5.1 C
New York
Tuesday, March 21, 2023
Homespecial Editionఆంధ్రా ఫ్రాయిడ్ అన్నపురెడ్డి

ఆంధ్రా ఫ్రాయిడ్ అన్నపురెడ్డి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

కష్టాలు, కన్నీళ్ల మధ్య గడిపిన బాల్యం ఆయనది. కుల వివక్షతో కలిచి వేయబడ్డ సున్నిత మనసు ఆయనది. తండ్రి నిర్లక్ష్యానికి గురై, బడికెళ్లాల్సిన వయసులో గొడ్లను కాయడానికే పరిమితమై, ఒక బాలుని సగం విరిగిన పలక ముక్క పొంది, పాఠశాలలో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత కాలంలో విద్యా ధికుడై మనస్తతత్వ శాస్త్రంపై, బౌద్ధధమ్మంపై ఎన్నో ప్రామాణికమైన గ్రంథాలు విరచించిన ప్రతిభా శాలిగా నిలిచారు. ఎంతో మందికి విజ్ఞానపు వెలుగులు అందించారు. పదహారేళ్ల సుదీర్ఘకాలం మిసిమి పత్రికకు సంపాదకునిగా పని చేశారు. ఒక మనో విజ్ఞాన శాస్త్ర వేత్తగా, సామాజిక శాస్త్రవేత్తగా, విశ్లేషకునిగా, బౌద్ధ తత్వవేత్తగా, సాహిత్య విమర్శకునిగా, భాషా శాస్త్రవేత్తగా, అనువాదకునిగా, సంపాదకునిగా… లోతైన అంతర దృష్టినీ, పాండిత్యాన్నీ కలిగిన వ్యక్తిగా పేరెన్నిక గన్నారు. ఆయనే “ఆంధ్రా కార్ల్ మార్క్స్” గా గుర్తింపును పొందిన అన్నపురెడ్డి.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తూములూరు గ్రామంలో అన్నపరెడ్డి తన అమ్మమ్మ గారింట్లో 1933, ఫిబ్రవరి 22న పుట్టారు. తల్లి గోవిందమ్మ, తండ్రి అప్పిరెడ్డి. అన్నపరెడ్డి ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే అతని తల్లిని ఆత్మ కూరులో ఉన్న తన ఇంటి నుంచి తండ్రి వెళ్లగొట్టాడు. దాంతో ఆమె నిస్సహాయస్థితిలో అన్నపరెడ్డిని చంక నెత్తుకుని పుట్టిల్లు చేరి, తల్లీ తండ్రీ తానై, అన్నపరెడ్డిని పెంచింది.

నిరుపేద కుటుంబం రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఎన్నోరకాల ఈసడింపుల మధ్య బాల్యం సాగింది. నాలుగైదేళ్ల వయసులోనే గొడ్లకాపరిగా జీవితం మొదలైంది. నెలకు రెండు రూపాయలొచ్చే గొడ్లకాపరి పనిలో అన్నపరెడ్డి ఉండి పోవడంతో అతని చదువు గురించి ఎవరూ పట్టించు కోలేదు.

రోజుకు ఒక అణా (రూపాయిలో 16వ వంతు)కి కూలీకి వెళ్లే మా అమ్మ, ఒక కాణీ (రూపాయిలో 64వ వంతు) పెట్టి పలక కాని బడికి పంపలేక పోయింది. ఆమె నిరక్షరి కావటంతో నన్ను బడికి పంపాలనే ఆలోచనా ఆమెకు పొడమలేదు. పక్కింటి పిల్లవాని పెద్ద పలక పగిలి రెండు చెక్కలైతే… ఒక చెక్క నాకిచ్చి వాడు నన్నా బడికి వాడు నన్ను ఆ బడికి తీకు పోయిన సంఘటన జీవితంలో మరిచి పోలేనేదని ఒక సందర్భంలో పేర్కొన్నారు. సమాజంలో కుల, మతాలు అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే చిన్ననాడే అన్నపరెడ్డికి కుల వివక్ష ఎదురైంది.

ఎప్పుడూఎవరి జీవితమూ పూల బాట కాదు. అలాగని ముళ్లబాటా కాదు అని ఆయన నమ్మేవారు. బాల్యం నుంచీ ఎదురైన ఎన్నో జీవితానుభవాలు అన్నపరెడ్డిలో ఆలోచనా వికాసానికి పునాదులు వేశాయి. అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ప్రముఖ రచయిత, తత్త్వవేత్త, అధ్యాపకుడు, సంపాదకుడు, బౌద్ధమతావలంబి.
ఫ్రాయిడ్‌ను తెలుగు చేసిన వాడిగా, ‘మిసిమి’ సంపాదకుడిగా, బౌద్ధ రచనల మీద విశేష కృషి చేసి తన పేరునే అన్నపరెడ్డి బుద్ధ ఘోషు డుగా మార్చుకున్న ‘కళారత్న’, ‘బౌద్ధరత్న’, ‘సద్ధర్మ మహోపా ధ్యాయ’ అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి.

అయన 1933, ఫిబ్రవరి 22వ తేదీ మహాశివరాత్రి నాడు, గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం తూము లూరు గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం కొల్లిపర హైస్కూల్లో, గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్ర విశ్వ విద్యాలయం వాల్తేరులలో గడచింది. తెనాలిలోని వి.యస్. ఆర్. కళాశాల, వి.యస్.ఆర్ & యన్.వి.ఆర్. కళాశాల, గుంటూరు లోని జె.కె.సీ. కళాశాలలో 1957 నుండి 1991 వరకు అధ్యాపకుడి గా సామాజిక శాస్త్రాలను బోధిం చారు. ఆ తరువాత వడ్లమూడి లోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో కొంతకాలం పనిచేశారు. ‘మిసిమి’ మాసపత్రిక సంపాదకునిగా 1996 -2011ల మధ్య వ్యవహరించారు.

అన్నపరెడ్డి తాము అధ్యయనం చేసిన అంశాలపై విస్తృతంగా రచనలు చేశారు. మొత్తం 83 గ్రంథాలు, 16 వేల పుటల్లో అవి పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పలు పుస్తకాలు పదుల సంఖ్యలో పునర్ముద్రణలు పొందాయి. పలు విశ్వ విద్యాల యాల్లో పాఠ్య పుస్తకాలుగా, రిఫరెన్స్‌ గ్రంథాలుగా ఉన్నాయి. బౌద్ధాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన ఆయన తన జీవితాచరణని బౌద్ధానికే పూర్తిగా అంకితం చేశారు. 1988లో రాసిన ‘మానవీయ బుద్ధ’ పుస్తకం మొదలుకుని, కొన్ని నెలల కిందట వెలువడిన ‘అంగుత్తర నికాయం’ సంపుటాల వరకూ ఆయన రాసినన్ని బౌద్ధ గ్రంథాలు దేశంలోనే ఇంకే భాషలో కూడా ఎవరూ రాయలేక పోవడం విశేషం. అన్నపరెడ్డి తన స్వీయ చరిత్రను ‘అనాత్మవాది ఆత్మకథ (అలాత చక్ర)’ పేరుతో రాశారు.

శాంతియుత సమాజానికి బుద్ధుని బోధనలే శరణ్యమని ఆయన చెప్పే వారు. బౌద్ధమతం అవలంబించిన తర్వాత అయన “అన్నపరెడ్డి బుద్ధఘోషుడు” అనే పేరుతో కూడా రచనలు చేశారు. ఇతనికి “బుద్ధరత్న”, “సద్ధర్మ మహోపా ధ్యాయ” అనే బిరుదులు ఉన్నా యి. మొత్తం 75కు పైగా రచనలు చేశారు.

విశాఖలో డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తార్కిక ఆలోచన లను పంచుకున్నారు. చదువు పూర్తయ్యాక తెనాలిలోని వియస్ఆర్‌ కాలేజీలో తర్కశాస్త్ర అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు. అక్కడే ప్రముఖ రచయిత, విద్యావేత్త జివి కృష్ణారావుతో పరిచయం, స్నేహం అతనికి పెంపొందాయి. తనలోని సృజనాత్మకతకు ఆయనే ప్రేరణ అంటారు అన్నపరెడ్డి.

బాల్య, కౌమారదశల్లో ఎదురైన సమాజ అసమానతలు, అవమానాలు అన్నపరెడ్డిని హేతువాదం వైపు నడిపించాయి. త్రిపురనేని రామస్వామి రాసిన శంభూక వధ, యథార్థ రామాయ ణం, యథార్థ ప్రహ్లాద చరిత్ర, సూత పురాణం వంటివాటిని అన్నపరెడ్డి అధ్యయనం చేశారు. ఊరి రచ్చబండ మీద చెప్పే పురాణ ప్రసంగాలకు అడ్డుతగిలి, హేతు దృష్టితో ప్రశ్నలు వేసేవారు. అలా హేతు వాదినయ్యాను, నాస్తికుడిని అయ్యాను. ఈ రెండింటితో పాటు తరవాత బుద్ధుడు వచ్చి, నన్ను ఆనుభవిక వాదినీ, మానవతా వాదినీ చేసాడని ఆయన పేర్కొన్నారు..

చదువుకునే రోజుల్లోనే సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ సిద్ధాంతాలపై నిశితంగా అధ్యయనం చేశారు. మనో విజ్ఞాన శాస్త్రాన్ని అవపోశన పట్టారు. కాలేజీ మాగజైన్‌కు ‘ఫ్రాయిడిన్‌ థియరీ ఆఫ్‌ సెక్సువా లిటీ’ అనే వ్యాసాన్ని రాశారు. ఇది పలువురి ప్రశంసలందు కున్నారు. సహాధ్యా యిలు ఆయన్ని ‘ఆంధ్రా ఫ్రాయిడ్‌’ అని పిలవడం ప్రారంభించారు. అయితే తన అధ్యయనాన్ని అన్నపరెడ్డి అక్కడితో ఆపలేదు. ఆ ప్రేరణతోనే ‘స్వప్న సందేశం’ అనే పుస్తకాన్ని రాశారు. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ కలలకు అర్థం చెప్పడం ఎలా? నాగరికత దాని అపశృ తులు, మనసు-మర్మం, మనసు గతినే మార్చిన ఫ్రాయిడ్‌..’ తదితర పుస్తకాలను రాశారు.
“నా ఉద్దేశంలో చాలామంది రచయితలు – అందరూ అని అనను – గానుగెద్దు పోకడలనే పోతున్నారు రోకంటి పాట పాడుతున్నారు. తమ స్వతంత్ర విచార ధారను సాగించలేక పోతు న్నారు. మౌలిక ప్రశ్నలను లేవనెత్త సాహసించలేక పోతున్నారు. బ్రతుకు వెనుక దాగివున్న రహస్య సూత్రం ఏమిటి?… ఏ రచయితా ఆలోచించడం లేదు”…అని అభిప్రాయాన్ని పదేపదే వ్యక్తం చేస్తుండే వారు. అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి(84) 2021 మార్చి 9న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments