638 హిందీ సినిమాలకు 3500లకు పైగా పాటలను వ్రాసిన రికార్డు ఆయనకే సొంతం. ఉత్తమ గేయ రచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారానికై 40 సార్లు ప్రతిపాదింప బడి, 4 పర్యాయాలు ఉత్తమ గేయ రచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం దక్కించుకున్న ఘనత ఆయనదే. అయిదు దశాబ్దాల నాడు నాటి సినీ ప్రేక్షకులకు, పాటల శ్రోతలకు సుపరి చితమైన పేరు ఆయనది. నాడు పేరుమోసిన ఎందరో సంగీత దర్శకులు ఆయన రచనలకు బాణీలు సమకూర్చగా, ఎందరో సినీ నేపథ్య గాయకులు పాటలు పాడారు. ఆయనే అనేకానేక జనరంజకమైన పాటలను రచించి జన హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ద హిందీ సినీ కవి ఆనంద్ బక్షి.
ఆనంద్ బక్షి (బక్షి ఆనంద్ ప్రకాష్ వైద్) ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న రావల్పిండిలో 1930, జూలై 21న జన్మించారు. ఇతని పూర్వీకులు రావల్పిండి సమీపంలో ఉన్న కుర్రీ గ్రామానికి చెందిన మోహ్యాల్ బ్రాహ్మణులు. వారి మూలాలు కాశ్మీర్‌లో ఉన్నాయి. ఇతడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తల్లి సుమిత్ర మరణించింది. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పూనే, మీరట్‌ల గుండా ప్రయాణించి ఢిల్లీకి వలస వచ్చి, అక్కడ స్థిరపడింది.
అయన ప్రాథమిక విద్య అనంతరం భారతీయ సైన్యంలో చేరారు. చిన్నతనం నుండే కవిత్వం వ్రాయాలని ఉబలాటం ఉండేది. అయితే సైన్యంలో సమయం దొరకక ఎక్కువగా వ్రాయడానికి కుదరలేదు. సమయం చిక్కినప్పుడల్లా కవిత్వం వ్రాసేవారు. తన పాటలను సైన్యంలో స్థానిక కార్యక్రమాలలో ఉపయోగించే వారు. సైన్యంలో ఎక్కువ కాలం పనిచేశారు.
బక్షీ హిందీ సినిమాలలో రచయితగా, గాయకుడిగా పేరు తెచ్చు కోవాలని రంగ ప్రవేశం చేసినా, చివరకు గేయ రచయితగానే రాణించారు. బ్రిజ్‌మోహన్ సినిమా భలా ఆద్మీ (1958) చిత్రంతో ఆయనకు గీత రచయితగా గుర్తింపు వచ్చింది. 1956 నుండి 1962 వరకు కొన్ని చిత్రాలకు పని.చేసినా 1962లో మెహెందీ లగీ మేరీ హాత్తో ఆయన విజయ పరంపర ప్రారంభ మయ్యింది. ఆయన మొత్తం 638 హిందీ సినిమాలకు 3500లకు పైగా పాటలను వ్రాశారు. భక్షీ పాటలకు లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్.డి.బర్మన్, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, ఎస్.డి.బర్మన్, అను మాలిక్, రాజేష్ రోషన్, ఆనంద్ మి లింద్ మొదలైన సంగీత దర్శకులు బాణీలు కూర్చగా, షంషాద్ బేగం, ఇలా అరుణ్, ఖుర్షీద్ బావ్రా, అమీర్ బాయి కర్ణాటకి, సుధా మల్హోత్రా, కిశోర్ కుమార్, శైలేంద్ర సింగ్, కుమార్ సానూ, కవితా కృష్ణమూర్తి వంటి అనేక మంది గాయనీ గాయకులు పాటలను గానం చేశారు.
భక్షీ వ్రాసిన పాటలలో 1972లో వచ్చిన హరేరామ హరేకృష్ణ చిత్రంలోని దమ్ మారో దమ్ పాట ఇతడిని ప్రతిభావంతుడైన రచయితగా నిలబెట్టింది. ఆయన గీతరచన చేసిన చిత్రాలలో బాబీ, అమర్ ప్రేమ్, ఆరాధన, జీనే కీ రాహ్, మేరా గావ్ మేరా దేశ్, ఆయే దిన్ బహార్ కే, ఆయా సావన్ ఝూమ్‌కే, సీతా ఔర్ గీతా, షోలే, ధరమ్ వీర్, నగీనా, లమ్హే, హమ్, మొహ్రా, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, పర్‌దేశ్, దుష్మన్, తాళ్, మొహబ్బతే, గదర్: ఏక్ ప్రేమ్ కథ, యాదే వంటి అనేక విజయ వంతమైన చిత్రాలున్నాయి.
ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 2002, మార్చి 30వ తేదీన తన 71వ యేట మరణించారు. ఆయన రచించిన పాటలున్న చివరి సినిమా మెహబూబా మరణానంతరం విడుదలయ్యింది.
