5.1 C
New York
Saturday, March 25, 2023
Homespecial Editionరాళ్ళకు జీవం పోసిన అసమాన శిల్పి గణపతి స్థపతి

రాళ్ళకు జీవం పోసిన అసమాన శిల్పి గణపతి స్థపతి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

శిలలపై శిల్పాలు చెక్కి నారు..
మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు…1962లో విడుదలైన మంచి మనసులు చిత్రంలో, ఆచార్య ఆత్రేయ సాహిత్యం అందించిందిన, పాటకి కె.వి.మహదేవన్ అద్భుతమైన సంగీతం అందించిన, అమర గాయకుడు ఘంటసాల పాడిన పాట గుర్తుకు రాగానే విజయనగర సామ్రాజ్య శిల్పకళకు నెలవైన హంపిలో చిత్రీకరించిన చిత్రాలు కళ్లముందు సజీవంగా సాక్షాత్కా రిస్తాయి. అలాగే అమర శిల్పి జక్కన్న కళ్ళముందు కదలడం అత్యంత సహజం. ఆధునిక కాలంలో పలు దేవాలయాలు, అపురూప నిర్మాణాలు చూసినపుడు శిల్ప కళ కు ప్రతిరూపం అయిన గణపతి స్థపతి వెంటనే స్ఫురణకు రాక మానరు. ఉలి చప్పుళ్ల మధ్య ప్రపంచంలో కళ్లు తెరిచి, ఉలి చప్పుళ్లకే జీవితాన్ని అంకితం చేసి, ఉలి చప్పుళ్ల మధ్యే కళ్లుమూసిన వందలాది దేవుళ్లకు వేలాది ఆలయాలను నిర్మించిన, శిల్పీకరించిన గణపతి స్థపతి అసమాన శిల్పి. దేశం గర్వించదగ్గ శిల్పకళా నిపుణులు.

గణపతి స్థపతి (26 ఏప్రిల్ 1931 – 7 ఏప్రిల్ 2017) ప్రముఖ స్థపతి, వాస్తు శిల్పి. పూర్తిపేరు సత్తయ్య ముత్తయ్య గణపతి.

శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో గణపతి స్థపతి పేరు తెర మీదకు వచ్చింది.
దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేత బంగారు గొలుసు, 60 తులాల డాలర్‌ను బహూకరించప బడి, సత్కరింప బడిన గొప్పతనం ఆయనది. తిరుమలలో వసంతరాయ మంటపాన్ని పునర్నిర్మించి, ఆస్థాన స్థపతి పదవిని దక్కించుకొన్న ప్రతిభ ఆయనది.

నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కోరిక మేరకు హైదరాబాద్‌లో హుస్సేన్‌ సాగర్‌లోని జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసిన ఘనత ఆయనది.

1931, ఏప్రిల్‌ 26న ముత్తు స్థపతి, గౌరీ అమ్మన్‌ లకు సంతానంగా జన్మించిన గణపతి, ఆరేళ్ల చిరుత ప్రాయంలోనే ఉలిని చేతబట్టి అలవోకగా చెక్కడం అభ్యాసం చేశారు. సాంప్రదాయ ఆలయ, వాస్తు, శిల్ప శాస్ర్తాలను, కుటుంబ పెద్దల దగ్గర 17 సంవత్సరాల పాటు శిక్షణ పొందారు. శిల్పాలు చెక్కడం లోనూ, ఆలయాలను నిర్మించటం లోనూ కొత్త ఒరవడిని సృష్టించి, ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్న గణపతి తమిళనాడు వదిలి, తెలుగునాట కాలు మోపారు. శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో పేరు తెచ్చుకొన్న గణపతి స్థపతి నైపుణ్యం గురించి, విన్న నాటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ, బద్రీనాధ్‌ దేవాలయ మహామండప పని అప్పగించారు. మండప భాగాలను హైదరాబాద్‌లో తీర్చిదిద్ది, బద్రీనాధ్‌కు తరలించి నిర్మించిన తీరుకు అచ్చెరువొందిన ఆమె, ఒక బంగారు గొలుసు, 60 తులాల డాలర్‌ను బహూకరించి సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పిలుపునందుకొని, తిరుమలలో వసంతరాయ మంటపాన్ని పునర్నిర్మించి, ఆస్థాన స్థపతి పదవిని దక్కించుకొన్నారు.

దేవాదాయ, ధర్మాదాయ శాఖలో స్థపతిగా చేరిన గణపతి స్థపతి, ఉమ్మడి రాష్ట్రంలో వందల, వేల ఆలయాలను నిర్మించి, ప్రధాన స్థపతిగా ఎదిగారు. తరతరాల ప్రాచీన వాస్తుశిల్ప సంప్రదాయం, నిరంతరం కొనసాగాలన్న తపనతో, తన ఆధ్వర్యంలో దేవాదాయ శాఖలో ఒక శిల్ప కళాశాలను స్థాపించి, కొన్ని వందల మంది శిల్పుల్ని తయారుచేసి, కొరతను తీర్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా, శిథిలాలయాలను పదిలం చేస్తూ, లేనిచోట కొత్త వాటిని కడుతూ తలమునకలై ఉన్న గణపతి స్థపతికి శ్రీశైలం జలాశయ నీటి ముంపు దేవాలయాల తరలింపు ఒక సవాలుగా మారింది. కర్నూలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని 102 గ్రామాల్లో ముంపునకు గురైన దాదాపు 108 దేవాలయాలను ఊడదీసి ఎగువన1978–89 మధ్య చారిత్రక కార్యక్రమం చేపట్టి, పునర్నిర్మించిన ఘనతను దక్కించుకొన్నారు.

వాస్తు, శిల్ప విద్యను అందుబాటు లోకి తేవడానికి పూనుకుని, తమిళ, సంస్కృత భాషల్లోనున్న వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాలను తెలుగులోకి అనువదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెదపాటి నాగేశ్వరరావు సహకారంతో రూపధ్యాన రత్నావళి, కాశ్యప శిల్ప శాస్ర్తాలను వెలువరించారు. నిరంతర అధ్యయనంతో పాటు, పరిశోధనలపై దృష్టి సారించిన గణపతి స్థపతి, తెలుగు విశ్వవిద్యాలయం, సచివాలయం భవనాల్లో ఆధునికతకు, సాంప్రదాయ వాస్తును జోడించి, కొత్త ఒరవడిని సృష్టించారు.

ఒకసారి అమెరికా వెళ్లిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు, న్యూయార్క్‌లో గణపతి స్థపతి తారస పడిన సందర్భంలో, లిబర్టీ స్టాట్యూ లాంటి పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పే ప్రయత్నం చేయాలి అన్న ఎన్టీఆర్ కోరికను సాకారం చేసి, హుస్సేన్‌ సాగర్‌లోని జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం కోసం యాదగిరి గుట్టకు సమీపంలోని రాయగిరి నుంచి 100 అడుగుల రాయిని, 100 చక్రాల వాహనంపై హైదరాబాద్‌కు తరలించి, గణపతి స్థపతి ప్రపంచ ఖ్యాతిని సంపాదించారు. హైదరాబాద్‌లో బిర్లా మందిర్‌ రూప శిల్పి ఆయనే. సింహాచలం, కాళేశ్వరం, వేములవాడ లాంటి అనేక ప్రాంతాల్లో పలు ఆలయాలకు కొత్త సొగసులు అద్దారు. శ్రీశైలం, మహానంది ఆలయ గోపురాలను చోళ, విజయనగర శిల్పకళారీతుల కలయికతో నిర్మింప చేశారు.

విదేశాల్లో సైతం ఆలయాలను నిర్మించి, తెలుగు శిల్పుల కీర్తిని దశదిశలా విస్తరింప చేయటలో భాగంగా, పిట్స్‌బర్గ్‌లోని బాలాజీ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అమెరికా తిరుపతిగా ప్రసిద్ధి చెంది, రోజూ వేల మంది భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
గణపతి స్థపతి శిల్పకళా చాతుర్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, 1990లో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ ద్వారా గౌరవించింది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా, శిల్పకళానిధి, కళైమామణి, శిల్పకళా రత్న వంటి బిరుదులెన్నో వరించాయి.

వందలాది దేవుళ్లకు వేలాది ఆలయాలను నిర్మించిన గణపతి స్థపతి కంచి కామకోటి పీఠ పరంపరలోని 68వ పీఠాపతులైన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామికి పరమ భక్తులు. శంకరాచార్య ఆకాంక్ష మేరకు, కంచి సమీపంలో నున్న ఒరుక్కై గ్రామంలో తన అద్భుత శిల్పకల్పనా చాతుర్యంతో మలచిన 100 స్తంభాలతో నిర్మించిన మణి మంటప నిర్మాణం, తన చిరకాల వాంఛగా తరచూ పేర్కొనేవారు గణపతి స్థపతి. శంకరాచార్య ప్రమాచార్య శుభాశీస్సులతో అక్కడే శంకర శిల్పశాలను స్థాపించి, వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తూ గణపతి స్థపతి, ఏప్రిల్‌ 7న, ఈ పార్థివ దేహాన్ని వదిలి వెళ్లారు. ఆ మహాశిల్పి ఈ నేలను వదిలినా, ఆయన సృష్టించిన అపురూప, అపూర్వ శిల్పాలు, నిర్మించిన ఆలయాలు, ఆయన శిల్పకళా ప్రతిబింబాలై కళ్లముందు సజీవంగా కదలాడుతూనే ఉన్నాయి.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments