బంకిం చంద్ర చటోపాధ్యాయ పేరు తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. వందేమాతరం గీత రచయితగా ఆయన యావత్భారతానికి సుపరిచితులే. ఆయన రచయిత, కవి, పాత్రికేయుడు. ఆయన వందే మాతరం మొదట సంస్కృత స్తోత్రంలో భారత దేశాన్ని మాతృదేవతగా వ్యక్తీకరించారు. ఆ గీతం ద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కార్యకర్తలను ప్రేరేపించారు.
బంగ్లా భాషలోని అగ్ర రచయితల్లో ఒకరుగా భావించే బంకిం చంద్ర చటోపాధ్యాయ తన రచనలతో కేవలం బంగాలీ సమాజాన్నే కాదు, మొత్తం దేశాన్నే ప్రభావితం చేశారు. ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర చటర్జీ అగ్రగణ్యులలో ఒకరు..ఒక్క బెంగాలీ సాహిత్యాన్నే కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన పంతొమిదో శతాబ్ది ఉత్తరార్దంలో, ఇరవయ్యో పూర్వార్దంలో అంటే సుమారు ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేసారు. ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో, స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక మహా కవి రచించిన దేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి, ఉద్యమింప చేసిన సంఘటన, బంకించంద్రుడి విషయంలో లాగ మరొక దేశంలో, మరొక దేశ చరిత్రలో చోటు చేసు కోలేదనేది వాస్తవం.
బంకిం చంద్ర చేత ప్రచురితమైన ఆయన తొలి రచన బంగ్లా కాదని, ఆంగ్లమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాని పేరు రాజ్‌మోహన్స్ వైఫ్. ఆయన మొదటి బంగాలీ రచన దుర్గేష్ నందిని.
ఆయన ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారత దేశంలో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగిన 1857లోనే బీఏ ఉత్తీర్ణులు అయ్యారు. బెంగాల్‌లో మొదటగా బి.ఏ డిగ్రీ పొందిన వ్యక్తి ఈయనే కావడం విశేషం. 1869లో ఆయన లా డిగ్రీ అందుకున్నారు. స్వస్థాన వేష భాషల పట్ల గౌరవాభిమానాలు కలవాడు. ఇరవై ఏళ్ళు నిండకముందే ‘లలిత ఓ మానస్’ అనే కవితా సంపుటి రచించాడు. దుర్గేశ్ నందిని, కపాల కుండల, మృణాళిని, దేవీ చౌధురాణి మున్నగు 15 నవలలు ఆయన రాశారు.
బంకించంద్ర ఛటర్జీ (27 జూన్, 1838 – 8 ఏప్రిల్, 1894) రచన వందేమాతరం గీతాన్ని ఆనంద్ మఠ్ అనే నవల నుండి సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమర శంఖంగా పనిచేసింది. దేశమంతటా ప్రతిధ్వనించిన నినాద మయింది.
దేశాన్ని మాతృమూర్తిగా సంబో ధిస్తూ, దేశభక్తిని ప్రబోధిస్తూ, ‘వందేమాతరం’ గీత రచన చేసిన ర తర్వాత దానిని ‘ఆనంద్‌మఠ్’ నవలలో పొందు పరిచారు. ఈ నవల వివిధ భారతీయ భాషలలో నికి అనువదించ బడడం వలన వందేమాతరం గేయం దేశవ్యాప్తంగా ప్రచారాన్ని పొందింది. ఈ గేయాన్ని బహిరంగంగా గానం చేయటాన్ని నాటి ప్రభుత్వం నిషేధించింది. రవీంద్రుడు బాణీకట్టి నిషేధాజ్ఞలను ఉల్లంఘించి 1896 కాంగ్రెస్ సభలలో గానం చేశాడని చెపుతారు.
భారతదేశ స్వాతంత్య్ర ఆకాంక్ష ప్రజల్లో చైతన్య వంత మవుతున్నప్పుడు వందేమాతరం గీతం ఆ చైతన్యాన్ని వేగవంతం చేసింది. సమరోత్సాహాన్ని త్వరితం చేసింది. ఆయన సాహిత్య ప్రతిభ బహు ముఖమైనది. నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యాన రచనలో బంకించంద్ర చటర్జీ వంగ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించారు. నవలా రచనలో తక్కిన ఆధునిక భారతీయ సాహిత్యాలకు కూడా ఆయనే దారి చూపారు. అంతరాంతరాలలో ఆయనకు పూర్వ భారతీయ సంస్కృతి పట్ల, హిందూ మతాచార విశ్వాసాల పట్ల అభిమానం ఉండేదని సాహిత్యవేత్తల అభిప్రాయం.
మానవుడు చేరుకోగల ఉదాత్త శిఖరాలను బంకించంద్రుడి పాత్రలు అధిరోహిస్తాయి. అనూహ్యమైన, మానవాతీతమైన త్యాగాన్ని అయన పాత్రలు ప్రకటిస్తాయి. బంకించంద్రుడిలో మాతృ దేశాభిమానం, దేశ భక్తి అనంతం, అపూర్వం. ఆనంద మఠంలో ఆయన చిత్రించిన పాత్రలు ఎటువంటి త్యాగానికైన, సాహసానికైన ప్రతీకలుగా ఉన్నాయి. ఆయన చారిత్రిక పాత్రలను, పూర్వ చారిత్రిక వైభవ సన్నివేశాలను, సౌందర్య భావకతను, ఆలంబనం చేసుకొని రచనలు సాగించాడు అని కొందరు సాహితీవేత్తల భావన. ఆయన సృష్టించిన స్త్రీ పాత్రలు సాహసం, నిర్భీకత, ప్రణయోధ్వేగం, మానవానుభూతుల మధ్య అవి జీవిస్తాయి. అటువంటి స్త్రీ పాత్రలు పురుషులకు ఏమాత్రం తీసిపోరు అని వంగ సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, బంకించంద్ర ఛటో పాధ్యాయను ప్రసంసించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494