వర్షాల వలన జిల్లాలో ఏ ఒక్క ప్రాణ నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, రాష్ట్ర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టెలీ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కురుస్తున్న వర్షాల వలన ప్రజలు అప్రమత్తంగా ఉండేవిధంగా గ్రామాలు, పట్టణాల్లో విస్తృత టామ్ టామ్ నిర్వహించాలని పంచాయతీ, మునిసిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. చెరువులు, కుంటలల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నీటి ప్రవాహం పెరిగినపుడు ఆయా ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రోడ్లు, వంతెనలు, తక్కువ ఎత్తు గల కల్వర్టు ప్రాంతాలలో వర్షం నీటి ప్రవాహాలను పరిశీలిస్తూ, అధిక నీటి ప్రవాహంలో ఎవరు కూడా వెళ్లకుండా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ సిబ్బంది పర్యవేక్షించాలని, ఎలాంటి పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్దంగా ఉండాలని అన్నారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి అందులో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా పంచాయతీ అధికారి ని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ పోల్స్, వైర్లు, లూజ్ వైర్లను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఇళ్లల్లో షార్ట్ సర్క్యూట్ జరుగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. వ్యవసాయ పనులకు వెళ్ళే వారికి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా తెలియపరచాలని అన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటికి రావద్దని తెలియపర చాలని అన్నారు. విద్యా సంస్థలు, వసతి గృహాలలోని విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. వర్షాల వలన దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, నిరంతర శానిటేషన్ నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబల కుండా పనులు చేపట్టాలని అన్నారు. ప్రతీ ఒక్కరు వేడి చేసి చల్లార్చిన నీటిని వడబోసి తాగాలని అన్నారు. వర్షాల వలన ఏమైనా సహకారం, సమాచారాన్ని తెలుసుకునేందుకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నేం. 08724 222557 ను సంప్రదించాలని తెలిపారు. ఎస్పీ ఏ.భాస్కర్ మాట్లాడుతూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తం ఉందని, గ్రామాలలోని లోతట్టు, నీటి పరివాహక ప్రాంతాలలో గస్తీ ఉంటుందని తెలిపారు. తక్షణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ లు నర్సింహ మూర్తి, రాజేశ్వర్, డీ ఆర్ డీ ఓ లక్ష్మి నారాయణ, డీ పీ ఓ దేవరాజ్, ఇరిగేషన్ ఎస్ఈ అశోక్, పంచాయతీ, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
