అడ్వర్టయింజింగ్ దిగ్గజం ఏజీకే
………………………
ఫిబ్రవరి 5…ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకులు ఎ.జి.కృష్ణమూర్తి వర్ధంతి
……………..
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494
………………………
మానవులు పుడతారు. చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితంలో మేథో
మథనంతో, స్వయం కృషితో, ప్రజలకు గుర్తుండే, పనులు చేసి, చిరస్థాయిగా నిలిచి పోతారు. ప్రచార రంగంలో అలాంటి కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యాపార దిగ్గజం ఎ.జి.కృష్ణమూర్తి.
దేశంలోనే ప్రచార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘ముద్ర’ వ్యవస్థాపకుడు ఎ.జి.కృష్ణమూర్తి.
ముద్రా కమ్యూనికేషన్స్ (Mudra Communications) సంస్థాపక అధ్యక్షుడు ఎ. జి. కృష్ణమూర్తి. కేవలం 35 వేల నగదు తో, ఒకే ఒక క్లయింట్ తో వ్యాపార ప్రకటనా సంస్థ (advertising agency) స్థాపించి, కేవలం తొమ్మిదేళ్ళల్లో ముద్రా భారతదేశంలో ఉన్న పెద్ద వ్యాపార ప్రకటనా సంస్థలలో మూడవ స్థానాన్ని, స్వదేశీ వ్యాపార ప్రకటనా సంస్థలలో ప్రధమ స్థానాన్ని చేరుకునెలా కృషి చేశారు. ప్రభుత్వంలో చిన్న గుమస్థా ఉద్యోగంతో ప్రారంభించిన ఎ. జి. కె. తెలుగువారు గర్వించదగ్గ అతి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ధీరూభాయ్ అంబానీకి అతి చేరువలో ఉండి ఈ సంస్థని ఇంత త్వరగా ఉన్నత స్థాయికి లేవనెత్తి ఆయనచేత శభాష్ అనిపించు కున్నారు.
ఎ.జి.కృష్ణమూర్తి (అచ్యుతాని గోపాల కృష్ణమూర్తి) 1942, ఏప్రిల్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. అయన ముద్రా కమ్యూనికేషన్స్ సంస్థాపక అధ్యక్షులు. తెలుగువారు గర్వించదగ్గ వ్యాపార దిగ్గజం.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బి.ఏ హానర్స్ పట్టా పుచ్చుకొని 1968లో 60, 70వ దశకాలలో వస్త్ర పరిశ్రమలో బాగా పేరున్న కాలికో మిల్స్ లో గిరాబెన్ సారాభాయికి సహాయకుడిగా చేరారు. 1972లో అదే కంపెనీకి చెందిన వ్యాపార ప్రకటన సంస్థ అయిన “శిల్పా అడ్వర్టైజింగ్” లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా పదోన్నతి పొందారు. 1976లో రిలయన్స్ సంస్థలకు ఆడ్వర్టైజింగ్ మేనేజరుగా చేరి, నాలుగు సంవత్సరాలు తిరక్కుండానే సొంత వ్యాపార ప్రకటనా సంస్థ “ముద్రా కమ్యూనికేషన్స్” ను 1980, మార్చి 25న స్థాపించారు. రిలయన్స్ సంస్థ ప్రధాన కార్యాలయంలో అడ్వర్టయిజింగ్ డెరైక్టర్‌గా చేరిన ఏజీకే అడ్వర్టయి జింగ్ రంగంలో శిఖర సదృశుడైన ఫ్రాంక్ సియాయిస్‌తో కలసి అద్భుతాలు చేశారు. రిలయన్స్ సంస్థ ఉత్పత్తి చేసిన సిల్కు చీరలూ, ఇతర దుస్తులకూ విమల్ బ్రాండ్‌తో ప్రకటనలు తయారు చేయడంలో ఫ్రాంక్ అనేక విన్యాసాలు చేశారు.
‘ఓన్లీ విమల్’ అన్నది అందరికీ, ఎప్పటికీ గుర్తు ఉండే సృజనాత్మక ప్రకటన. విమల్ కోసం తయారు చేసిన మొదటి అడ్వర్టయిజ్ మెంట్ … “ఒక స్త్రీకి ఎన్నెన్నో మనోభావాలు”. అడ్వర్టయిజ్ మెంటు రకరకాల రూపాలు సంతరించుకొని అత్యధికంగా పత్రికలలో, రేడియోలలో వచ్చి విమల్ చీరలకు అసాధారణమైన ఆదరణ తెచ్చింది.
ఫ్రాంక్ సియాయిస్ సొంత ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత, రిలయన్స్ ప్రత్యర్థులు ఆయన క్లయింట్లు అయిన కారణంగా రిలయన్స్ స్వయంగా ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నెలకొల్పాలనీ, దానికి ‘ముద్ర’ అని పేరు పెట్టాలనీ ఏజీకే చేసిన సూచనను ధీరూభాయ్ అంబానీ ఆమోదించారు. ఆయన రూ. 35 వేల నగదు తోను ఒకే ఒక క్లయింట్ తోను వ్యాపార ప్రకటనా సంస్థ స్థాపించారు. కేవలం తొమ్మిదేళ్ళల్లో ముద్రా భారత దేశంలో ఉన్న పెద్ద వ్యాపార ప్రకటనా సంస్థలలో మూడవ స్థానాన్ని, స్వదేశీ వ్యాపార ప్రకటనా సంస్థలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది. 1980లో ముద్ర వెలిసింది. ఒక వెలుగు వెలిగింది. కార్పొరేట్ రంగంలో “అడ్వర్టయింజింగ్ జీనియస్”గా ఏజీకే గుర్తింపు పొందారు. దేశ వ్యాప్తంగా విమల్ షోలు నిర్వహించి విమల్ విజయ పరంపరను కొనసాగించడంలో ఏజీకేది అద్వితీయమైన పాత్ర. ‘ఐ లవ్ యూ రస్నా’ కూడా ఆయన సృష్టే. ప్రభుత్వంలో చిన్న గుమస్థా ఉద్యోగంతో ప్రారంభించిన ఎ. జి. కె. తెలుగువారు గర్వించదగ్గ అతి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ధీరూభాయ్ అంబానీకి అతి చేరువలో ఉండి ఆ సంస్థను అంత త్వరగా ఉన్నత స్థాయికి లేవనెత్తి ఆయన చేత శభాష్ అనిపించు కున్నారు. ఆయన తమ అనుభవాలను పుస్తకాల రూపంలోనూ, పత్రికా శీర్షికల ద్వారా రాసి యువతను ఉత్తేజ పరిచారు. కృష్ణమూర్తి తెలుగు పత్రికలో వారం వారం అనే శీర్షికను, ఆంగ్ల పత్రికలలో ఏజికె స్పీక్ (AGK Speak) అనే శీర్షికను రాశారు. ఆయన ‘ధీరూభాయిజమ్’ అనే పేరుతో తెలుగులో, ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. ‘ఎదురీత’ పేరుతో మరో పుస్తకం రాశారు. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఆయన రచనలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. ‘ఇదండీ నా కథ’ అనేది ఏజీకే ఆత్మకథ. అదే ఆయన చివరి రచన. అంచెలంచెలుగా ఎదుగుతూ యాడ్స్ రంగ దిగ్గజ వ్యక్తుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కృష్ణమూర్తి తెలుగు, ఆంగ్లంలో 15కు పైగా పుస్తకాలు రచించారు. 2013లో ఇఫ్ యు కెన్ డ్రీమ్ పేరుతో తన ఆత్మకథను పుస్తక రూపంలో విడుదల చేశారు.
ముద్రా కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్‌ను స్థాపించారు. కాలమిస్టుగా, రచయితగా ఆంగ్లంలోనూ, తెలుగులోనూ పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. ఆయన పుస్తకాలు అతి కొద్దికాలంలో పలు భారతీయ భాషల్లో ప్రచురింపబడి, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ఆయన 73వ యేట ఫిబ్రవరి 5, 2016న హైదరాబాదులో మరణించారు.