలు ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశారు.

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని మంగళాపురం గ్రామంలో 1914 జూన్‌ ఆరవ తేదీన పెద్ద భూస్వాముల కుటుంబంలో జన్మించిన రాజేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీలో చేరిన తరువాత ఆ భూస్వాములకు వ్యతిరేకంగా, భూమి లేని నిరుపేదల తరఫున దశాబ్దాలపాటు పోరాటం జరిపారు.

చండ్ర రాజేశ్వరరావు ప్రాథమిక విద్యాభ్యాసం మంగళాపురంలో, సెకండరీ విద్య చల్లపల్లిలోనూ సాగింది. బందరు హిందూ స్కూలులో ఎస్సెస్సెల్సీ పూర్తిచేశారు. విద్యార్ధి దశలోనే రాజేశ్వరరావు క్రీడాకారునిగా, పేదల పాలిట ఆత్మీయునిగా పేరొందారు. మహాత్మా గాంధీ పిలుపుపై సాగిన ఉప్పు సత్యాగ్రహంలో వలంటీర్‌గా పని చేశారు. యుక్తవయసులోనే విప్లవ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. మహాత్మాగాంధీ ఉద్యమాల్లో పనిచేస్తున్నా, విప్లవ కిశోరాలైన భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ వంటివారి పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకున్నారు. బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన హిందూ, ముస్లిం ఐక్యత కోసం ఎంతోకృషి చేశారు. కమ్యూనిస్టు నాయకులను ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం మీరట్‌ కుట్ర కేసులో ఇరికించి జైళ్ళలో పెట్టినప్పుడు వారు విడుదల చేసిన ప్రకటన రాజేశ్వరావును ఉత్తేజపర్చింది. వామపక్ష భావాలున్న విద్యార్ధులందరినీ ఐక్యపర్చి సాటి విద్యార్ధులతో కలిసి ఒక స్టడీ సర్కిల్‌ని ఏర్పాటు చేశారు. తరువాత అది ‘యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌’గా అవతరించింది.

బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే మతవాద, మితవాద వర్గాలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీశాలి రాజేశ్వరరావు. తరచుగా ఘర్షణలకు దిగడం, కమ్యూనిస్టు వర్గానికి నాయకత్వం వహించడంతో బిఎస్సీ పూర్తి కాకముందే ఆయన యూనివర్శిటీ నుంచి టీసీ తీసుకుని బయటికి వచ్చారు. బెనారస్‌లో ఉండగానే ఆయన లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు హాజరయ్యారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సోవియట్‌ రష్యా సందర్శించి వచ్చిన తరువాత సోషలిజం, స్వాతంత్య్ర పోరాటంలో కార్మిక, కర్షక పాత్ర, వర్గ సంఘాలు, వర్గ పోరాటాల పేరిట రాసిన వ్యాసాలు రాజేశ్వరరావును విశేషంగా ఆకర్షించాయి.అదే సందర్భంలో ఆయన మహాత్మా గాంధీని కలిసిన విద్యార్ధి బృందంలో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలో మెడిసిన్‌లో చేరినా, ఆయన కమ్యూనిస్టు భావాల ప్రచారానికి నిడమర్తి ఉమారాజేశ్వరరావు ప్రభృతులతో కలిసి స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వల్ల ఆయన చదువు బెనారస్‌లోనూ, విశాఖలోనూ సవ్యంగా సాగలేదు.

తండ్రి అభిమతానికి వ్యతిరేకంగా ఆయన సావిత్రమ్మతో వివాహాన్ని అతి నిరాడంబరంగా దండల మార్పుతో చేసుకున్నారు. వారి వివాహానికి ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య పెళ్ళిపెద్దగా వ్యవహించారు. సావిత్రమ్మ కూడా భర్త మార్గంలోనే కమ్యూనిస్టు ఉద్యమం ప్రచారం కోసం జీవితాంతం కృషిచేశారు. వివాహానికి గుర్తుగా మెడలో వేసుకున్న గొలుసు రాయిని తీయించి ఎర్ర నక్షత్రాన్ని వేసుకోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. పార్టీ నిర్ణయం మేరకు పూర్తి కాల కార్యకర్తగా పనిచేయడం కోసం ఆమె శాంతినికేతన్‌లో చదువు కోవాలనే ఆకాంక్షను బలవంతంగా అణగ దొక్కుకున్నారు.

కృష్ణా జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ విస్తరణకు రాజేశ్వరరావు దంపతులు విశేషంగా కృషిచేశారు. కార్మిక, కర్షక సంఘాలను ఏర్పాటు చేసి, మంగళాపురం కూలీల పోరాటానికి, చల్లపల్లి జమిందారు అక్రమాలపై ఉద్యమానికి నేతృత్వం వహించారు. కృష్ణాజిల్లా తిరువూరు తాలూకాలో నైజాం సరిహద్దున ఉన్న తునికిపాడుకు వచ్చిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి ప్రభృతులు నైజాంలో పరిస్థితి గురించి వివరించారు. ఆ క్రమంలోనే రాజేశ్వరరావుకు… ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చిర్రావూరి లక్ష్మీనరసయ్య ప్రభృతులు కూడా రావడంతో వారందరితో రాజేశ్వరరావుకు పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా తెలంగాణాలో అనేకసార్లు పర్యటించి తెలంగాణలో పార్టీ నిర్మాణానికీ, భువనగిరి ఆంధ్ర మహాసభ నిర్వహణకు తోడ్పడ్డారు. తెలంగాణా కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకులను సమన్వయ పర్చడంలో,సాయుధ పోరాటంలో కీలకపాత్ర వహించారు.

భారత విప్లవోద్యమం గురించి స్టాలిన్‌తో చర్చించేందుకు అజయ్‌ ఘోష్‌, ఎస్ఏ డాంగే, బసవ పున్నయ్యలతో పాటు రాజేశ్వరరావు మాస్కో వెళ్ళారు. రాజేశ్వరరావు ఎంత పెద్ద నాయకుడైనా ఏమాత్రం అభిజాత్యాన్ని ప్రదర్శించకుండా, నిరంతరం ఏదో తెలుసు కోవాలనే తపనతో ఉండేవారు. పుచ్చలపల్లి సుందరయ్య పట్ల ఎంతో గౌరవం ఉన్నా, అవిభక్త కమ్యూనిస్టు పార్టీ చీలినప్పుడు ఆయన భారత కమ్యూనిస్టు పార్టీకి నేతృత్వం వహించారు. రాజేశ్వరరావు సిద్ధాంతాలతో ఏనాడూ రాజీ పడలేదు. ఇందిర ప్రభుత్వం తీసుకున్న ప్రగతి శీల చర్యలకు మద్దతు ఇస్తూనే, ఆమె నిరంకుశ పోకడలను తీవ్రంగా వ్యతిరేకించే వారు. 1970వ దశకంలో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో సాగిన భూ ఆక్రమణ ఉద్యమం పార్టీ ప్రతిష్ఠను పెంచి, అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఉద్యమం విజయవంతం కావడంలో రాజేశ్వరరావు పాత్ర గణనీయం. ఆయన పిత్రార్జిత ఆస్తిలో తన వాటాను పూర్తిగా పార్టీకోసం వెచ్చించారు. పార్టీకి ఆయన విరాళంగా ఇచ్చిన లక్షలాది రూపాయిలతో ఆరోజుల్లో వందలాది ఎకరాలను కొనగలిగి ఉండేవారనేది వాస్తవం.

ఆయన ఢిల్లీ వెళ్ళినా,ఎక్కడికి వెళ్ళినా పార్టీ కార్యాలయాల్లోనే బస చేయడం, తన బట్టలను తానే ఉతు క్కోవడం నిరాడంబర జీవితం తానికి ప్రబల నిదర్శనాలు. అక్టోబర్‌ విప్లవం 60వ వార్షికోత్సవాల సందర్భంగా భటిండాలో జరిగిన పార్టీ మహాసభలో ఆమోదించిన తీర్మానం చరిత్రాత్మకమైనది. రాజేశ్వరరావు సోవియట్‌ యూనియన్‌లో గోర్బొచెవ్‌ ప్రవేశపెట్టిన సహకార వ్యవసాయం, కాంట్రాక్ట్‌ సేద్య విధానాలను రాజేశ్వరరావు సమర్ధించారు.

సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన తరువాత సంభవించిన పరిణామాల పట్ల ఆయన చివరి రోజుల్లో ఎంతో కలత చెందారు.

ప్రపంచంలో ఎక్కడ ప్రగతి శీల పోరాటాలు జరిగినా వాటికి ఆయన మద్దతు ప్రకటించేవారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనేక సమస్యలపై ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పటికీ, సిపిఎం వ్యతిరేక ధోరణి వల్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆవేదన చెందేవారు.

ఆయన ఎన్నో పురస్కారాలను పొందినా,1994 లో పొందిన సోవియట్ యూనియన్ ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌ పురస్కారం అత్యంత ప్రతిష్ఠాకరమైనది. సుదీర్ఘకాలం పార్టీకోసం అహర్నిశలు కృషిచేసిన రాజేశ్వరరావు 80 వ ఏట 1994 ఏప్రిల్‌ 9వ తేదీన హైదరాబాద్‌లో కన్నుమూశారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments