జనవరి 29…బాలాంత్రపు రజనీ కాంతరావు జయంతి
…………………………………..
బాలాంత్రపు రజనీ కాంతరావు
సుప్రసిద్ద వాగ్గేయకారునిగా, స్వరకర్తగా, గీత రచయితగా, విజయవాడలోని ఆకాశవాణి సంచాలకులుగా రేడియో శ్రోతలకు చిరపరిచితులు. అయన
తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరు. ఆయన రచించిన వాగ్గేయకార చరిత్ర 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. 1947 లో దేశం స్వాతంత్ర్యం పొందిన అర్థరాత్రి భారత ప్రధాని సుప్రసిద్ధ ప్రసంగం పూర్తవగానే రజనీ రచించి, స్వరపరచిన ‘మాదీ స్వతంత్రదేశం, మాదీ స్వతంత్ర జాతి’ టంగుటూరి సూర్యకుమారి గానం ఆసేతుహిమాచలం ప్రతిధ్వనించింది.
తొలి స్వాంత్ర్య దినోత్సవం రోజున స్యయంగా రచించి స్వరపర్చిన ”జయభేరి, వాయించు నగారా గీతం” మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి.
ఆ తర్వాత అర్థశతాబ్దం పైగా ఆయన తెలుగునాట లలిత సంగీతమనే ఒక నూతన గాన సంప్రదాయాన్ని సృష్టించి, పెంపొందించి, తానొక వాగ్గేయ కారుడిగా అవతరించడమే కాక, మరెందరో వాగ్గేయకారులకు మార్గదర్శకులుగా ఉన్నారు.
1920 జనవరి 29న పశ్చిమ గోదావరి జిల్లా నిడదోలులో రజనీకాంత రావు జన్మించారు. ఆయన తండ్రి బాలాంత్రపు వేంకటరావు ప్రసిద్ది చెందిన వేంకట పార్వతీశ కవుల్లో ఒకరు కావడం విశేషం. 1940-41 ప్రాంతంలో ఇరవయ్యేళ్ల నాడు ఆల్ ఇండియా రేడియో సంస్థలో ఉద్యోగంలో చేరగా, నాటి నుండి రిటైరయ్యే వరకూ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కేంద్రాల్లో పనిచేసి 1978లో రేడియో స్టేషన్ డైరెక్టరుగా రిటైరయ్యారు.
ఆకాశవాణిలో తొలి స్వరకర్తగా శ్రోతలను అలరించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చిన వారిలో రజనీకాంతరావు కీలకమైన వారు. అలాగే తొలితరం సంగీత దర్శకుల్లోనూ బాలాంత్రపు కూడా ఒకరు.
రజనీ” అని పిలుచుకునే బాలాంత్రపు రజనీ కాంతరావు ఒక వ్యక్తి కాదు, ఆయన ఏదో ఒక కళకే పరిమితం కాదు. ఆయన ఒక రచయిత, వాగ్గేయ కారుడు, రేడియో కళాకారుడు, సినీ పాటల – మాటల రచయిత, సంగీత దర్శకుడు. సంగీతంలో , సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో రజనీది ఒక ప్రత్యేక శైలి. సాధారణత్వం – సంక్లిష్టత, ప్రాచీనత – ఆధునికత, అచ్చ తెలుగు మాటలు – సంస్కృత భూయిష్ట సమాసాలు, అనేక పరస్పర విరుద్ద విషయాలు అయన కవిత్వంలో పదబంధాల్లో చోటు చేసుకున్నాయి.
ప్రయోగాలు – సంగీత రూపకాలు, యక్షగానాలు, నాటికలు, సంగీత శిక్షణ, ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు, ఈ మాసపు పాట, బావగారి కబుర్లు, ఇంకా ఎన్నో కార్యక్రమాల రూపకర్త ఆయన. వీటికి సంబంధించిన రచనలు చేయడం, బాణీలు సమకూర్చడం ఒక ఎత్తు, వాటిని గాయనీ గాయకులతో, వాద్య బృందంతో నిర్వహించడం మరొక ఎత్తు, రేడియో కోసం రచయిత గుడిపాటి వెంకటాచలంను అయన చేసిన ఇంటర్వ్యూ ఈ నాటికి కూడా అపురూపమైనదిగా పరిగణిస్తారు. ఆలిండియా రేడియో లలిత సంగీత విభాగాన్ని తన ప్రతిభతో సుసంపన్నం చేశారు. రజనీ రచించి, స్వరపరిచిన అనేక కృతులు తెలుగు వారి సాంస్కృతిక, సంగీత రంగాల్లో నిలిచి పోయాయి. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన సంగీతంలో లిరిసిజం రజనీ ప్రభావమేనన్నారు. లలిత సంగీతానికి, తెలుగు సాహిత్యానికి మధ్య సంబంధాన్ని నెలకొల్పి, దానికి రూపకల్పన చేసిన గొప్ప సంగీత కారులుగా ఘంటసాల వెంకటేశ్వరరావు, సాలూరి రాజేశ్వరరావులతో పాటు రజనీకాంతరావు తెలుగు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు.
ఠాగూర్ అకాడమీ రత్న – రవీంద్రనాథ్ ఠాగూర్ 150 జయంతి సందర్భంగా సంగీత నాటక అకాడమీ ప్రదానం, కళాప్రపూర్ణ – ఆంధ్ర విశ్వ విద్యాలయం 1981 లో బహుకరించిన గౌరవ డాక్టరేట్,
కళారత్న అవార్డు – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007 లో ఇచ్చిన పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం – 1961. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథానికిి ,
ప్రతిభా మూర్తి జీవితకాల సాఫల్య బహుమతి – అమెరికాలోని అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి పురస్కారం, నాథ సుధార్ణవ – మదరాసు మురళీరవళి ఆర్ట్ అకాడమీ, పుంభావ సరస్వతి,
నవీన వాగ్గేయకార, 2008లో తెలుగు విశ్వ విద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారాలు ఆయనకు లభించాయి.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, రజనీకాంతరావు 2018, ఏప్రిల్ 22 ఆదివారం రోజున మరణించాడు