మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకఘట్టం -రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రాన్ని కదిలించిన దీక్ష -కేసీఆర్ నిరవధిక నిరశనకు నేటితో పదేండ్లు
తెలంగాణ మలిదశ ఉద్యమం లో అదో కీలకఘట్టం! అహింసాయుత ఉద్యమానికి ముఖ్యమైన రోజు.. తెలంగాణ యావత్తూ ఒక్కతాటిపైకి వచ్చేలా చేసిన సందర్భం! నాటి ఉద్యమ సారథిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సరిగ్గా పదేండ్లక్రితం ఇదే రోజున చేపట్టిన దీక్ష..
ఆరు దశాబ్దాల ఉద్యమ చరిత్రను తిరగరాసింది. ఆ స్ఫూర్తితో ఆనాడు ఎగిసిన ఉద్యమకెరటం.. సుదీర్ఘ దోపిడీపాలన మూలాలను కదిపివేసింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..
అన్న మొండితనంతో ప్రాణాలకు తెగించి ఆనాడు చేపట్టిన దీక్ష.. నవచరిత్రకు నాంది పలికింది. తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. 2009 నవంబర్ 29న సిద్దిపేటను కార్యక్షేత్రంగా ఎంచుకున్న కేసీఆర్ పోరాటం..
దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. మహాత్మాగాంధీ చూపిన అహింసామార్గంలో ఉద్యమాన్ని నడిపి చివరకు ఆమరణ దీక్షనే అస్త్రంగా సంధించిన కేసీఆర్ త్యాగఫలమే నేటి తెలంగాణ.
ఆ మహాదీక్షను నెమరువేసుకుంటూ ఏటా నవంబర్ 29ని దీక్షాదివస్ పేరిట రాష్ట్రంతోపాటు వివిధ దేశాల్లోనూ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఆకాంక్ష చాటిన దీక్ష
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న భావోద్వేగాలు.. రాలిపోతున్న తెలంగాణ బిడ్డలు.. మనసులు కరుగని కరకు పాలకులు! అరవై ఏండ్ల అరిగోసకు ఇకనైనా ముగింపు పలకాల్సిందేనన్న దృఢ నిశ్చయానికి వచ్చిన కేసీఆర్.. ఇదే రోజు నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
సిద్దిపేటలో దీక్షకు దిగాల్సి ఉండగా.. నాటి ఉమ్మడి పాలకులు నిరంకుశంగా వ్యవహరించి.. దీక్షాస్థలికి వెళ్లే మార్గంలోనే కేసీఆర్‌ను అరెస్టు చేశారు. అయినా మొక్కవోని దైర్యంతో దీక్షను కొనసాగించిన కేసీఆర్.. దేశానికి తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పారు.
తెలంగాణ సాధనకు సబ్బండవర్ణాలను కార్యోన్ముఖులనుచేశారు. రాష్ట్ర సాధనకు దీక్షను ఆయుధంగా వాడుకున్నారు. నానాటికీ కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేసింది.
తెలంగాణ యావత్తూ సంతోషంతో వేడుక చేసుకున్న ఆ సందర్భాన్ని జీర్ణించుకోలేని సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలు అడి ప్రకటనను వెనక్కి తీసుకునేలాచేశారు.
కానీ.. కేసీఆర్ వాటికి వెరువకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతంచేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ యావ త్తూ ఉద్యమించింది. కలలు కన్న తెలంగాణను సాధించుకున్నారు. ఈ క్రమంలోనే ఏటా నవంబర్ 29ని తెలంగాణ సమాజం దీక్షాదివస్ పేరిట స్ఫూర్తిదాయకంగా గుర్తుచేసుకుంటున్నది.
దీక్షాదివస్ సందర్భంగా సేవా కార్యక్రమాలు
దిక్షాదివస్ సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్వీ నాయకులను కోరారు.