Homespecial Editionఅక్కినేని, దుక్కిపాటి లది అద్వితీయ అనుబంధం

అక్కినేని, దుక్కిపాటి లది అద్వితీయ అనుబంధం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండిదుక్కిపాటి మధుసూదనరావు ( జూలై 17, 1917 మార్చి 26, 2006) కు తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి ఒక్కరు. అక్కినేనికి చిత్రసీమలో మార్గదర్శిగా నిలచి ఆయన నటునిగా సినీ చరిత్రలో నిలచి పోయేలా చేయడంలో ప్రధాన భూమిక పోషించారు దుక్కిపాటి.
అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత. దుక్కిపాటి 1951సెప్టెంబరు10వ తేదీన అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు టి.వి.ఎ.సూర్యారావు లతో కలసి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి, మొదటి ప్రయత్నంగా “దొంగరాముడు” సినిమాను తీశారు. దుక్కిపాటి తనని అమ్మకన్నా మిన్నగా పెంచి పోషించిన సవతితల్లి అన్నపూర్ణ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దానికి అక్కినేని నాగేశ్వరరావుని ఛైర్మన్ ను చేశారు.

కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పెయ్యేరు గ్రామంలో దుక్కిపాటి మధుసూదనరావు జూలై 27, 1917 న సంపన్న వ్యవసాయ కుటుంబంలో గంగాజలం, సీతారామస్వామి దంపతులకు జన్మించారు. బందరు నోబుల్ కళాశాలలో బి.ఏ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీ స్థాయిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించారు.

చదువు పూర్తి చేసుకున్న దుక్కిపాటి, తాను కార్యదర్శిగా ఎక్సెల్సియల్‌ క్లబ్బు అనే నాటక సంస్థను ప్రారంభించారు. కోడూరి అచ్చయ్య, ఎం.ఆర్‌.అప్పారావు వంటి మిత్రులతో కలసి ఆ క్లబ్బు పక్షాన నాటకాలు విరివిగా ప్రదర్శించారు.

ఎక్సెల్సియల్‌ క్లబ్లులో దుక్కిపాటితో పాటు పెండ్యాల, బుద్ధిరాజు శ్రీరామమూర్తి వంటివారు ఉండేవారు. వారి సహకారంతో ఆయన ఆశాజ్యోతి, సత్యాన్వేషణ, తెలుగుతల్లి వంటి సాంఘిక నాటకాలను రాయించి చేపట్టారు. అవి ఘన విజయాలను నమోదు చేసుకున్నాయి.

ఆ సమయంలో దుక్కిపాటికి అక్కినేనితో పరిచయం విచిత్రంగా కలిగింది. అప్పటికే అక్కినేని ధర్మపత్ని చిత్రంలో నటించి వెనక్కి వచ్చేశారు. బుద్ధిరాజు శ్రీరామమూర్తి సలహాతో ‘విప్రనారాయణ’ నాటకంలో దేవదేవి పాత్ర పోషిస్తున్నారు. ఆ నాటక ప్రదర్శన చూసిన దుక్కిపాటి, తమకు కథానాయిక/స్త్రీ పాత్ర లేని లోటు తీరిందని అక్కినేనిని హీరోయిన్ని చేశారు. అలా వారంతా నాటకాల్లో బిజీగా ఉన్నప్పుడే ఘంటసాల బలరామయ్య ఓ రైల్వేస్టేషన్లో అక్కినేనిని చూసి తన సినిమాకు ఆయనే తగిన వ్యక్తి అని నిర్ధారించుకొని చిరునామా తీసుకొన్నారు. తర్వాత గుడివాడకు వచ్చి అక్కినేనికి కబురు చేశారు. దుక్కిపాటి, రామబ్రహ్మం (అక్కినేని సోదరుడు) ఇద్దరూ అక్కినేనిని ఘంటసాల బలరామయ్య వద్దకు తీసుకెళ్లారు. ఆయన వారిని మద్రాసు కొచ్చి ‘ప్రతిభ’ ఆఫీసులో సంప్రదించ మన్నారు. దుక్కిపాటి, మరో మిత్రుడు సూర్యప్రకాశరావుతో కలసి అక్కినేనిని తీసుకొని మద్రాసులో ‘ప్రతిభ’ ఆఫీసుకు వెళ్లగా, పేకేటి అక్కినేని స్వాగతించారు. అలా ‘సీతారామ జననంలో అక్కినేని హీరో అయ్యారు. ఆ తర్వాత దుక్కిపాటి, బలరామయ్య, చల్లపల్లి రాజాలతో కలసి గూడవల్లి రామబ్రహ్మం దగ్గరకెళ్లి అక్కినేనిని ‘మాయాలోకం’లో చిత్రానికి తీసుకొమ్మని సూచించారు. దుక్కిపాటి మధుసూదనరావు తనని అమ్మకన్నా మిన్నగా పెంచి పోషించిన సవతితల్లి “అన్నపూర్ణ” పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దానికి అక్కినేని నాగేశ్వరరావుని ఛైర్మన్‌ని చేశారు. ఆ సంస్థ ద్వారా తొలిసారి “దొంగరాముడు” చిత్రం నిర్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రల జంట కన్నుల పండువుగా నటించడంతో అది ఘనవిజయం సాధించింది. దుక్కిపాటి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, చదువుకున్న అమ్మాయిలు, ఇద్దరు మిత్రులు, డాక్టర్‌ చక్రవర్తి, ఆత్మ గౌరవం, పూలరంగడు, విచిత్రబంధం, ప్రేమలేఖలు, రాధాకృష్ణ, పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి… వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు. డాక్టర్‌ చక్రవర్తి చిత్రం రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన తొలి నంది అవార్డును అందుకోవడం విశేషం. అధిక చిత్రాలు ఘనవిజయం సాధించాయనడంలో సందేహం లేదు. తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమా “ఇద్దరు మిత్రులు”. అన్నపూర్ణ సంస్థ నిర్మించే సినిమాలకు ఎక్కువగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించే వారు. దుక్కిపాటి తన సినిమాలలో కొర్రపాటి గంగాధరరావు, యుద్దనపూడి సులోచనరాణి, గొల్లపూడి మారుతీరావు, ముప్పాళ్ల రంగనాయకమ్మ (సంభాషణల రచయిత్రి), కె.విశ్వనాథ్ (దర్శకుడు), ఆశాలత కులకర్ణి, జి. రామకృష్ణ, జీడిగుంట రామచంద్ర మూర్తి, శారద వంటి కళాకారులను పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి అక్కినేనితోపాటు దుక్కిపాటి మధుసూదనరావు ఎంతో కృషి చేశారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. అలా దుక్కిపాటి, అక్కినేని ఇద్దరూ తమ సంబంధం, బంధం, అనుబంధం అద్వితీయం అని నిరూపించారు. దుక్కిపాటి 90 యేళ్ళ వయసులో 26 మార్చి, 2006 రోజున మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments