5.1 C
New York
Wednesday, March 29, 2023
HomeLifestyleLife styleజాతీయ పతా కానికి 101 వసంతాలు

జాతీయ పతా కానికి 101 వసంతాలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయ పతాకాలు మూడు రంగులవే. భారతీయులు సగర్వంగా, సగౌరవంగా తలెత్తి వందనం చేసే, భారత సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య. గాంధీజీ కోరిక మేరకు 1921 మార్చి 31న వెంకయ్య జాతీయ జెండాకు రూప కల్పన చేశారు.

స్వాతంత్ర్య సమరయోధునిగా, వ్యవసాయ, భూగర్భ ఖనిజ శాస్త్రవేత్తగా, జపనీస్ భాషా బోధకునిగా, చిత్రకారునిగా, వివిధ దేశాల పర్యాటకునిగా, బహుముఖ ప్రజ్ఞ కలిగిన వెంకయ్యను భారతీయులంతా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అనివార్యం. 1878 ఆగస్టు 2న కృష్ణాజిల్లా పెద్ద కళ్ళేపల్లెలో, జన్మించిన వెంకయ్య, భట్లపెనుమర్రిలో విద్యాభ్యాసం ముగించుకొని, తన 19 వ ఏట ముంబై వెళ్లి సైన్యంలో చేరారు.
మద్రాసులో ఫ్లేగు ఇనస్పెక్టరు శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్లారిలో ప్లేగ్ ఇనస్పెక్టరుగా పనిచేసారు. అతని జ్ఞాన దాహం అంతులేనికి. శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనమిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేసాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఎ.వి. కాలేజీలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడే వెంకయ్య గారిని “జపాన్ వెంకయ్య” అని పిలిచేవారు.
1899 – 1902 మధ్య డచ్ సైన్యానికి వ్యతిరేకంగా, దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే ఆయనకు స్వాతంత్రోద్యమ నిర్దేశకులు, భావిభారత జాతిపిత మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది. భూగర్భ ఖనిజ శాస్త్రవేత్తగా మైకా, వజ్రాలపై ఆయన విస్తృత పరిశోధనలు జరిపారు. స్వదేశం వస్తూ అరేబియా, ఆప్ఘనిస్థాన్ లు చూచి వచ్చారు. గాంధీజీ పరిచయం అయిన నాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకొని, దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై, నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపారి.
1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం” అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారు.
1916 లో “నీడ్ ఫర్ నేషనల్ ఫ్లాగ్” పేరున 30 నమూనాలతో జాతీయ పుస్తక రచన గావించారు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాశారు.1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగుర వేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన “లాలా హన్స్ రాజ్” మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరారు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, మార్చి 31న ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన, తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయ పడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి, నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు.
“మడత పెడితే పిడికెడే కానీ, కోటానుకోట్ల భారతీయుల ప్రియ వస్త్రం”గా “గాంధీజీ”చే, వెంకయ్య రూపకల్పన చేసిన జాతీయ పతాకం ప్రశంసా పాత్రమైంది.
1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.

1947 ఆగస్టు 15 న బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి కొద్ది రోజుల ముందు, 1947 జులై 22న న జరిగిన రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో భారత జాతీయ పతాకాన్ని ఇప్పుడు ఉన్న రూపంలో స్వీకరించారు.

స్వతంత్ర భారతదేశ జాతీయపతాకాన్ని నిర్ణయించడానికి రాజ్యాంగసభ, 1947 జూన్ 23న బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, కె.ఎం.పణిక్కర్, సరోజినీ నాయుడు, రాజాజీ, కె.ఎం.మున్షీ, బి.ఆర్.అంబేద్కర్ లతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 1947 జూలై 14న కాంగ్రెస్ పతాకాన్నే అన్ని పార్టీలకు, మతాలకు ఆమోదయోగ్యమయ్యే మార్పులతో జాతీయపతాకంగా స్వీకరించాలని నిర్ణయించింది. దాంట్లో మతపరమైన సూచికలేవీ ఉండరాదని తీర్మానించింది. చరఖా స్థానంలో సారనాథ్ స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ కొత్త పతాకాన్ని స్వతంత్ర భారత జాతీయపతాకంగా ఉద్వేగభరిత వాతావరణంలో 1947 ఆగష్టు 15 నాడు ఆవిష్కరించారు.

పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమం లోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బెంగుళూరు, మద్రాసు లలో “రైల్వే గార్డు”గా పనిచేశారు. ఆ తరువాత కొంత కాలము బళ్లారిలో “ప్లేగు అధికారి”గా ప్రభుత్వ ఉద్యోగము చేశారు. వెంకయ్యలో ఉన్న దేశభక్తి ఆయనను ఎంతో కాలము ఉద్యోగము చేయనివ్వలేదు.
1906 నుండి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటు మునగాల పరగణా నడిగూడెంలో జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు కోరిక మేరకు, నడిగూడెంలో నివాసముండి, పత్తి మొక్కలలోని మేలు రకముల పరిశోధనలో వినియోగించారు. నడిగూడెంలో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాడు. ఈ పరిశోధనలలో “కంబోడియా పత్తి” అను ఒక ప్రత్యేక రకమైన పత్తి మీద విశేష కృషి చేశారు. ఆయన కృషిని ఆనాటి బ్రిటీషు ప్రభుత్వముకూడా గుర్తించడముతో ఆయనకు “పత్తి వెంకయ్య” అని పేరు వచ్చింది.
తరువాత నెల్లూరు చేరి, 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశారు. వజ్రకరూరు, హంపిలలో ఖనిజాలు, వజ్రాలు గురించి విశేషంగా పరిశోధనలు జరిపి ప్రపంచానికి తెలియని వజ్రపు తల్లిరాయి అనే గ్రంథం రాసి 1955లో దాన్ని ప్రచురించారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేసారు.
అయితే వెంకయ్య జీవిత చరమాంకం దయనీయ స్థితిలో ముగిసింది.1960 లో భారత ప్రభుత్వం భూగర్భ ఖనిజాలు సంస్థ సలహాదారునిగా వెంకయ్యకు ఇచ్చే గౌరవ వేతనాన్ని సైతం నిలిపి వేసింది. వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టు ముట్టాయి. మిలటరీలో పని చేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో, ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి, నానా అగచాట్లు పడినట్లు ‘ త్రివేణి ‘ సంపాదకులు డా. భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సత్కరించి, కొంత నిధిని అందించారు. కన్నుమూసే ముందు ఆయన చివరి కోరికను వెల్లడిస్తూ ” నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక ” అన్నారు.
ఆత్మాభిమానానికి మారుపేరైన వెంకయ్య, కడు పేదరికాన్ని అనుభవిస్తూ, 1963 జూలై 4న విజయవాడలో తుది శ్వాస వదిలారు. 1964 లో జూలైలో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, వెంకయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించినా, విజయవాడ గాంధీ హాల్ నందు విగ్రహావిష్కరణ జరిగినా, భారతీయులు ఆచంద్ర తారార్కం గుర్తుంచు కోవలసిన పింగళి వెంకయ్యకు… రావలసిన గౌరవం రాకపోవడం నిజంగా బాధాకరం. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపజేసి, కొంతలో కొంతైనా ప్రజలకు గుర్తుండేలా చేసింది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments