5.1 C
New York
Sunday, May 28, 2023
HomeLifestyleDevotionalపంచాంగం ప్రాధాన్యత

పంచాంగం ప్రాధాన్యత

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

“కాల సృజతి భూతాని, కాలస్సంహరతే ప్రజా: కాలము చరాచర సృష్టికి, సృష్టి అంతానికి మూలాధారం. అందుకే కాలాన్ని దైవంగా భావిస్తారు. అలాంటి కాలాన్ని గురించి తెలుసుకు నేందుకు ఉపయోగపడే సాధనమే పంచాంగము. పంచాంగము అనగా పంచ+అంగము. కాలము యొక్క ప్రధాన అంగాలైన, విభాగాలైన తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే అయిదు అంగముల గురించి తెలుపుతుంది, కనుకనే పంచాంగము అని నమాంకితయైంది.
మనం ప్రస్తుతం వాడుతున్న క్యాలెండర్ తేదీలు, మాసాలు, సంవత్సరాలను సూచిస్తుంది. ఋగ్వేదంలో నక్షత్ర ప్రస్తావన ఉంది. పంచాంగం గ్రహ గణితానికి మూలమైన, సూర్య సిద్ధాంతం 10వ శతాబ్దంకు ముందు పేర్కొన బడింది. విక్రమ శకాన్ని ఉత్తర, పశ్చిమ భారతావనిలో, నేపాల్ లో అనుసరిస్తారు. అలాగే శాలి వాహన శకమును దక్షిణ భారత దేశంలో, మహారాష్ట్ర, గోవా, ప్రాంతాలలో ఆచరిస్తారు. పూర్ణిమతో మొదలయ్యే నెలను పూర్ణిమాంత మాసమని, అమావాస్యతో పూర్తయ్యే మాసాన్ని అమాంత మాసమని అంటారు. మన దేశంలో అధిక ప్రదేశాలలో పూర్ణిమాంత మాసం వాడుకలో ఉంది.
మనం అనుసరిస్తున్న కాలం ఆరు భాగాలుగా విభజితమైంది. సంవత్సరం, ఆయనము, ఋతువు, మాసము, పక్షం, దినం. ఇక వివిధ సంవత్సరాలను పరిశీలిస్తే….(1). చంద్రుని గమనం ఆధారంగా చైత్ర శుక్ల పాడ్యమి మొదలుకొని ఫాల్గుణ కృష్ణ అమావాస్య వరకు గల కాలాన్ని చాంద్రమాన సంవత్సరం అంటారు. (2). సూర్యుడు మేష రాశిలో ప్రవేశించి మీన రాశి వరకు సంచరించే కాల ప్రమాణాన్ని సౌరమాన సంవత్సరం అంటారు. (3). 30 రోజులకు ఒక నెల చొప్పున 360 రోజులతో పన్నెండు మాసాలు కలిగి ఉండేది సావన మాస సంవత్సరం. (4). అశ్విని నుండి రేవతి వరకు కలిగిన, నక్షత్రాల మీదుగా చంద్రుడు సంచారం చేసే కాలాన్ని ఒక నెలగా, ఇలా పన్నెండు నెలలు అంటే 324 రోజులు కలిగిన కాలం నాక్షత్ర మాన సంవత్సరం.(5). గురువు ఒక రాశిలో ప్రవేశించి ఆ రాశిలో ఉండే కాలానుగుణ్యాన్ని బార్హస్పత్యమాన సంవత్సరం అంటారు. ఇక ఆయనాల విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం ఉత్తర, దక్షిణాయనాలు రెండు ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దినం నుండి కర్కాటకం లో ప్రవేశించే వరకు ఉత్తరాయణం, తిరిగి మకరంలో ప్రవేశించే వరకు దక్షిణాయనం. ప్రతి రెండు మాసాలకు కలిపి ఒక ఋతువు. సంవత్సరానికి ఆరు ఋతువులు. చాంద్ర మానం ప్రకారం శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఒక మాసం. అవి సంవత్సరానికి పన్నెండు ఉంటాయి. మాసానికి శుక్ల, కృష్ణ రెండుపక్షాలు. దినం అనగా సూర్యోదయం నుండి మొదలై తిరిగి సూర్యోదయంతో ముగిసేది. గ్రహాల పేర్లు ఆధారంగా దినాలకు పేర్ల నిర్ణయాలు జరిగాయి. గణనకు సంబంధించి, అవసరమైన సిద్ధాంత భాగం, ఖగోళ విజ్ఞానం పై ఆధారపడి ఉంటుంది. ఇదే పంచాంగ గణనకు మూలాధారం. గణనకు సంబంధించిన అంశాలను వివరించేవి సిద్ధాంత గ్రంథాలు. సూర్య: పితామహో వ్యాస: వసిష్టోత్రి పరాశర: కాశ్యపో నారదో గర్గ: మరీచిర్మనురంగిరా: లోమశ: పౌలిశశ్చైవ చ్యవనో యవనో భృగు: శైనకోష్టాదశ హ్యేతే జ్యోతిష శాస్త్ర ప్రవర్తకా: అని మన ప్రాచీన జ్యోతిష సిద్ధాంత కారుల గురించి శ్లోకాధారం. తర్వాతి కాలంలో, భాస్కరాచార్యుడు, వరాహమిహిరుడు, బ్రహ్మ గుప్తుడు, ఆర్యభట్టు తదితర సిద్ధాంత గ్రంథ కర్తలు ఎందరో ఉన్నారు. వరాహ మిహిరుడు తదితరులు పంచాంగ రూపంలో రాయడానికి అవసరమైన, విధానాలను రూపొందించారు. వాటిని తంత్ర గ్రంధాలు అంటారు. గణేశ దైవజ్ఞాది పండితులు కరణ గ్రంథాలను రచించారు. పంచాంగ గణన సులభం చేశారు. ప్రస్తుత కాలంలో, గ్రహలాఘవం, గణకానందం, నర కంఠీరవం, తిథి రత్నావళి, తిథి చంద్రిక తదితరాలు అందుబాటులో ఉన్నాయి.
మానవుడు దైనందిన జీవితంలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాడు. అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా, సత్ఫలితాలు పొందడానికి, విజయవంతంగా పూర్తి కావడానికి ఉచిత సమయంలో, ప్రారంభించడం అవసరం. కాల ప్రవాహంలో ఎలాంటి సమయం, సదరు వ్యక్తికి అనుకూల లేదా వ్యతిరేక ఫలితాలను ఇస్తుందో, తెలుసు కోడానికి పంచాంగం ఉప యుక్తమవుతుంది. ప్రధానంగా భారత దేశంలో, ప్రతి శుభ, అశుభ కార్యక్రమానికి పంచాంగం ద్వారా ముహూర్తాన్ని లెక్కించి, దానిని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచరణ. పంచాంగాన్ని విశ్వసించే మానవుడు, జన్మించింది మొదలు మరణించే వరకు, ప్రతి కార్యక్రమంలో పంచాంగాన్ని అనుసరిస్తున్నాడు. ఒకనాడు యజ్ఞ, యాగాది క్రతువులకు, సాంప్రదాయ సత్కర్మలకు ముహూర్తాలు నిర్ణయిం ప బడగా, నేడు బారసాల, కేశఖండనం, వివాహం, నామకరణం,గృహాది నిర్మాణ ప్రారంభాలు, ప్రవేశాలు, వ్రతాలు, పూజలు, ఒక్కటేమిటి అన్నింటికీ, హైందవ జీవన విధానంలో పంచాంగానికి విడదీయలేని, సంబంధం అనుబంధం ఉంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments