దక్షిణా పథాన భజన సాంప్రదాయానికి, పద కవితా శైలికి ఆద్యుడు, ఆరాధ్యుడు, తెలుగు సాహితీ చరిత్రలో ప్రథమ వాగ్గేయ కారుడు అన్నమాచార్యుడు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనా చార్యులకు మార్గ దర్శకుడైన, భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం భావ లాలిత్యంతో నిండిఉన్న అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. తెలుగు సంస్కృతితో విడదీయరాని బంధాన్ని ఏర్పరచు కున్నాయి. ఆధ్యాత్మిక పదాలు, శృంగార గీతాలు, తుమ్మెదల, గొబ్బిళ్ళ పాటలు, శతకాలు, అన్నమయ్య విరచిత, 32 వేల ఆశుకవితా రూపాలలో చాలా వరకు లభ్యాలై, ప్రజల నోళ్లలో నానుతునే ఉన్నాయి. కన్నడ వాగ్గేయకారుడు “పురందరదాసు” అన్నమయ్యను, ఏడుకొండల స్వామి అవతారంగా ప్రశంసిస్తే, మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని, శ్రీ వైష్ణవ సాంప్రదాయ ఆచరణుల నమ్మకం. అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న రాసిన “అన్నమయ్య చరితం” ద్విపద కావ్యం ద్వారా ఆయన సమాచారం లభిస్తున్నది. క్రీస్తుశకం పదవ శతాబ్దిలో, నేటి కర్నూలు జిల్లాలోని ప్రాంతాలను నందుడనే రాజు పాలించగా, ఆ రాజు కాశీయాత్ర సమయాన, కాశీలో కొందరు వైదిక బ్రాహ్మణులు పరిచయం కాగా, కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఆంధ్ర దేశానికి తరలి వచ్చి స్థిరపడగా, తీసుకొని రాబడిన వారు వైదీకులు అయినందున, నంద వైదీకులుగా ప్రచారం పొందినట్లు, అన్నమయ్య అదే కోవకు చెందిన వారై, “తాళ్ళపాక గ్రామం” ఇంటి పేరుగా కలిగి ఉన్నారని ప్రచారం ఉంది. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో శుభ లగ్నాన, మూడు గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా, నారాయణ సూరి – లక్కమాంబలకు “నందకం” అంశమున సర్వధారి సంవత్సర వైశాఖ శుక్ల పౌర్ణమి నాడు 1408 మే 9న అన్నమయ్య ఉదయించారు. నారాయణ మూర్తి పరబ్రహ్మ వాచకంగా “అన్నమయ్య” అని నామకరణం గావించారు. “అన్నమయ్య”, “అన్నమాచార్యులు”, “అన్నయ గురు”, “అన్నయ్య”, “కోనేటి అన్నమయ్యం గారు” అనే నామాంతరం తాళ్లపాక సాహిత్యం శాసనాలలో చోటు చేసుకున్నాయి. శిశు ప్రాయం నుండి అన్నమయ్య వెంకట నాథుని మీద ధ్యాస ఉంచేవారు. ఉగ్గు పాలు తాగడం లో, నిద్రకు ఉపక్రమించడంలో, లక్కమాంబ గీతాలు, జోల పాటలు, నారాయణ మూర్తి కావ్య పఠనాలు, అన్నమయ్యపై శైశవ దశలోనే ప్రభావం చూపాయి. ఏకసంతాగ్రాహియై, ఉపనయన సంస్కారం అనంతరం చిరు ప్రాయం నుండే, కలియుగ దైవంపై వింత వింత సంకీర్తనలు నోటి నుండి జాలు వారగా, పదహారేళ్ల ప్రాయం నుండి రోజు కొక్క సంకీర్తనం తప్పక రాయడం మానలేదు. చెరువుగట్టు మీద, చెట్టుపై పిట్టలు, చిరుగాలి సవ్వడులలో, అలల కదలికలలో, మమేకమై సాగిన ఆయన జానపద నేపథ్యంలో, అన్నమయ్య పాటన్నా, మాటన్నా, గ్రామీణులకు సంబరాన్ని కలిగించేవి. ఉమ్మడి కుటుంబంలో, పనులు చేయడం నచ్చక, లౌకిక బంధాలతో, తమకు ఇక పనిలేదని తెలుసుకొని, వేదనలో విరక్తి కలిగి, భక్తి రగిలి, భక్తి రసావేశ భరితులై, తంబుర చేతబూని, తిరుమల దారి పట్టా డు. సనక సనందాదులే భక్తులై తోడురాగా తిరుపతి చేరారు. సకలాభరణ శోభితుడు, భూషితుడు అయిన శ్రీ మూర్తిని దర్శించుకున్నారు. తిరుమలలో “ఘన విష్ణువు” అనే మునితో శంఖ చక్రాదికములతో, పంచ సంస్కారాలను నిర్వహింప చేసుకున్నారు. వైష్ణవ తత్వాలను, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను, అధ్యయనం చేస్తూ, వెంకన్నను కీర్తిస్తూ, తిరుమలలోనే జీవితం గడిపారు. గురువు ఆనతిపై, తాళ్ళపాక వెళ్లి తిమ్మక్క, అక్కమ్మలను వివాహం చేసుకున్నా, వారితో తిరిగి తిరుమల దర్శనం చేసుకున్నారు. 95 ఏళ్ళ పూర్ణ వయస్కుడై, అన్నమయ్య దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి 1503 ఫిబ్రవరి 23న పరమపదించారు.
అన్నమయ్య సంకీర్తనా సేవ, సంగీత సాహిత్య భక్తి పరిపుష్టం. తెలుగు లోనే రాసినా పాడినా ఆయన సాహిత్యం సంస్కృత పద భూయిష్టం. అన్నమయ్య యోగ వైరాగ్య శృంగారం సరణి మొత్తం 32 వేల సంకీర్తనలు రచించారని అనుకొంటున్నా, ఆయన వారసులు రాగి రేకులపై వ్రాయించి, తిరుమలలో సంకీర్తనా భాండాగారం నందు పొందు పరిచినవి, ప్రస్తుతం 12 వేలు మాత్రమే. మంజరి ద్విపదలో “శృంగార మంజరి” అనే కావ్యాన్ని రచించారు. ఆయన రచనలని చెప్పబడే 12 శతకాలలో “వెంకటేశ్వర శతకము” మాత్రమే లభిస్తున్నది. “అదివో అల్లదివో, క్షీరాబ్ధి కన్యకకు, జో అచ్యుతానంద, ఉదయాద్రి తెలిపాయే, కొండలలో నెలకొన్న, మూసిన ముత్యాల, నిగమ నిగమాంత, లాంటి అన్నమయ్య కీర్తనలు, తెలుగు సంగీతాభిమానులకు, నిత్యం వీనులకు విందు చేస్తూనే ఉన్నాయి.
“సంకీర్తనాచార్యుడు”, “పదకవితా పితామహుడు”, “పంచమాగమ సార్వభౌముడు”, “ద్రావిడ ఆగమ సార్వభౌముడు”అని బిరుదాంకితుడు అయిన, అన్నమయ్య వాసిలో, రాశిలో, రచనలు ఆంధ్ర వాఙ్మయంలో సరిరానివి అనడంలో అతిశయోక్తి లేదు.
పద కవితా పితామహుడు అన్నమాచార్యుడు
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES