Sunday, August 7, 2022
HomeLifestylespecial Editionఫిబ్రవరి 25.. బి.ఎన్.రెడ్డి వర్ధంతి

ఫిబ్రవరి 25.. బి.ఎన్.రెడ్డి వర్ధంతి

బి.నాగిరెడ్డి… తెలుగు చిత్ర పరిశ్రమ నుండి విడదీయ జాలని బంధం, అనుబంధం కలిగిన ప్రతిభాశాలి. ఆయన ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రచురణ కర్తగా తెలియకున్నా, “చందమామ” పేరు తీయగానే గుర్తొచ్చే పేరు చక్రపాణి తో పాటు రెడ్డి పేరే. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 – ఫిబ్రవరి 25, 2004) తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. బి.ఎన్.రెడ్డిగా సుపరిచితు లైన బొమ్మిరెడ్డి నాగిరెడ్డి డిసెంబర్ 2, 1912న కడప జిల్లా, కొండాపురం మండలంలోని పొట్టిపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట, రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన స్వస్థలం, సింహాద్రిపురం మండలంలోని వై.కొత్తపల్లిలో ఒక ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకో గలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనా విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.

యువకుడుగా ఆయన స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణ రంగ ప్రవేశానికి అదే దోహదం చేసింది. ఆంధ్రజ్యోతి అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించాడు.

అప్పుడే చక్రపాణి సాహచర్యం లభించింది. ఇద్దరూ కలిసి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకు రావాలను కున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందడానికి ఒక నెల ముందుగా “చందమామ” ఆవిర్భావం జరిగి దినదిన ప్రవర్ధమానం కాసాగింది. ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాణరంగప్రవేశం చేశాడు.

1974లో ఆయన దృష్టి వైద్యరంగం మీదికి మళ్ళింది. మద్రాసులో రెండు ఆసుపత్రులను నెలకొల్పాడు. కఠినశ్రమ, నిరాడంబరత, వినయం, నిర్దిష్ట పథకాలు రూపొందించడం, ఆయన సహజ గుణాలు. ఆయన పలికే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ భారతీయ తాత్విక దృష్టి, ముఖ్యంగా భగవద్గీత ప్రబోధించే కర్మసిద్ధాంత ప్రభావం స్పష్టంగా కనిపించేది.

మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన అన్న బి.ఎన్.రెడ్డి స్థాపించిన వాహినీ సంస్థలో భాగస్వామిగా చేరాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో (1941లో) వాళ్ళ సరుకు తీసుకువెళ్తున్న ఓడ బాంబు దాడిలో ధ్వంసం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఆ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించ లేక తన స్వగ్రామమైన ఓరంపాడు చేరాడు. ఆ తర్వాత వాహినీ వారి భక్తపోతనకు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు. సరిగ్గా అదే సమయంలో జెమినీ వారి బాలనాగమ్మ విడుదలైంది. జెమినీ వారు తమ చిత్రాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తారు. దానికి దీటుగా ఉండడానికి నాగిరెడ్డి మద్రాసులో హనుమంతుడి భారీ కటౌట్లు పెట్టించి వినూత్న రీతిలో ప్రచారం చేయించాడు. ఆ పబ్లిసిటీ చిత్ర విజయానికి బాగా తోడ్పడింది. దాంతో కె.వి.రెడ్డి ఆయనకు 500 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఆ మొత్తంతో నాగిరెడ్డి ఒక ఆస్టిన్ కారు కొన్నాడు.

తర్వాత 1950లో నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది. 1950లో వచ్చిన షావుకారుతో మొదలైన ప్రస్థానం 1962లో వచ్చిన గుండమ్మ కథ వరకు ఉచ్ఛస్థితిలో కొనసాగింది. అర్జునుడి పతాకంపై జెండాపై కపిరాజు (హనుమంతుడు) బొమ్మ ఉంటుంది. అర్జునుడి ఆ పతాకమే విజయావారి లోగోలోనూ ఉంటుంది. లోగోలో “క్రియా సిద్ధి స్సత్వే భవతి” అనే ఆర్యోక్తి ఉంటుంది.

విజయా ప్రొడక్షన్స్ వారి మొదటి సినిమా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన “షావుకారు” (1950). ఇది తెలుగులో మొట్టమొదటి అభ్యుదయ చిత్రంగా, తెలుగు సినిమాకు పునాదిరాయిగా కీర్తి అందుకొంది. ఈ సినిమా అనుకున్నంతగా విజయవంతం కాకపోవడంతో తర్వాతి ప్రయత్నంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో పాతాళభైరవి తీశారు.

1951లో వచ్చిన “పాతాళభైరవి”, సినిమాను జనం విరగబడి చూశారు. అంతకు ముందు ఎవరూ కనీ వినీ ఎరుగని ఘనవిజయం సాధించింది. దాంతో ఈ సినిమాను తర్వాత హిందీ, తమిళ భాషల్లో కూడా తీశారు. ఈ సినిమాలోని పాత్రలు తోట రాముడు, నేపాళ మాంత్రికుడు, అంజిగాడు, సదాజపుడు, ఆ పాత్రల కోసం పింగళి నాగేంద్రరావు రాసిన సంభాషణలతో సజీవంగా ప్రజల మనసుల్లో స్థిరనివాసం ఏర్పరచు కొన్నారు. ఈ సినిమాతో ఎస్వీ రంగారావు లోని గొప్పనటుడు బయట కొచ్చాడు. ప్రేక్షకాదరణలో ఈ సినిమాను అధిగమించ గలిగింది. మాయాబజార్ ఒక్కటే. విజయా వారి మూడవ సినిమా పెళ్ళిచేసిచూడు. ఇది భారీగా లాభాలనార్జించింది. దీంట్లో ఎన్.టి.రామారావు, జి.వరలక్ష్మి, సావిత్రి నటించారు.

తర్వాత తమ సంస్థలో దర్శకత్వశాఖలో సహాయ దర్శకుడుగా పనిచేస్తున్న కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1954లో చంద్రహారం తీశారు. ఇది గొప్ప చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. కానీ ప్రేక్షకుల ఆదరణకు నోచు కోలేదు.

ఆ తర్వాత వారు తీసిన సినిమాలే నేటికీ తెలుగులో వినోదాత్మక సాంఘిక చిత్రాల్లో మేటిగా కీర్తించబడే మిస్సమ్మ, దాని తర్వాత మాయాబజార్. నిస్సందేహంగా ఇది ప్రపంచస్థాయి చిత్రాలు. వీటి తర్వాత వచ్చిన రెండు విజయవంతమైన విజయావారి సినిమాలు అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మ కథ. గుండమ్మ కథతో ఒక శకం ముగిసినట్లైంది.

సి.ఐ.డి, జగదేకవీరుని కథ,
సత్య హరిశ్చంద్ర, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, గంగ-మంగ, శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ మొదలైనవి తీశారు. ఇక సినిమాలు తీయడం మానుకున్న నాగిరెడ్డి ఆ తర్వాత చాలా కాలానికి 1990లలో విజయా బ్యానర్ మీదే “విజయ” అనే సినిమా తీశాడు. దీంట్లో రజనీకాంత్ నటించాడు.

విజయాసంస్థ ఏర్పడిన నాటి నుంచి ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ వరకు వారి ప్రతి సినిమాలోనూ హీరో రామారావే. ఆస్థాన నటులుగా ఉన్నవాళ్ళు ఎస్వీ.రంగారావు, సూర్యకాంతం, రేలంగి, రమణారెడ్డి తదితరులు. ఆ కాలంలో నటులు ఇతర సంస్థలు తీసే సినిమాల్లో హీరో వేషం వేయడం కంటే విజయావారి సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషం వేయడమే మిన్నగా భావించేవారు. అక్కినేని నాగేశ్వరరావుకు విజయావారి సినిమాల్లో నటించే అవకాశం మొదట మిస్సమ్మ సినిమాతో వచ్చింది. మాయాబజార్ తర్వాత ఆయనకు గుండమ్మకథలో సహనాయకుడి పాత్ర వేసే అవకాశం వచ్చింది. అది ఆయనకు నూరవ సినిమా కూడా. అది గొప్ప అదృష్టంగా భావించిన ఆయన ఆ సినిమాకు పారితోషికం తీసుకోలేదు. కానీ నాగిరెడ్డి ఆయనకు ఇవ్వవలసిన మొత్తాన్ని ఒక విద్యాసంస్థకు విరాళంగా ఇచ్చారు.

ఎల్వీ ప్రసాద్ (షావుకారు, పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ) ; కె.వి.రెడ్డి (పాతాళభైరవి, మాయా బజార్, జగదేకవీరునికథ; కమలాకర కామేశ్వరరావు (చంద్రహారం), దర్శకులుగా ఉన్నారు.

విజయా సంస్థ తమిళంలో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్ళి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయా బజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్ళై (సురేష్ ప్రొడక్షన్స్ వారి తొలి సినిమా, రాముడు – భీముడు) ; హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ, సింహళీ భాషల్లో కూడా కొన్ని సిన్మాలు తీశారు. నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్ళై సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు.

చెన్నైలో తమ్ముడు బి.ఎన్. కొండారెడ్డి పేరు మెద బి.ఎన్.కె. ప్రెస్సు ప్రారంభించిన ప్రెస్సు నుంచే ఆయన ఆంధ్రజ్యోతి అనే సాంఘిక – రాజకీయ పత్రిక మొదలుకొని అనేక పత్రికలు ప్రచురించాడు. వాటిలో అగ్రగణ్యమైనది చందమామ. అంతేకాక జూనియర్ చందమామ: తొమ్మిదేళ్ల లోపు పిల్లల కోసం చందమామ ప్రత్యేకంగా ఆంగ్లంలో ప్రచురిస్తున్న మాస పత్రిక,
విజయ చిత్ర, (సినిమా వారపత్రిక),
వనిత, (మహిళల మాసపత్రిక)
జూనియర్ క్వెస్ట్, పిల్లలకోసం ఇంగ్లీషులో స్పూత్నిక్, పిల్లలకోసం ఇంగ్లీషులో ది హెరిటేజ్, మనోజ్ దాస్ సంపాదకత్వంలో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని గురించి తెలియజేసే ఆంగ్ల మాసపత్రికలను నిర్వచించారు.

ఆయన నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపకునిగా,
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా రెండు సార్లు,
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నాలుగుసార్లు,
1980-83 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ అధ్యక్షుడిగా పని చేశారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1987లో), రఘుపతి వెంకయ్య అవార్డు,తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు (1972లో) అందుకున్నారు. శ్రీవేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు.B N Reddy

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments