భారతీ కరుణా పాత్రం భారతీ పద భూషణం !
భారతీ పదమారూఢం భారతీ తీర్థ మాశ్రయే !!
అద్వైత మత స్థాపనాచార్యులైన ఆది శంకరులు తూర్పున జగన్నాథంలో “గోవర్ధన మఠం” పశ్చిమాన ద్వారకలో “శారదా మఠం”, ఉత్తరాన కేదారంలో జ్యోతిర్మరం”, దక్షిణాన శృంగేరి యందు “శృంగగిరి మఠం” స్థాపించి మత కార్యనిర్వహణార్థం దేశం నలు చెరుగులా సంచరించి అద్వైత తత్వాన్ని వివరించి, దిగ్విజయ యాత్ర కొన సాగించారు. దుష్టాచారాలను నశింప చేసేందుకే కైలాస నాథుడే ఆది శంకరుని రూపంలో అవతరించారని “శివన్యాసం” స్పష్టపరుస్తున్నది. ఆదిశంకరులు స్థాపించిన శృంగగిరి మఠానికి 1989 నుండి తంగిరాల సీతారామ ఆంజనేయులు 38వ పీఠాధిపతి భారతీ తీర్ధ స్వామి కాగా, అయన ఉత్తరాధికారిగా కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ “విధుశేఖర భారతీ తీర్థ స్వామి”గా 23వ జనవరి 2015న నియమింప బడి జైత్ర యాత్రలు కొనసాగి స్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం జిల్లాలోని శ్రీశృంగేరీ శారదాపీఠం అధిపతిగా 36వ జగద్గురుగా శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఆదిశంకరుల లక్ష్య సాధన పరంపరను కొనసాగి స్తున్నారు. మోములో ప్రశాంతత, కన్నులలో కరుణ, పలుకులో నిరంతర ప్రసన్నతతో మహా స్వామి అనుగ్రహ భాషణం చేస్తుంటే అమృతపు జల్లు కురిసినట్లనిపిస్తుంది.
గుంటూరు జిల్లా, పల్నాడు
ప్రాంతంలో నాగులేరు నదీ తీరాన ఉన్న అలుగు మల్లిపాడు గ్రామంలో వైదికాచార కుటుంబంలో కృష్ణ యజుః శాఖీయులు, ఆపస్తంబ సూత్రులు, కుత్సస గోత్రులు తంగిరాల వేంకటేశ్వరావధాని, అనంత లక్ష్మమ్మ దంపతులకు 1951 ఏప్రిల్ 11న స్వామివారు
శ్రీ ఖరనామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు జన్మించారు.
వేదాధ్యయనం తండ్రి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో ప్రతాపగిరి శివరామశాస్త్రి వద్ద సంస్కృతాంధ్రాల్ని నేర్చుకున్నారు. చిన్నతనంలోనే సంస్కృతంలో మంచి ప్రావీణ్యం గడించి విద్వాంసుల మన్ననలు పొందారు. ఏకసంథాగ్రాహియై సంహితా, బ్రాహ్మణ, ఆరణ్యకంలను అభ్యసించి జిల్లా వేద ప్రవర్థక విద్వత్పరిషత్తు వారి వేద పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
1961 సంవత్సరంలో శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి దర్శన సమయంలో భారతీ తీర్థ సంస్కృత భాషను తిలకించి విశిష్ట పురస్కారం ఇచ్చారు. మహాస్వామి వారు ఉజ్జయినిలో, చాతుర్మాస్య వ్రతం జరుపుచుండగా అక్కడకు చేరిన సీతారామాంజనేయులు తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించారు. మహాస్వామి అను గ్రహంతో స్వామివారి శిష్యునిగా ఏడెనిమిది సంవత్సరాల్లో కృష్ణయజుర్వేదాలు, న్యాయ, వ్యాకరణ, పూర్వోత్తర, మీమాంసాది శాస్త్రాలలో పరిపూర్ణ పాండిత్యం గడించారు.
మేధాశక్తిని, సత్ప్రవర్తనను, శాస్త్ర పాండిత్యంలను పరీక్షించుచున్న పీఠాధిపతులు ఆయన మీద వాత్సల్యం కలిగి శ్రీ శారదాదేవి అనుమతితో శ్రీ శృంగేరి శంకర పీఠానికి ఉత్తరాధిపతిగా నియమించవలెనని ఆనంద నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి (1974 నవంబరు 11 న) నాడు నిర్ణయించారు. ఆనాడు వేలాది భక్తుల సమక్షంలో వారికి సన్యాసాశ్రమం అనుగ్రహించి “శ్రీ భారతీ తీర్థ” అనే ఆశ్రమ నామధేయం ఇచ్చారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు 1989 సెప్టెంబరు 21న బ్రాహ్మీ భావంను పొందారు. ఆ తరువాత భారతీ తీర్థ మహాస్వామి శుక్ల నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పంచమి గురువారం 1989 అక్టోబరు 19న 36 వ జగద్గురు శంకరాచార్యగా పీఠాధిపతులు అయినారు. నాటినుండి ధార్మిక కార్యానురక్తులైన భక్తుల అభ్యర్ధ నలను మన్నించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలలో విజయ యాత్ర జరిపి భక్తులను అనుగ్రహి స్తూ వచ్చారు.
ప్రస్తుతం భారతీ తీర్థులవారు పీఠాధిపతి కాగా, శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు ఉత్తరాధికా
దిగా ఉన్నారు.
ఆది శంకరుల ఆశయాలను సఫలం చేయడమే జీవిత పరమ లక్ష్యంగా, పరమాచార్య… శృంగేరిలో, చుట్టుపక్కల నివసించే వారికి వైద్యసౌకర్యాలు కల్పించాల నే సంకల్పంతో తమ గురువులు స్థాపించిన శారదా ధన్వంతరీ వైద్యశాల అన్ని విధాల అత్యాధునికమైన వైద్యశాల అయ్యేటట్లు చేశారు. శృంగేరికి వచ్చే భక్తులకు, యాత్రీకులందరికీ ప్రసాద రూపంగా ఉచిత భోజన వ్యవస్థను ఏర్పాటు చేయించారు. మఠాన్ని కేవలం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే కాకుండా అనేక సామాజిక కార్యక్ర మాలను కూడా వేదికగా తీర్చిదిద్దారు. ప్రకృతి విపత్తులు సంభవించి నప్పుడు ఆపన్నులను
ఆదుకోవటమే పరమావధిగా పాటుపడుతున్నారు. శృంగేరీ పీఠం దేశం నలుమూలలా శతాధిక శాఖలతో విస్తరించడం విశేషం.
బాలలు, యువత క్రమశిక్షణను
ఎప్పుడూ కోల్పోకూడదనీ, స్వధర్మాన్ని నిలబెట్టుకోవడం వల్లనే సనాతన ధర్మం పదికాలాల పాటు నిలబడుతుందంటారు. యువత ఎప్పుడూ అదుపు తప్పి ప్రవర్తించ కూడదనీ, బాల్యంలోనే బీజాలు పడాలంటారు.
పెద్దలు పిల్లలకు నైతిక, పౌరాణిక కథలను చెప్పడం, వారికి మన దేశ ఘనవారసత్వాన్ని, సాంస్కృతిక విలువలను బోధించడం వల్ల ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలు రక్షింప బడాలంటారు మహాస్వామి
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494