రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా జపాన్ లో సంచలన వసూళ్లతో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ కారణంగా జపాన్ లో ఎన్టీఆర్, చరణ్ లకు కొత్తగా ఎందరో అభిమానులు వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇండియన్ సినిమాలకు జపాన్ లో మంచి గుర్తింపు వస్తోందని, ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ను జపాన్ ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారని చెప్పారు. అలాగే ఆర్ఆర్ఆర్ లో నటించిన ‘రామారావు జూనియర్’ తన అభిమాన నటుడని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా జపాన్ మంత్రి తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని చెప్పడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.