డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గురించి
ఈ తరం వారికి అంతగా తెలియక పోవచ్చు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. పరిపాలనలో, సాహిత్యంలో సాధికారిక సాధించి “అభినవ ఆంధ్ర భోజుడు”గా గుర్తింపు పొందారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, సాహితీవేత్త .బెజవాడ గోపాలరెడ్డి సౌమ్యుడు, వివాద రహితుడైన రాజకీయవేత్త. రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్య మంత్రిగా, ముఖ్య మంత్రిగా, నెహ్రూ మంత్రివర్గ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, గవర్నర్ గా
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన్ను ఎవరూ వేలెత్తి చూపిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదేమో.
11భాషలలో ప్రావీణ్యం సంపాదించిన అనన్య సామాన్యుడు. స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి (ఆగష్టు 7, 1907 – మార్చి 9, 1997). పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసారు. పరిపాలనా దక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా, రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసారు.
1907 ఆగస్టు 7న నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డి పాలెంలో ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. స్వంత ఊరిలోనే కళాశాల చదువు పూర్తి చేసి బందరు జాతీయ కళాశాలలో చేరారు. శాంతి నికేతన్ లో 1924-27 సం.లలో రవీంద్ర కవీంద్రుని శాంతినికేతన్ లో విద్యాభ్యాసం చేశారు. ఒక వైపు జాతీయోద్యమం మరోవైపు సాహిత్య పిపాస గోపాలరెడ్డి జీవనంలో పెనవేసు కొన్నాయి. 1927లో శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వ విద్యాలయంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసాడు. రవీంద్రుని గీతాంజలిని తెనిగించిన సాహితీవేత్త. రవీంద్రనాథ్ ఠాగూర్ ను గోపాలరెడ్డి గురుతుల్యులు, దైవ సమానులుగా భావించే వారు. తమ జీవితంలో ప్రతిమెట్టును విశ్వకవి ఆశీస్సులతోనే అధిరోహించానని
గర్వంగా చెప్పుకునేవారు.
గాంధీజీ ఉపన్యాసాలతో ఉత్తేజితులైన గోపాలరెడ్డి ప్రాథమిక విద్యను మధ్యలోనే ఆపి,
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. అనేక మార్లు నిర్బంధానికి గురై జైలుశిక్షను
అనుభవించారు. 1931లో అతి పిన్న వయసులో ఏఐసీసీ సభ్యులుగా, 1937లో రాజాజీ
నేతృత్వంలో ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ముప్పయి ఏళ్లు నిండక ముందే మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం నాడే బ్రహ్మ సమాజ పద్ధతిలో లక్ష్మీ కాంతమ్మను ఆయన వివాహం చేసుకున్నారు.
స్వాతంత్య్రానంతరం టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో 1953 అక్టోబర్ 1నుండి 54 నవంబర్ 15వరకు ఆర్థిక మంత్రిగా, 1955 మార్చి 28 నుండి 56 నవంబర్ 1వరకు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించాక నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా, హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన గోపాలరెడ్డి జాతీయ స్థాయిలో నెహ్రూ ఆహ్వానంపై,1962- 64లో జవహర్ లాల్ మంత్రి వర్గంలో సమాచార ప్రసార మంత్రిగా వ్యవహరించారు. విశాఖ పట్టణ కేంద్రం (1963 ఆగష్టు 4), కడప కేంద్రం (1963 జూన్ 17) ఆకాశవాణి కేంద్రాల ప్రారంభోత్సవాలు అయన చేతిమీదుగా జరిగాయి. పాలనలో నిర్మొహ మాటంగా వ్యవహరించే వారు. ప్రజోపయోగం కాని సిఫార్సులను తిరస్కరించే నేతగా ఆయన పేరెన్నిక గన్నారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్గా 01-05-1967 నుండి 30-06-1972 వరకు ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన గోపాలరెడ్డి, తదనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
బెంగాలీ, హిందీ, ఒరియా, గుజరాతీ మొదలైన ఆంగ్లంతో సహా పదకొండు భారతీయ భాషలలో ప్రావీణ్యం ఉన్న గోపాలరెడ్డి సాహితీ ప్రియులు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు భాషా సమితి అధ్యక్షులుగా ఎనలేని సేవలందించారు. రవీంద్రుని రచనలు అనేకం ఆంధ్రీకరించారు. గోపాలరెడ్డి కవిత్వంలో రంగు, రుచి, వాసన అన్నీ ఆయన అనుభవాల సారమే. జీవిత అవసాన దశలోనూ, పండిన వయసున సైతం నిద్రాణమైన జాతిని మేల్కొల్పడానికే అయన కలం పట్టారు. వెలుగులు పంచారు. తుది శ్వాస వదిలే వరకూ సాహితీ లోకంలో క్రియాశీలంగా ఉన్నారు. నాలుగు విశ్వ విద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. “సాహిత్య బంధువు”, “అభినవ భోజుడు” వంటి అనేక బిరుదులు ఆయనను వరించాయి.
1946 నుండి తెలుగు భాషా సమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1957 నుండి 82 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సం.లు పని చేశారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులు. 1963 నుండి 71వరకు ఎనిమిదేళ్ళు జ్ఞానపీఠ సారథ్య బాధ్యతల్ని నిర్వహించారు.
గోపాలరెడ్డి బహుభాషా కోవిదులు, సాహితీ ప్రియులు. గురువుగా భావిం చిన టాగోర్ రచనలను ఆంధ్రీకరించారు. వానచినుకులు, ఊర్వశి, నైవేద్యం ఆమె, గులాబీ రేకలు, హంసతూలిక వంటివి ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి. నాలుగు విశ్వ విద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్ సత్కరించాయి. అభినవ భోజుడనే బిరుదు పొందిన బెజవాడ గోపాలరెడ్డి 1997 మార్చి 9న తన 88వ ఏట కన్ను మూశారు.