ఎన్నెన్నో విశిష్ట లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాణం ఆద్యంతం ఆసక్తికరం. దాదాపు మూడేళ్లపాటు సాగిన రాజ్యాంగ రచనలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు? మహామహుల కృషి ఏరీతిన సాగింది? అనేవి కీలకాంశాలు.
రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం
భారత్‌లోని రాష్ట్రాల శాసనసభలకు తొలుత ఎన్నికలు నిర్వహించి.. తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటామంటూ 1945 సెప్టెంబరు 19న ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో నాటి గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ప్రకటనతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది.

1946 డిసెంబరు 6న రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం జరిగింది. ఎన్నికైన ప్రముఖుల్లో జవహర్‌లాల్ నెహ్రూ (భారత జాతీయ కాంగ్రెస్), బాబూ జగ్జీవన్‌రామ్ (కార్మిక వర్గం), మహమ్మద్ అలీ జిన్నా (ముస్లింలీగ్), డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ (షెడ్యూల్డ్ కులాలు), శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఎం.ఆర్.జయకర్ (హిందూ మహాసభ), సర్వేపల్లి రాధాకృష్ణన్, సరోజినీనాయుడు తదితరులున్నారు.
తెలుగు నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, కళావెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్.జి.రంగా, బొబ్బిలి రామకృష్ణరంగారావు ఎన్నికయ్యారు.
1949 నవంబరు 26
2వేల సవరణల అనంతరం ప్రజాభి ప్రాయాలకు పట్టం కడుతూ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది