ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ k’. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, దీపికా పదుకొణె ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కల్కి 2898 AD’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఇక గ్లింప్స్ కూడా హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంది. అయితే రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. ఈ సినిమాని 2024 లో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు కానీ తేదీని మాత్రం చెప్పలేదు. దీంతో ఈ సినిమా జనవరి 12 వ తేదికి రావడంలేదని, అందుకే కేవలం 2024 లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారని అర్థమవుతోంది. మరి ఈ సినిమా నిజంగా వేసవిలోనే వస్తుందో లేదో తెలియాలంటే కొత్త విడుదల తేదీని ప్రకటించేవరకు వేచి చూడాలి.