చలసాని ప్రసాద్ ప్రముఖ కవి,రచయిత, విమర్శకులు. ఆయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులు. విప్లవ రచయితగా, ప్రజా ఉద్యమాలను సమర్థించే కార్యకర్తగానే ఆయన జీవితమంతా గడిపారు. ఉద్యమాల అణచివేతపై గళమెత్తారు. ఈ క్రమంలో అనేక సార్లు జైలుకు వెళ్లారు. విరసం ప్రస్థానంలో చలసానిది చెరగని ముద్ర.
చలసాని ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా లోని భట్ల పెనుమర్రు. డిసెంబరు 8 1932 న కృష్ణానదీ తీరంలోని చల్లపల్లి దగ్గరిలో నాదెళ్ళవారి పాలెంలో జన్మించారు. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది., కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్‌లతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. పలు గ్రంథాలను ఆయన సంకలనం చేశారు. శ్రీశ్రీ సాహిత్యంపై ఆయనకు ఎనలేని పట్టు ఉండేది. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల్లో ఆయన ముఖ్యమైన భూమిక పోషించారు చలసాని ప్రసాద్. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగారు.
కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్రవహించిన చలసాని ప్రసాద్.. నమ్మిన సిద్ధాంతాలకోసం చాలా మందితో విభేదించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఎమర్జన్సీ కాలంలో చలసాని ప్రసాద్ జైలు శిక్ష అనుభవించారు. సాహితీ విమర్శకుడుగా ఎందరికో స్ఫూర్తి నిచ్చారు. విప్లవ రచయితల సంఘం స్థాపనలో శ్రీశ్రీతో కలిసి పనిచేశారు. ప్రజా ఉద్యమాల అణిచివేతలపై జీవితకాలం పోరాడారు. ఎన్నోసార్లు జైలు జీవితం గడిపాడు. శ్రీశ్రీ, రంగనాయకమ్మలకు చలసాని అత్యంత సన్నిహితులు.
ఆయన విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాల నుంచి రాజనీతి శాస్త్రం అధ్యాపకునిగా పదవీ విరమణ చేశారు. హెచ్.బి.కాలనీ, విశాఖపట్నంలో ని ఆయన గృహంలో అనేక 20 వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. అందులో ఎక్కడా లభించని అరుదైన పుస్తకాలు ఉన్నాయి. ఆయన అనేక విషయాలలో లోతుల వరకు చర్చించేవారు. ఆయన వద్ద ఉన్న పుస్తకాల ఆధారంగా ఎందరో పీహెచ్‌డీలు చేశారు.
ఆయన వామపక్ష భావజాలం కలిగి ఉన్నప్పటికీ విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య సమావేశాలకు ఎప్పుడూ హాజరయ్యేవారు. ఆయనకు రచలనంటే ఆసక్తి ఎక్కువ. పధ్నాలుగేళ్లు కష్టపడి ఇరవై భాగాలుగా శ్రీశ్రీ సాహితీ సర్వస్వాన్ని ప్రచురించినా, అదే తరగని ఉత్సాహంతో రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల సాహిత్యమంతటినీ సంపుటాలుగా వెలువరించినా అది చలసానికే చెల్లింది.
కృష్ణాజిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చలసాని ప్రసాద్ బాల్యం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ పెరిగారు. తెలంగాణా సాయుధ పోరాటంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా పాలుపంచుకుంది. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి మార్క్సిస్టుగా పెరిగి, విప్లవ రచయితగా స్థిరపడ్డ చలసాని జీవితం ఎన్నో ప్రత్యేకతల సమాహారం.
సాహిత్య రంగంలో ఆయన కృషి ఎన్నదగినది. సాహిత్యోద్యమాల నిర్మాణంలో గత అర్ధ శతాబ్దంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకత్వంలో ఆయనది ప్రధానమైన పాత్ర. ఆయన పేరు ఎవరు ప్రస్తావించినా విరసం ప్రసాద్ అంటారు. విరసం దాదాపుగా ఆయన ఇంటిపేరై పోయింది. ప్రసాద్ సాహితీ సృజన తక్కువేమీ కాదు. కవిత్వం, వ్యాసాలు రాశారు. అవసరమైనప్పుడల్లా సామాజిక, రాజకీయ అంశాల మీదా రాశారు. అయితే ఉద్యమ జీవు లందరికి లాగే తన సృజనాత్మక శక్తిని ప్రోది చేసుకుని, పదిల పరచుకుని ఆ రంగంలో కీర్తి సంపాదించాలన్న దుగ్ధ ఆయనకేనాడూ లేదు. 1970లో విరసం ఏర్పడినప్పటి నుంచి కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. 1985 నుంచి 88 వరకు మూడేళ్ల పాటు విరసానికి కార్యదర్శి. 1998 నుంచి 2002 వరకు అధ్యక్షులు. అయినా ఆయన సాహిత్యోద్యమంలో తనను తాను కార్యకర్తగానే పరిగణించే వారు. సాహితీ రంగం కూడా ఆయనను అదే దృష్టితో చూసింది. తొమ్మిదో తరతి విద్యార్థిగా ఉన్నప్పుడు 1947 “నవయుగ” సంచికలో “ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరి ఆయుధమోయ్” అన్న పాటతో మొదలు పెట్టి కవిత్వం, సాహిత్య విమర్శ, ముందు మాటలు, సాహిత్య, రాజకీయ అంశాల మీద వ్యాసాలు దండిగానే రాశారు. చాలా కాలంపాటు ఒకటి రెండు అనువాదాలు తప్ప స్వతంత్ర రచనలుగా ప్రచురించడం మీద ఆయన దృష్టి ఎన్నడూ లేదు. 2008లో “సాహిత్య వ్యాసాలు”, 2010లో “చలసాని ప్రసాద్ రచనలు” వెలువడ్డాయి. ఇంగ్లీషును ఎదిరించి నిలిచిన భాష తెలుగు. ఏ భాషా పదాన్నయినా తనలో కలుపుకొని ఎదిగే శక్తి తెలుగుకు ఉంది. అందుకే తెలుగు అజరామరం. తెలుగు భవిష్యత్తు ఉజ్వలం అని చలసాని చెపుతుండే వారు. చలసాని జూలై 25, 2015న విశాఖపట్టణం లోని తన నివాసంలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.
