Wednesday, November 30, 2022
HomeLifestyleDevotionalభీష్మాష్టమి

భీష్మాష్టమి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు. భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకూ, అంపశయ్యపై పరుండి ఉండి, మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెపుతారు. కాల నిర్ణయ చంద్రిక, నిర్ణయ సింధు, ధర్మసింధు, కాల మాధవీయం మున్నగు గ్రంథాలు మాఘ శుద్ధాష్ట మిని భీష్మ నిర్యాణ దినంగా చెపుతున్నాయి. కార్తీక బహుళ అమావాస్య నాడు భారత యుద్ధ ప్రారంభ దినంగా భావించ బడుతుంది. కార్తీక మాసంలో రేవతీ నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు, కౌరవుల వద్దకు రాయబారానికి పయనమైనట్లు భారతంలో ఉంది. కార్తీక పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం అవుతుంది.

కృత్తికా నక్షత్రానికి మూడవ పూర్వపు నక్షత్రం రేవతి. ఆనాటి గణనలో రేవతీ నక్షత్రం శుద్ధ త్రయో దశి అవుతుంది. రాయబారిగా వెళ్ళిన కృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులున్నాడు. వస్తూ కర్ణునితో మాట్లాడాడు. సదరు సంభాషణలో శ్రీకృష్ణుడు
జ్యేష్టా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ప్రారంభం కాగలదని కర్ణునికి చెపుతాడు. భీష్ముడు అంశయ్యపై యాభై ఎనిమిది రోజులు ఉన్నట్లు భారతంలో స్పష్టపరచ బడింది. భీష్మాచార్యులు యుద్ధం చేసింది పది రోజులు. భారత యుద్ధం ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి 68 రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘ శుద్దాష్టమి. అదీగాక భారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడు బంధు వధకు శంకిస్తాడు. ఆ సందర్భం లోనే శ్రీకృష్ణుడు, విజయునికి తత్త్వోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం యుద్ధం ప్రారంభ దినాన జరిగింది. ఆ దినాననే గీతా జయంతి (భగ వద్గీత పుట్టినదినం)గా జరపడం కొన్ని చోట్ల ఉంది. కనుక మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు.

మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి, ఇచ్చినమాట నిలబెట్టు కోవడానికి, శౌర్యసంపదకు ఓ గొప్ప ఉదాహరణ. అపారమైన శాస్తవ్రిజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహా లన్నింటినీ తీర్చి సమాధానా లిచ్చాడు భీష్ముడు. ఆనాడు ధర్మరాజుకు ఉపదే శించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికీ ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నాయి.

పద్మ పురాణంలో, హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడింది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగు తుందని విశ్వాసం. ఈనాడు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది. కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ఈ దినాననే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు స్పష్ట పరుస్తున్నది.

భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది. కొందరు పంచాంగకర్తలు ఈనాటి వివరణలో నందినీ పూజ, భీష్మాష్టమిగా పేర్కొంటారు. “వైయాఘ్ర సద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ, అపు త్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే, వసూ నామావతారాయ శంతనోరాత్మజాయచ, అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచారిణి”. అంటూ ఈదినం నాడు భీష్ములకు తర్పణం విడవాలని అమాదేర్ జ్యోతిషి పేర్కొంటున్నది. ఈనాడు తర్పణం శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments