5.1 C
New York
Saturday, March 25, 2023
Homespecial Editionఅలనాటి మేటి గాయకులు ఏ. ఎం.రాజా

అలనాటి మేటి గాయకులు ఏ. ఎం.రాజా

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

……………………………

ఏ.ఎం.రాజా పేరు ఈ తరానికి అంతగా తెలియక పోవచ్చు. ఒకనాడు దక్షిణ భారత సినీ నేపథ్య గాయకుడుగా, అలనాటి కథానాయకులకు అందరికి తన మధురమైన గొంతును అందిం చారు. కేవలం పాటలతో సినిమాల విజయవంతానికి చేయూత అందించారు. హిందీలో మొట్ట మొదట ప్లేబాక్ పాడిన దక్షిణ దేశ గాయకుడైన ఘనత ఎ.ఎం. రాజాదే. బహుత్ దిన్ హుయె (1952)లో పాడారు.

తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు,
ఏ.యం.రాజా 1950వ దశకంలో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు.

రాజా కంఠస్వరం ప్రత్యేకమైనది. ఎక్కడ వినబడినా గుర్తించడం కష్టం కాదు. కాని అనుకరించడం మాత్రం సులభం కాదు. రాజా గళంలో ఒక వినూత్నమయిన సౌకుమార్యం, మార్దవం, మాధు ర్యం ఉండేది. ఆ ప్రత్యేకత వల్లనే సినిమారంగంలో రాజా మెల్లమెల్ల గా పైకెదిగారు. ఆయన సంగీత దర్శకత్వంలో ప్రాధాన్యత మెలడీకే ఇచ్చే వారు. రాసిలో తక్కువైనా వాసిలో ఏమాత్రమూ తక్కువ కానివి రాజా పాటలు.

ఏ. ఎం. రాజాగా సుప్రసిద్ధులైన ఏమల మన్మథరాజు రాజా 1929 సంవత్సరం జూలై 1వ తేదీన చిత్తూరు జిల్లాలోని రామచంద్ర పురంలో మన్మథరాజు – లక్ష్మమ్మ దంపతులకు పుట్టారు. పచ్చయప్ప కళాశాల నుండి 1951లో బీ. ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కళాశాలలో చదివేటప్పుడే ఎన్నో పాటల పోటీలలో పాల్గొని బహుమతులను పొందారు. మాస్టర్ నటరాజన్ వద్ద సంగీతా భ్యాసం పొందారు. రాజా స్వంతగా రాసి స్వరపరచిన రెండు పాటలను హెచ్.ఎం.వీ రికార్డు చేశారు. ఈ పాటలు ఆకాశవాణి 1951లో తరచూ ప్రసారం చేసేది. ఆయన పాడిన మొదటి రికార్డు ‘ఎంత దూర మీ పయనం’. ఈ పాటలను విన్న జెమినీ స్టూడియో అధినేత వాసన్ తాను తమిళంలో నిర్మిస్తున్న సంసారం చిత్రంలో రాజాను పాడమన్నారు.

తమిళంలో సుసర్ల దక్షిణామూర్తి దర్శకత్వంలో సంసారం, సంసారం అనే పాట (తెలుగులో దీనిని ఘంటసాల పాడారు) రాజా పాడిన మొట్టమొదటి సినిమా పాట. తెలుగు లో ఆయన పాడిన మొదటి పాటలు ‘ఆకలి’ ‘ఆదర్శం’, ‘సంక్రాంతి’ (1952) చిత్రాలలోనివి. కానీ గాయకుడిగా గుర్తింపు పొందింది పక్కింటి అమ్మాయి (1953) సినిమాలో పాడిన పాటలతో.

రాజా సరదాగా నటించి, పాడిన హాస్యరస చిత్రం పక్కింటి అమ్మాయి. చిత్రంలోని గీతాలు హాయి గొలిపే లలిత గాన మాధు ర్యానికి సంకేతాలుగా నిలిచా యి. అమర సందేశం గీతాలు కూడా రాజా శక్తిని నిరూపించాయి. శోభ, పెళ్ళి కానుక చిత్రాలకు, మరికొన్ని తమిళ చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు.

అన్ని భాషలలో పాడుతున్నా, తెలుగు తమిళ సినిమాలలోనే రాజా ఎక్కువగా పాడేవారు. ఆ సమయంలోనే ఎం. జీ. రామ చంద్రన్ నటించిన ‘జెనోవా’ చిత్ర నిర్మాణ సమయంలో పీ. జీ. కృష్ణవేణిని (జిక్కీ గా మనకు చిరపరిచితం ఆమె గాత్రం) చూడడం తటస్థించింది. ఇద్దరూ కలిసి సినిమాలలో యుగళ గీతాలు పాడేవారు. అలా ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ అలా పెరిగి పాటలలోనే కాకుండా జీవితంలో కూడా భాగస్వాము లయ్యారు.

రాజా సంగీత జీవితపు ఆరంభ దశలో అతనికి ఎక్కువ ఖ్యాతిని తెచ్చినవి మూడు చిత్రాలు – ప్రేమలేఖలు (1953), అమర సందేశం, విప్ర నారాయణ (1954). విప్రనారాయణ లోని చూడుమదే చెలియా’ లాంటి, పాటలు ఇప్పటికీ ఏమాత్రం వన్నె తగ్గనివే. సుశీలతో పాడిన మిస్సమ్మ (1955) చిత్రంలోని బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఒక మరపు రాని పాట. సంగీత ప్రధానమైన ‘అమర సందేశం’లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి ఆయన పాడిన రెండు సోలోలు: మధురం మధురం మనోహరం, ఆనతి కావలెనా గానానికి సమయము రావలెనా ఏనాటికీ మరిచి పోలేనివే..బంగారు పాప(1954), భాగ్యరేఖ(1957) చిత్రాలలో రాజా పాడిన పాటలు కూడా తీపి గుర్తులే. నేనూ ఒక మనిషినా (మేలు కొలుపు, 1956), అందాల రాణీ వీరకంకణం, 1957), తానేమి తలంచేనో (దాంపత్యం, 1957), ప్రభూ తొలిసంజ (సిపాయి కూతురు, 1959). ఇలా 1953-57 మధ్య కాలంలో రాజా నక్షత్రంలా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా ఒక రెండు సంవత్సరాల పాటు (1953 – 55) ఘంటసాల కంటే రాజా గాత్రానికే నిర్మాతలు, సంగీత దర్శకులు ప్రాధాన్యతనిచ్చారు. మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాజాను 1959లో అత్యుత్తమ సంగీత దర్శకునిగా గౌరవించింది.

రాజా గాయకుడు దర్శకుడు మాత్రమే కాదు, ఒక నటుడు కూడా. పక్కింటి అమ్మాయి (1953) చిత్రంలో రాజా నటనను అందరూ మెచ్చుకొన్నారు. ఇందులో ఒక విచిత్రమేమంటే, ఇదే పాత్రను హిందీ చిత్రంలో (పడోసన్, 1968) గాయక దర్శకుడు కిశోర్ కుమార్ వేయగా, మళ్లీ తీసిన (1976) తెలుగు చిత్రంలో ఈనాటి గాయక దర్శకుడు బాలసుబ్రహ్మణ్యం పోషించారు.

ఆయన కన్యాకుమారి జిల్లాలోని ఒక గుడిలో సంగీతకచ్చేరి చేసి తిరిగి వస్తుండగా తిరునల్వేలి జిల్లాలోని వల్లియూరులో జరిగిన రైలు ప్రమాదంలో 1989, ఏప్రిల్ 9న మరణించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments