భారత స్వాతంత్ర్య ఉద్యమంకు సంబంధించి ‘గ్రాండ్ ఓల్డ్ లేడీ’ గా వన్నె కెక్కిన అరుణా అసఫ్ అలీ (జూలై 16, 1909 – జూలై 29, 1996) ప్రసిద్ధ భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర మరవని గొప్ప నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మెట్టమొదటి మేయర్. ఆమెకు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది.
అరుణా గంగూలీ, హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాళీ బ్రహ్మసమాజ కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం లాహోరు, నైనీతాల్ లలో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. దేశములోని అప్పటి పరిస్థితుల్లో అది ఒక మహిళకు గొప్ప ఘనతే. ఆమె కలకత్తాలోని గోఖలే స్మారక పాఠశాలలో బోధించింది. అరుణకు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయ మేర్పడింది. ఆ పరిచయం పెళ్ళికి దారి తీసింది. అరుణ తల్లితండ్రులు మతాలు వేరు (తల్లి హిందూ, తండ్రి ముస్లిం), వయోభేదము (ఇద్దరికీ వయసులో 20 ఏళ్ళకి పైగా తేడా) ఎక్కువన్న భావనతో ఆ పెళ్ళిని వ్యతిరేకించినా 1928లో అరుణ, అసఫ్ అలీని వివాహమాడింది.
అరుణ తండ్రి ఉపేంద్రనాథ్ గంగూలీ తూర్పు బెంగాల్లోని బరిసాల్ జిల్లాకు చెందినవాడు. సంయుక్త రాష్ట్రాల్లో (యునైటెడ్ ప్రావిన్స్)లో స్థిరపడ్డాడు. ఆయన ఒక రెస్టారెంటు యజమాని, సాహసికుడు. ఆమె తల్లి అంబాలికా దేవి, అనేక హృద్యమైన బ్రహ్మసమాజ ప్రార్థనాగీతాలు రచించిన ప్రముఖ బ్రహ్మజ నాయకుడు త్రైలోక్యనాథ్ సన్యాల్ కూతురు. ఉపేంద్రనాథ్ గంగూలీ యొక్క చిన్న తమ్ముడు ధీరేంద్రనాథ్ గంగూలీ తొలితరం భారతీయ సినిమా దర్శకుడు. మరో సోదరుడు నాగేంద్రనాథ్, ఒక మృత్తికా జీవశాస్త్రజ్ఞుడు, రవీంద్రనాథ్ టాగూర్ ఏకైక కుమార్తె మీరా దేవిని పెళ్ళి చేసుకున్నాడు. కానీ, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విడిపోయారు. అరుణ సోదరి, పూర్ణిమా బెనర్జీ భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు.
వివాహము తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రెస్ లో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహములో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నది. ఆమెను దేశదిమ్మరి అనే అభియోగము మోపి అరెస్టు చేశారు. రాజకీయ ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ – ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఆమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసేవరకు జైలును వదిలి వెళ్ళేది లేదని పట్టుబట్టారు. మహాత్మా గాంధీ కలుగ జేసుకోవటంతో కానీ వీరు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజా ఆందోళన వలన ఈమెను విడుదల చేశారు.
1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష నిర్వహించింది. ఆమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది. కానీ ఆమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఆమె రాజకీయాలలో పాల్గొనలేదు.
ఆమె 1996, జూలై 29న 87వ ఏట తనువు చాలించారు. 1987లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, 1996లో భారతరత్న (మరణానంతరం) ఆమెను వరించాయి.
