Thursday, June 30, 2022
HomeLifestylespecial Editionఅక్షయ ఫలాన్ని ఇచ్చేది తృతీయ

అక్షయ ఫలాన్ని ఇచ్చేది తృతీయ

హిందువుల పండుగలలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నది అక్షయ తృతీయ(Akshaya Tritiya). వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసే దానాలు దేవతల, పితృదేవతల గురించి చేసే పూజలు, అక్షయ ఫలాన్ని ఇస్తాయని, ప్రాచీన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. తీర్థ స్నానం, తిలలతో పితృ తర్పణం, ఘట దానం, దైవ పూజలు, ఈ దినాన దానం చేయడం అనాదిగా ఆచరణలో ఉంది. నదీస్నానం దానం, తపం, శ్రాద్ధం, హోమం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. అక్షయ తృతీయనాడు పెరుగు అన్నం, విసనకర్రలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉద కుంభం, మున్నగు వాటిని దానం చేయాలని చెప్పబడింది. ఎండలు మెండుగా ఉండే వైశాఖ మాసంలో కుండలలో, జాగ్రత్తగా పెట్టిన నీటిని త్రాగితే, దాహ శాంతి కరంగా ఉండగలదని, మతపెద్దల నిర్ణయానుసారం, నీటితో నిండిన పాత్రలను, కుండలను ( ఉదకుంభ) దానం చేయడం ఆచారంగా మారింది. ఈ రోజున, విష్ణుపూజ లక్ష్మీ నారాయణ రూపంలో చేయాలని, పురుషార్థ చింతామణి యందు పేర్కొనబడింది. గౌరీ పూజ గౌరీ వ్రతం పేరున పూజ చేయడం కొన్ని ప్రాంతాలలో, ఆలయాలలో ఆచారంగా ఉంది. ఆహవనీయ, గార్హపత్య, దక్షిణములు అనబడే త్రేతాగ్నులు పూజింపబడిన కాల మగు 196 వేల మానవ సంవత్సరాల క్రితం త్రేతా యుగానికి, ఇది తొలి రోజుగా, యుగాదిగా భావించబడుతున్నది. వైశాఖ శుక్లపక్ష తదియ బలరామ జయంతిగా పంచాంగాలు పేర్కొంటున్నాయి. తాటిచెట్టును కేతనం మీద నిలుపుకొని, తమకు సాధనమైన, నాగలిని ఆయుధంగా కలిగి, తమను హర్ష కులుగా చేసిన, బలరాముని జయంతి దినమైన, అక్షయ తదియ తెలుగునాట కర్షకుల కార్యకలాపాలకు, ముఖ్య కేంద్రంగా మారింది. అందుకే ఈ ప్రాంతం కర్షకులు, తమ పొలాలలో గృహస్తులు తమ పెరళ్ళలో, ఏ రోజున కూర పాదులు కట్టడం కూడా సనాతన ఆచారంగా మారింది. మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన, అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి, దాచి ఉంచితే, సంపద ఇతోధికంగా వృద్ధి కాగలదనే విశ్వాసంతో, అక్షయ తృతీయ రోజున, బంగారం కొనడం సాంప్రదాయంగా ఆచరించ బడుతున్నది. “వైశాఖే మాసి రాజేంద్ర, శుక్ల పక్ష తృతీయ కా: అక్షయాసా తిథి: ప్రోక్తా కృత్తికా రోహిణీ యుతా:
అక్షయ తృతీయ సోమ లేదా బుధవారాల్లో అయితే విశిష్టమని, కృత్తిక రోహిణీ నక్షత్రముతో కూడి ఉన్నది అయితే, పర్వం అతి ప్రశస్తం అని భావన. ఈ పర్వం పూర్వాహ్న వ్యాపిని అనీ, వ్రత రాజము చెపు తున్నది. ఇది ఒక గొప్ప పుణ్య దినంగా భావించ బడుతున్నది. ఈనాడు నదీస్నానం, సకల పాప విమోచన కరమని, ఒక పూట భోజనం చేయాలని భక్తుల విశ్వాసం. లక్ష్మి సహిత నారాయణుని, గౌరీ సహిత త్రిలోచనుని, పూజించడం శ్రేష్ఠం తరంగా చెప్పబడింది. పూజ సమయంలో విసనకర్రలు, లడ్డూలు పంచితే వైకుంఠాన్ని, శివ లోకాన్ని పొందగలరని శాస్త్ర వచనం.

:: అక్షయ తృతీయ విశిష్టతలు ::

మన పురాణాలు, పండితులు చెబుతున్న అక్షయ తృతీయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి.
ఈ రోజే మహా విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని జననం.ఈ పవిత్ర దినానే త్రేతాయుగం ప్రారంభమైనదని పండితుల మాట.
గంగమ్మ భువిపై ఉద్భవించిన రోజు ఈ రోజే. అక్షయ తృతీయ నాడే వ్యాస మహర్షి “మహా భారతం” పవిత్ర గ్రంధాన్ని రచన పారంభించిన రోజు.
ఈ రోజే అమ్మ “అన్నపూర్ణ దేవి” అవతరించిన రోజు.
అక్షయ తృతీయ పవిత్ర దినాన్నే కుబేరుడు శివానుగ్రహాన్ని పొంది మహలక్ష్మి ద్వారా అనంత సంపదను పొంది సంరక్షకుడిగా నియమింప బడ్డాడు.
శ్రీకృష్ణుడు ద్రౌపదిని దుశ్చాసన దుశ్చర్య నుండి కాపాడిన దినం. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగించి అపార సంపదను అనుగ్రహించిన రోజు.
సూర్య భగవానుడు అజ్ఞాత వాసంలో పాండవులకు “అక్షయపాత్ర”ను ఇచ్చినరోజు.
ఆదిశంకరుల వారు ఓ పేద వృద్ద జంట లబ్ది కోసం సృష్టిలో తొలిసారి “కనకధారాస్థవం” స్తుతించిన రోజు.
ఈ పవిత్ర దినానే, దివ్య క్షేత్రం “బద్రీనాథ్” ఆలయ ద్వారాలు 4 నెలల దర్శన విరామం తర్వాత, పునః దర్శనార్ధమై తెరుచుకో బడతాయి. ఏ ఏటికా ఏడు ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు. ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు(Akshaya Tritiya).
బృందావనం లోని బంకే బిహరి ఆలయంలో, శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments