Thursday, December 8, 2022
Homespecial Editionఅనితర సాధ్యం...బులుసు త్యాగం.

అనితర సాధ్యం…బులుసు త్యాగం.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

దేశ స్వాతంత్ర్య పోరాటంలో సర్వం త్యాగం చేసిన ఒక చిత్తశుద్ది, అంకిత భావం, నిజాయితీ గల వ్యక్తి తీవ్ర నిరాదరణకు గురైన విషయం చాలా మందికి తెలియనిది. ఒక రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేసిన నేతను రాష్ట్రం ఏర్పడిన సందర్భం లో ఆయన అహ్వానింప బడని బాధాకరమైన నేపద్యం ఉంది. రాష్ట్ర శాసన సభాపతిగా పని చేసిన ఓ నేత స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ పొందలేని దుస్థితికి, తిండిలేక భిక్షాటనం చేసిన హృదయ విదారక సన్నివేశాలకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర మౌన సాక్షీభూతంగా నిలిచి ఉంది. కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర్యానికి ముందు, అధిక శాతం దేశభక్తుల, త్యాగ ధనుల పార్టీగా వుండేది. అలాంటి నిస్వార్థ త్యాగాల భాగ స్వామ్య ఫలితంగానే స్వాతంత్య్ర సాధన సాధ్యమైంది. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే నేటి నాయకుల లాగా కాకుండా, స్వాతంత్ర్య సాధనకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఎన్నో రకాలుగా లక్ష్య సాధనలో సకలం ఫణంగా పెట్టి పోరాడిన వారెందరో. లక్ష్య సాధన జరిగాక, నిర్లక్ష్యానికి గురైన వారింకెందరో. అలాంటి వారిలో అగ్రగణ్యుడు… బులుసు సాంబమూర్తి. సుఖమయ జీవితా న్ని గడపడానికి అన్ని అవకా శాలు అంది పుచ్చుకుని కూడా, దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన త్యాగధనుడు, అసలు సిసలైన దేశభక్తుడు బులుసు సాంబమూర్తి. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్ర మరచి పోలేనిది. మహాత్మా గాంధీ కన్నా ముందుగానే కొల్లాయి కట్టి సామాన్య ప్రజలతో మమేక మైన నిస్వార్థ సేవా పరాయణుడు బులుసు సాంబమూర్తి అని, ఈతరం వారికి తెలియక పోవచ్చు. ఆయన తూర్పు గోదావరి జిల్లా, దుళ్ల గ్రామంలో 1886, మార్చి 4 న జన్మించారు. ఆయన తండ్రి సుబ్బావాధానులు వేదపండితులు. కుటుంబమంతా దానధర్మాలు చేస్తూ ధార్మిక జీవనం సాగించే వారు. మద్రాసు విశ్వ విద్యాలయం నుండి బి.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులై, విజయనగరం మహారాజా కళా శాలలో కొంతకాలం భౌతిక శాస్త్రం బోధించారు. స్వేచ్ఛా స్వభావి అయిన సాంబమూర్తికి ఈ ఉద్యోగం అంతగా నచ్చలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి న్యాయవాద వృత్తి చేపట్టాలని నిర్ణయించు కున్నారు. బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై 1911లో కాకినాడలో న్యాయవాద వృత్తిని స్వీకరించి, మహాత్ముని పిలుపు నందుకొని న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1919లో హోంరూల్ ఉద్యమంలోను, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోను, 1932లో శాసనో ల్లంఘన ఉద్యమంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో, పలు సత్యాగ్రహాలలో పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. 1927లో నాగపూరు పతాక సత్యాగ్రహ దళానికి నాయకులు గాను, 1928 లో హిందూస్థానీ సేవా దళానికి అధ్యక్షులుగా పని చేశారు. తరువాత తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులుగా, 1929లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యులుగా వ్యవహ రించారు. 1930 ఉప్పు సత్యాగ్రహ సమయంలో తన సహచరులతో చొల్లంగి సముద్ర తీరానికి వెళ్ళి ఉప్పును తయారు చేశారు. సాంబ మూర్తిని అరెస్టుచేసి వెల్లూరు జైలు కు తరలించారు. 1935-37 మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా వ్యవహ రించారు.1935లో మద్రాసు ప్రోవిన్షియల్ ఎస్సెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి నప్పుడు, చక్రవర్తి రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ప్రభుత్యాన్ని ఏర్పాటు చేశారు. సాంబమూర్తి 1937 నుంచి 1942 వరకూ స్పీకరుగా ఉన్నారు. 1937లో కాంగ్రెసు మంత్రివర్గ పరిపాలనలో మద్రాసు రాష్ట్ర శాసనసభకు సభాపతిగా విధులను సంప్రదా యాలకు అనుగుణంగా, మర్యా దగా, అద్వితీయంగా నిర్వహించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు.

1923 లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ కాకినాడలో మూడు రోజులపాటు నిర్వహించిన సభకు దేశంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులు రాగా, ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా దేశభక్త కొండ వెంకట ప్పయ్య, కార్యదర్శిగా ఉండగా, ఆ సమయంలోనే సాంబమూర్తి ఏకైక కుమారుడు మరణించాడు. అయినా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అద్భుతమైన బులుసు బాధ్యతగా ఏర్పాట్లు చేసారు. జరిగిన విషాదం తెల్సుకున్న గాంధీజీ ఆ సభ సెషన్ ను ఆపేశారట. భారత కోకిల సరోజినీ నాయుడు సాంబమూర్తి స్థిత ప్రజ్ఞతకు చలించి అప్పటి కప్పుడు ఆ సభలో ఆశువుగా గీతాన్ని ఆలపించారట. ఉప్పు సత్యాగ్రహ సమయంలో ఉప్పు మీద పన్ను ఎత్తివేసే వరకు ఆహారంలో ఉప్పు వేసుకోనని ప్రతిజ్ఞ చేయడాన్ని బట్టి అయన వ్యక్తిత్వం అర్థం అవుతుంది.1937లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు స్పీకర్ గా ఎన్నికై, పని చేసి, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేంచుకు ఆ పదవి వదులు కున్న దేశభక్తులు బులుసు.చెన్నపట్నంలో ఆంధ్ర మహాసల ఏర్పాటులో చురుకైన పాత్ర పోషిం చటమే కాక తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగు రాష్ట్ర ఏర్పాటును రాజాజీ, నెహ్రూ వ్యతిరేకించారు. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షకు సిద్ధమైతే, ఆయన ను తన ఇంటినే వేదికగా చేసుకో మన్న నాయకుడు సాంబ మూర్తి, అమరజీవి ప్రాణత్యాగం చేసిన ఆ ఇంటిని స్మారక భవనంగా వదిలి కాకినాడకు చేరిన త్యాగమూర్తి బులుసు సాంబమూర్తి.1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక, కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్ర అవతరణకు నెహ్రూ విచ్చేసినా, కాంగ్రెస్ నాయకులు నెహ్రూకు భయపడి బులుసు సాంబమూర్తికి కనీసం ఆహ్వానం కూడా పంపని నాటి కాంగీయుల వ్యవహార శైలి బులుసుకు చేసిన అవమానికి, నిర్లక్ష్యానికి, నిరాదరణకు పరాకాష్ట . దేశస్వాతంత్ర్యం కోసం ఆదాయం ఇచ్చే న్యాయవాద వృత్తిని ఆయన వదులు కున్నారు. ఆంధ్రరాష్ట్రం కోసం మద్రాసులో తన ఇల్లు పదులు కున్నారు. స్వాతంత్ర్యం వచ్చింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కానీ బులుసు లాంటి త్యాగమూర్తి ఒంటరివారయ్యారు. భార్య గతించింది. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక మద్రాసులో నివాసం అనవసరంగా భావించి, సొంత ఊరు కాకినాడ చేరితే జీవితం బాగుపడుతుందని అనుకున్నారు. ఆయన నమ్ముకున్న కాకినాడలో పరిస్థితులు మరింతగా మారి పోయాయి.ఒకప్పుడు మహర్షి అని గుర్తింప బడి,ఆయన దర్శనం కోసం వెళుతున్నామని నలుగురిలో చెప్పుకుని బులుసు గారింటికి వెళ్ళటం గొప్పగా భావించిన కాంగ్రెస్ వాదులు, మహర్షి ఎదురుగా కనిపించినా పట్టించు కోని దుస్థితి. ఒకప్పుడు ఆయన్ని ఆరాధించిన వారే ముఖం చాటేశారు. ఆయన ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అన్నిరకాలుగా సహాయం పొందిన వారు, సాంబమూర్తి ఎదురు పడితే డబ్బులు అడుగుతాడని తప్పుకుని తిరిగారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక, సాంబమూర్తికి వయసు మీద పడింది. పేదరికం వెంటాడింది. వేళకు తినలేని పరిస్థితి. ఆదుకునే వారు లేకుండా పోయారు. ఒకనాడు కాకినాడ వీధుల్లో ఖరీదైన వాహనం మీద లాయర్ గా తిరిగిన సాంబమూర్తి చివరి రోజుల్లో అదే వీధుల్లో కంటి చూపు మందగించి, కాళ్ళకు సరైన చెప్పులు లేక చిరిగిన దుస్తులతో, చేతికర్ర సహాయంతో తిరుగుతూ భిక్షాటనం చేయాల్సిన పరిస్థితి దాపురించింది.ప్రతిరోజూ సాయంత్రం వేళ దేవాల యాల దగ్గర సమయం గడిపే వారు. దేవాలయాలమ దర్శించి అక్కడి ప్రసాదాలతో కడుపు నింపుకున్నారు. కొన్ని సందర్భా లలో దేవాలయం ముందు బిచ్చగాళ్ళతో చేరి క్షుద్భాధ భరించ లేక చేతులు చాపాడని అంటారు.ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి అర్జీ పంపితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి… బులుసు సాంబమూర్తి అనే ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు అనేందుకు తగిన ఆధారాలు ప్రభుత్వ రికార్డులలో లేవని సమాధానం వచ్చిందట. దేశం, నాయకులు విస్మరించిన దేశభక్తుల జాబితాలోని ఒక ప్రముఖుడు మహర్షి బులుసు సాంబమూర్తి.పేదరికంలో మగ్గుతున్న పొంబ మూర్తి గురించి తెలుసుకున్న నాటి కేంద్ర హోమ్ శాఖ మంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మాత్రమే ఆర్థిక సహాయం అందించారని, రాష్ట్ర నేతలు పట్టించుకోలేదని చెపుతారు. పేదరికం దానికి తోడు మానసిక వ్యథ తోడు కాగా చివరికి 1958 పిబ్రవరి 3న కాకినాడలోనే బులుసు సాంబమూర్తి అంతిమ శ్వాస విడిచారు. రాజకీయాలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం నిత్యం కనిపించే నేటి సమాజంలో అఖిలాంధ్ర ప్రజలచే మహర్షి అని గుర్తింప బడిన సాంబమూర్తి వంటి స్వార్థ త్యాగుల త్యాగ నిరతిని ప్రజలు గుర్తుకు చేసుకోవాల్సిన, ఈనాటి నాయకులు గుర్తు చేయాల్సిన అవసరం అనివార్యంగా ఉంది. ఆయన చరిత్రను భావి తరాలకు గుర్తు చేసేందుకు పాఠ్య అంశంగా చేర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments